తెలంగాణ ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరుతో నేడు జూన్ 7 న ‘‘సాగునీటి దినోత్సవం’’ నిర్వహించు కుంటుంది.సాగునీటి రంగంలో వర్షాభావ పరిస్థితులు తో పండిన పంటలను తామే పండించినట్లుగా చెప్పుకో వడానికి బాజా బజింత్రలతో ప్రతి నియోజక వర్గంలో సభలు జరుపుకుంటుంది.రాజధాని కేంద్రం లో ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాల పై,సభలో ఈ రాష్ట్ర రైతుల కష్ఠాలను తమ ఖాతాలో వేసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్దమవుతున్నారు.ఈ సందర్భంగా బాధ్యత గల పౌర సమాజమైన తెలంగాణ విద్యావంతుల వేదికగా సాగునీటి రంగంలో గత పాలకుల తీరును మరియు స్వరాష్ట్ర పాలకుల విధివిధానాలను విశ్లేషించి సమగ్రంగా తెలంగాణ సమాజం ముందు ఉంచుతున్నాము.
2004 నుంచి 2014 వరకు 33 ప్రాజెక్టులతో 97న్నర లక్షల ఎకరాల భూమి సాగు సాగులోకి తీసుకొచ్చేందుకు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 38,405 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది.ఫలితంగా తెలంగాణలో నిర్మాణం చేపట్టిన ప్రాజెక్టులో 32 ప్రాజెక్టులు దాదాపు 90% పనులు పూర్తి చేసుకున్నాయి.కేవలం 10 వేయిల కోట్ల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం కేటాయించి ఖర్చు చేయగలిగితే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకొని దాదాపు కోటి ఎకరాల భూమి లో తక్షణమే 50 లక్షల ఎకరాలకు పైగా సాగు యోగ్యంలోకి తీసుకురావొచ్చు.కాని తెలంగాణ ప్రభుత్వం వాటిపైన దృష్టి పెట్టకుండా ‘ప్రాజెక్టు రీ డిజైన్ ‘ ల పేర్ల మీద కాలయాపన చేయడమే కాకుండా పెద్ద ఎత్తున నిధులను దుర్వినియోగపరిచింది.ఫలితంగా నేటికి తెలంగాణలో ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పథకాలుగానే కనిపిస్తు న్నాయి.తెలంగాణ వచ్చిన తర్వాత ఈ తొమ్మిదేళ్ల కాలంలో వర్షాలు పుష్కలంగా పడుతుండడంతో అప్పటికే పూర్వంగా ఉన్న జలాశయాలు చెరువులు నిరంతరం నిండుతుండడంతో తెలంగాణలో జలసిరులు పండుతు న్నాయి. ప్రభుత్వ నీటి పథకాలతో తెలంగాణకు ఒనగూరింది ఏమి లేదనే విషయం పరిశీలిస్తే అర్థమవుతుంది.
కాళేశ్వరం కథ-తెల్ల ఏనుగు
ఉమ్మడి రాష్ట్రంలో 16 లక్షల 40 వేల ఎకరాలకు సాగునీటిని అందించేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తెలంగాణ ఉద్యమ ఒత్తిడితో సీమాంధ్ర ప్రభుత్వం పై సాధించుకోగలిగింది.30 వేల కోట్లతో పూర్తి కావాలిసిన ఈ ప్రాజెక్టు పై ఉమ్మడి ప్రభుత్వం 8000 కోట్ల రూపాయలను తెలంగాణ వచ్చేనాటికే ఖర్చు చేసింది.ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా ఉంటుందనుకున్నా అంబేద్కర్ పేరుతో నిర్మించబడుతున్న ఈ ప్రాజెక్టు తెలంగాణ పాలకులు అధికారం చేపట్టగానే దీనిని పూర్తిగా డిజైన్ మార్చేసి కాళేశ్వరం ప్రాజెక్టుగా రూపొందించారు.30 వేల కోట్లతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు ?130,000 కోట్ల కు చేరుకుంది.ఇప్పటికే 95000 కోట్ల రూపాయలను ప్రభుతం ఖర్చు చేసింది.అదనంగా 1,80,000 ఎకరాలకు సాగునీటిని కల్పించేందుకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చింది.
ఈ ప్రాజెక్టు డిపిఆర్ ప్రకారం ప్రతి సంవత్సరం 195 టీఎంసీల నీటిని ఎత్తిపోయాల్సి ఉంది. కానీ ప్రాజెక్టు పూర్తి అయిన నాలుగేళ్లలో దాదాపు 800 టీఎంసీల గోదావరి నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా కేవలం 150 టీఎంసీలు మాత్రమే నాలుగేళ్లలో ఎత్తిపోసింది.ఈ సంవత్సరం కేవలం 24 టీఎంసీలను ఎత్తి పోసినప్పటికీ 18,000 ఎకరాలకు మాత్రమే ఈ ప్రాజెక్టు ద్వారా సాగులోకి వచ్చినట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరో వైపుతెలంగాణలోని ప్రతి నీటి బొట్టు కాళేశ్వరం నీళ్లు అని ప్రభుత్వం గొప్పలు చెబుతుంది.మరోవైపు ప్రతిపక్షాలను,ప్రజాసంఘాలను,ఇరి
దాదాపు 4000 కోట్లకు పైగా విద్యుత్ ఖర్చుతో నిర్వహించిన ఈ ప్రాజెక్టు మొన్న గోదావరి వచ్చిన వరదలతో నిండా మునిగిపోయింది.ఈ వరదల్లో మునిగిపోయిన పంపులను బాగు చేసుకోవడం కోసం అదనంగా మరో 1200 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టాల్సి వస్తుంది.ఈ ప్రాజెక్టు పేరుతో నిర్మించిన బ్యారేజ్ ల వల్ల గోదావరి బ్యాక్ వాటర్ తో వేలాది ఎకరాల సారవంతమైన భూముల ను,పంటలను ముంచి వేస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆచరణలో నిర్వహించలేని ప్రాజెక్టు.కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును నిపుణులు తెల్ల ఏనుగు లాగా భావించడంలో సందేహం లేదు. తెలంగాణ వరప్రదాయనీ అనడం కంటే దుఖఃదాయనిగా ఆచరణలో నిలబడుతుందనేది వాస్తవం.
క్రిష్ణానది పరిధిలో నిర్జీవంగా ఉన్న ప్రాజెక్టులు
299 టీఎంసీల నికర జలాలు 225 టీఎంసీల మిగులు జలాలను దక్షిణ తెలంగాణ ఈ నది నీటిని వినియోగించుకోవాలసి ఉండే.ఈ క్రమంలోనే మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్లగొండ జిల్లాలకు సాగు నీటిని కల్పించాల్సిన నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రం అనేక ప్రాజెక్టులను ప్రతిపాదించడమే కాకుండా సుదీర్ఘ కాలంలో మెజారిటీ ప్రాజెక్టులను 90 శాతానికి పైగా పూర్తి చేసింది.
సాగునీటి లో వెనక్కి నెట్టివేయబడుతున్న మహబూబ్ నగర్
ఇందులో మొదటగా మహబూబ్ నగర్ జిల్లాలో చేపట్టినవి కల్వకుర్తి,నెట్టెంపాడు, బీమా,కోహిల్ సాగర్. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టులకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటే ఇవన్నీ పూర్తి అయి పలితాలు వస్తుండే.ఈ కనీసం మొత్తం కూడా ఖర్చు చేయకుండా స్వరాష్ట్ర పాలకులు కాలయాపన చేసినారు.దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలు తీవ్ర ఒత్తిడి చేయడంతో నాలుగేళ్ల తర్వాత ఆ ప్రాజెక్టులు అందుబాటులోకి వచ్చాయి.ఐనప్పటికీ ఈ ఎత్తిపోతల పథకాలను సద్వినియోగపరుచుకునేందుకు ఏలాంటి పిల్లకాలువలను కానీ,పంట కాలువలను గాని నేటి వరకు అందుబాటులోకి తీసుకురాలేదు. 45 టీఎంసీల కల్వకుర్తి ఎత్తిపోతల పథకం వనపర్తి జిల్లా వైపు పూర్తిగా మలుచుకోబడ్డది. అమ్రాబాద్ ,అచ్చంపేట ప్రాంతాలకు నీటి దిక్కు లేకుండా పోయింది.ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన జూరాల పాకాల ప్రాజెక్ట్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుగా మారింది.ఈ తొమ్మిదేళ్ల కాలంలో ప్రతిరోజు డిపిఆర్ లను మారుస్తూ ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచివేసినారు.
రోజుకు మూడు టీఎంసీల ఎత్తిపోతల సామర్థ్యంతో నిర్మించాల్సిన ఈ ప్రాజెక్టు ఆకస్మికంగా తన సామర్థ్యాన్ని కోల్పోయింది.ఈ జూన్ నెలలోనే ప్రారంభిస్తామన్న ఈ ప్రాజెక్టు 9 పంపులకు బదులుగా రెండు పంపులని ప్రారంభించబోతుంది ఒక్కొక్క పంపు సామర్థ్యం 800 క్యూసెక్కులు మాత్రమే అంటే మొత్తంగా ఎత్తిపోసేది 2000 క్యూసెక్కుల లోపే అంటే మూడు టీఎంసీలు ఎత్తిపోయాల్సిన ఈ ప్రాజెక్టు ఒక్క టీఎంసీ కూడా ఎత్తిపోసే పరిస్థితిలో లేదు.పైగా ఉద్దండాపూర్ రిజర్వాయర్ కు మాత్రమే పరిమితం చేసినారు.ఈ పరిస్థితులలో మహబూబ్ నగర్ జిల్లాలో తీవ్ర ఆందోళనకరమైన నీటి పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇదే జిల్లాలో నడిగడ్డ ప్రాంతానికి నీరందించే ఆర్డిఎస్ పథకం నేటికి కూడా స్వాతంత్య్రాన్ని పొందలేకపోయింది. రాయలసీమ ఫ్యాక్షన్ నుంచి ఆర్డీఎస్ ను నేటికి విముక్తి చేయలేదు.1000 క్యూసెక్కుల నీరు కూడా ఆర్డీఎస్ కాలువలో పారడం లేదు. ఈ ప్రభుత్వం ఆర్డిఎస్ నీటిని సాధించకపోగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని చేపట్టి ఆర్డిఎస్ కాలువలోకి కొద్దిమేర వదిలి వేసినారు. జూరాలలో 9 టీఎంసీలను మించి నీటిని నిల్వ చేయలేని పరిస్థితి ఉంది.ఇలా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సాగునీటి రంగంలో పురోభివృద్ధి కి నోచుకోవడం లేదు.
ఎడారిగా మారనున్న రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లాలో 14 లక్షల ఎకరాల భూమికి సాగు యోగ్యత ఉండే.కానీ రెండు 2 లక్షల ఎకరాలకు మాత్రమేపథకాల పరిధిలో కి కుదించి వేసినారు. జూరాల షాద్ నగర్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిగా రద్దుచేసి పాలమూరు రంగారెడ్డి పథకం లో భాగంగా చేర్చినప్పటికీ తెలంగాణలోని అత్యంత ఎత్తైన ప్రాంతానికి నీటిని అందించే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ను ఇటీవల తొలగించినారు.దీంతో రంగారెడ్డి జిల్లాకు క్రిష్ణానది జలాలు దక్కలేని పరిస్థితి ఏర్పడ్డది. మరోవైపున ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో నుంచి చేవెళ్ల(రంగారెడ్డి)ప్రాంతాన్ని వదిలివేసి కాలేశ్వరం ప్రాజెక్టుగా నిర్మించడంతో ఇటు క్రిష్ణా అటు గోదావరి జలాలు అందకపోవడంతో రంగారెడ్డి జిల్లా ఎడారి ప్రాంతంగా మిగిలిపోయే ప్రమాదం లో పడింది. దీనికి తోడు 111 జీవోను రద్దు చేయడంతో రంగారెడ్డి జిల్లా పూర్తిగా నీరు సౌకర్యాన్ని కోల్పోతుంది.రీజినల్ రింగ్ రోడ్ పరిధిలోని భూమిని అంతా వ్యవసాయం నుంచి భేదకల్ చేయడానికి అటు లక్ష్మీదేవి పల్లి ఇటు చేవెళ్ల పథకాలతో పాటు 111 జీవోలను రద్దుచేసి ఆ ప్రజలను తీవ్రమైన అన్యాయానికి ప్రభుత్వం గురిచేస్తుంది.
నేటికి సాగునీటి కి నోచుకోని ప్లోరైడ్ జిల్లా
28 లక్షల ఎకరాల సాగు యోగ్యత కలిగిన నల్లగొండ జిల్లాకు కేవలం 8 లక్షల 65 వేయిల ఎకరాలకు మాత్రమే పరిమితం చేసింది. ఇక్కడి ప్రజల చిరకాల డిమాండ్ ఫ్లోరైడ్ ను పారదోలడమే.కానీ ఇందుకు అవసరమైన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్‌ఎల్బీసీ) గత పాలకుల పాలనా కాలంలో 90 శాతానికి పైగా పూర్తి చేయబడినప్సటికి కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే మిగిలి ఉన్న ఎస్‌ఎల్బీసీ సొరంగ మార్గాన్ని ఈ తొమ్మిదేళ్ల కాలంలో స్వరాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేయలేక పోయింది. డిండి ప్రాజెక్టు కోసం ప్రజలను ఇబ్బంది పెట్టి నిర్వాసితులను చేసి చర్లగూడెం లాంటి రిజర్వాయర్లు పూర్తి చేసినప్పటికీ ఈ ప్రాజెక్టుకు ఎక్కడి నుంచి క్రిష్ణా నీటిని సేకరిస్తారో ఇంతవరకు నిర్ణయించలేదు. నీటిని తీసుకొచ్చేందుకు రూపొందించాల్సిన డిపిఆర్ లను ఏడుసార్లు మార్చి 15 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టినప్పటికీ నేటి వరకు డిండి ప్రాజెక్టుకు అడ్రస్ లేదు.దీని వెనక ఏ పరమార్థం దాగి ఉందో పాలకులకే ఎరుక.ఖమ్మం జిల్లాలో సీతమ్మ ప్రాజెక్టు రామదాసు ప్రాజెక్టుల పనుల నత్తనడకన కొనసాగుతుంది. దుమ్ముగూడెం రద్దు తో సీతారామ ప్రాజెక్టుగా ముందుకు వచ్చినా ఖమ్మం ప్రజల ఆశాదీపమైన ఈ ప్రాజెక్టు నిన్నటి వరకు డిపిఆర్లు మారుతూనే ఉన్నాయి.
క్రిష్ణానది జలాల దోపిడి పై మౌనం ఎంధుకు.?
తెలంగాణ ఉద్యమ డిమాండ్ తో పాటు సహజ నీటి హక్కుల న్యాయ సూత్రాల ప్రకారం తెలంగాణకు కృష్ణా నదిలో 69 శాతం నీటిని పొందాల్సి ఉండే.కానీ స్వరాష్ట్ర పాలకులు తాత్కాలిక ఒప్పందం పేరు మీద 37 శాతానికి అనగా 299 టీఎంసీలకు అంగీకరించాల్సి రావడం దురదృష్టకరం. ఈ తాత్కాలిక ఒప్పందం ప్రకారం 299 టీఎంసీల నీటిని కూడా వినియోగించుకోకుండా 270 టీఎంసీలకు మాత్రమే పరిమితమై ఉపయోగించుకుంది.ఇది స్వీయ పాలకుల వైఫల్యం అనడంలో ఏలాంటి సందేహం లేదు.క్రిష్ణా నది జిల్లాలో మన వాటా 69% సాధించకపోవడానికి పాలకుల నిర్లక్ష్యానికి ఇది అద్దం పడుతుంది.31% పొందాల్సిన ఆంధ్రప్రదేశ్ 63% జలాలను పొందుతూ అనగా 512 టిఎంసిలు అనుభవిస్తున్నది.ఇదే అక్రమం అని వాదిస్తుంటే మరో 135 టీఎంసీల నీటిని దురాక్రమంగా ఉపయోగించుకుంటుంది. సీమాంధ్ర ప్రభుత్వం శ్రీశైలం నుంచి అక్రమ నీటి తరలింపు వేగవంతం చేసింది. ఇందుకోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ 80,000 క్యూసెక్కులకు విస్తరించింది. దీంతోపాటు రోజుకు మూడు టీఎంసీలను తరలించేందుకు సంగమేశ్వరం (రాయలసీమ) ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది.ఐనప్పటికీ సీమాంధ్ర జలదోపిడిని అడ్డుకునేందుకు భారత రాష్ట్ర సమితి పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.ఈ విషయంపై కేంద్రంతో పోరు చేయడానికి సరైన కార్యాచరణ రూపొందించడం లేదు. కనీసం కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దానికి దక్కే ట్రిబ్యునల్ అవకాశాన్ని కూడా సాధించలేకపోయింది. అర్థం లేని వ్యూహాలతో నీటిపారుదల వ్యవస్థను అస్తవ్యస్తం చేసింది ‘‘క్రిష్ణా రివర్ యాజమాన్య బోర్డు’’ మీద న్యాయబద్ధమైన ప్రభావాన్ని కూడా చూపించలేకపోయింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లోని లోపాలను సరిదిద్దే ప్రయత్నం వైపు కూడా అడుగులు వేయలేదు. బ్రిజిష్ ట్రిబ్యునల్ తెలంగాణ అస్తిత్వాన్ని కూడా గుర్తించడానికి నిరాకరిస్తుంది.ఈ పరిస్థితులలో టిఆర్‌ఎస్ బిఆర్‌ఎస్ గా మారినట్లే తెలంగాణ ఉద్యమ నినాదం నుంచి వైదొలిగింది.
ప్రణాళికలు లేని మితిమీరిన వ్యయం
మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ తన నేలను తడుపుకునేందుకు నీటి ప్రాజెక్టుల విషయంలో హేతుబద్ధంగా ఖర్చు చేయాల్సి ఉండే.ఈ తొమ్మిదేళ్ల కాలంలో 1,69 వేయిల కోట్ల రూపాయలు ను ప్రాజెక్టుల పేరు మీద ఖర్చు చేసినప్పటికీ కనీస ప్రయోజనాన్ని కూడా సాధించలేకపోయింది.27,627 కోట్లు ఖర్చుపెట్టినా మిషన్ కాకతీయ ద్వారా ఒక కొత్త చెరువును కూడా తొవ్విన దాఖలాలు లేవు. అంతేకాక తూతూ మంత్రంగా చేపట్టిన పూడికతీత మిషన్ కాకతీయ మొదటి దశ కూడా పూర్తి కాలేదు. తట్టెడు మట్టి ఎత్తకుండానే ఆక్రమిత చెరువు నుంచి ఒక గుంట భూమి కూడా విముక్తి చేయకుండానే 15 లక్షల ఎకరాల భూమిని స్థీరికరించుకున్నట్లు, లక్ష ఎకరాలకు అదనపు నీటిని ఇస్తున్నట్లు కారు పార్టీ కాకమ్మ కథలు చెబుతుంది.ఇప్పటికే 1975 కోట్లతో 1210 చెక్ డ్యాములు కడుతున్నట్లు ఇందులో 400 చెక్ డ్యాములు పూర్తయినట్లు గ్లోబల్ ప్రచారాన్ని బారాస ప్రభుత్వం చేసుకుంటుంది. ఇప్పటివరకు లక్షల కోట్లు ఖర్చుపెట్టిన కొత్త ప్రాజెక్టులతో పాటు గోదావరి ప్రాజెక్టులు అన్ని కలిపి కూడా 300 టీఎంసీల గోదావరి నీటిని వినియోగిం చుకోలేకపోయింది. ఈ పరిస్థితి ఇలా ఉండగానే తెలంగాణ నిండుకుండాలా అన్నట్లు,సాగునీటి రంగానికి నవశకం అన్నట్లు తెలంగాణ రాష్ట్రానికి కాళేశ్వరమే ప్రాజెక్టు గుండెకాయగా పచ్చి అబద్దాలతో ప్రచారం చేసుకుంటుంది.
పాలకులకు బంగారు బాతైన నీటిపారుదల రంగం
ఈ పాలకుల ఏలుబడిలో తల్లి గోదావరి పేరుతో తెలంగాణ అప్పుల కుప్పయింది. సీమాంధ్ర పాలకులకు తెలంగాణ కానరానట్లే స్వరాష్ట్ర పాలకులు తరలిపోతున్న కృష్ణమ్మను ఒడిసి పట్టుకోవడానికి చేతులు రావడం లేదు. తెలంగాణ నీటిపారుదల రంగం పాలకులకు బంగారు బాతై కూర్చుంది. దేశంలో ధనవంతమైన పార్టీగా మార్చింది. ఈ రాష్ట్ర ప్రజలను అణుగదొక్కె ఇనుప పాదంగా అవకాశాన్ని ఇచ్చింది.భూ పంపకం లేకుండా చేపట్టిన ఈ నీటి పథకాలతో తెలంగాణ సమాజ పరిణామ క్రమం దారుణమైన ఫలితాలను చవి చూడాల్సి రావొచ్చు. కావునా ఈ ప్రచారాలన్నింటిని బద్దలు కొట్టి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల ట్యాగ్ లైనైన నీళ్లను హేతుబద్ధంగా అమలుపరచుకునేందుకు ఒత్తిడి తెద్దాం, సాగునీటి రంగాన్ని బలోపేతం చేసుకుందాం.
– పందుల సైదులు, తెలంగాణ విద్యావంతుల వేదిక, 9441661192.




