- పెంబర్తి, చంద్లాపూర్ గ్రామాల ఎంపిక
- 27న అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా అందజేత
- జీ-20 సహా అంతర్జాతీయ వేదికలపై అతిథులకు కానుకగా తెలంగాణ వస్త్ర, కళా ఉత్పత్తులు…
- మన కళల గౌరవాన్ని పెంచిన ప్రధాని మోదీ
న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25 : కేంద్ర ప్రభుత్వం..తాజాగా 2 తెలంగాణ గ్రామాలను ఈ సంవత్సరానికి గానూ ఉత్తమ పర్యాటక గ్రామాలుగా ఎంపిక చేసింది. ఈ అవార్డులకు ఎంపికైన మొదటి గ్రామం..జనగామ జిల్లా పెంబర్తి. కాకతీయుల కాలం నుంచీ..ఈ గ్రామం హస్తకళలకు ప్రసిద్ధి చెందిన సంగతి తెలిసిందే. ఇత్తడి, కంచు లోహాలతో ఈ గ్రామంలో చేసే కళాకృతులకు ఉన్న డిమాండ్ దృష్ట్యా వీటిని పెద్దమొత్తంలో అమెరికా, జర్మనీ, బెల్జియం, జపాన్ తదితర దేశాలు దిగుమతి చేసుకుంటున్నాయి. సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే కళాకృతులు, దేవతల విగ్రహాలు, కళా ఖండాలు, గృహ అలంకరణ వస్తువులెన్నో ఇక్కడి కళాకారుల చేతివృత్తుల నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తాయి. దీనికితోడు ఏటా 25 వేల మంది పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి.
తెలంగాణ సంస్కృతిని ప్రోత్సహించే విషయంలో ఇక్కడి కార్మికులు చేస్తున్న కృషి…తద్వారా జరుగుతున్న ఆర్థిక కార్యకలాపాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని..పెంబర్తిని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పెంబర్తి ఉత్పత్తులకు జీఐ ట్యాగ్ గుర్తింపు విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం చొరవతీసుకుంది. ఇక ఈ అవార్డులకు తెలంగాణ నుంచి ఎంపికైన రెండో గ్రామం సిద్దిపేట జిల్లా చంద్లాపూర్. రంగనాయక స్వామి దేవాలయం, రంగనాయక కొండలు, ఇక్కడి ప్రకృతి..తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తే.. ఈ ప్రాంతంలో నేసే ‘గొల్లభామ’ చీరలు తెలంగాణ కళా సంస్కృతికి ప్రతిబింబాలుగా నిలుస్తున్నాయి. గొల్లభామ చీర..తెలంగాణ నేతన్నల కళా నైపుణ్యానికి నిలువుటద్దం. కళాత్మకత, చేనేతల కలబోతకు నిదర్శనం. నెత్తిన చల్లకుండ, చేతిలో పెరుగు గురిగి, కాళ్లకు గజ్జెలు, నెత్తిన కొప్పుతో కళకళలాడే యాదవ మహిళల వైభవం ఈ చీరల్లో ఇమిడిపోయి కనిపిస్తుంది.
ఈ అవార్డులను సెప్టెంబర్ 27వ తేదీన..ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా..దిల్లీలో ఏర్పాటు చేయబోయే కార్యక్రమంలో అందజేయనున్నారు. ఇటీవల జరిగిన జీ-20 సమావేశాలైనా.. భూదాన్ పోచంపల్లి ఇక్కత్ చీరలను, ఇక్కడి నేతన్నలు నేసిన కండువాలను వివిధ దేశాల అధినేతలకు, విదేశీ ప్రముఖులకు అందజేశారు. వివిధ విభాగాలకు సంబంధించిన జీ20 సమావేశాలకు హాజరైన విదేశీ ప్రతినిధులకు కూడా పోంచపల్లిలో నేసిన చీరలను కేంద్ర ప్రభుత్వం ద్వారా గిఫ్ట్‌లుగా అందజేశారు. 2021లో భూదాన్ పోచంపల్లి గ్రామానికి యుఎన్‌డబ్ల్యుటిఓ ఉత్తమ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించే విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకున్న సంగతి తెలిసిందే.


