తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయిండ్రు

  • బిజెపితో పవన్‌ ‌కల్యాణ్‌, ‌కాంగ్రెస్‌తో వైఎస్‌ ‌షర్మిల చేతులు కలుపుతున్నరు
  • జగ్గారెడ్డి కూడా తెలంగాణ ద్రోహి
  • మనం గట్టిగా రంగంలోకి దిగితే పారిపోతడు
  • ఎన్నికల్లో బీజేపీ డక్‌ ఔట్‌, ‌కాంగ్రెస్‌ ‌హిట్‌ ‌వికెట్‌, ‌కేసీఆర్‌ ‌సెంచరీ
  • సీఎం కేసీఆర్‌ని క్రిమినల్‌ అనడం హాస్యాస్పదం
  • కాంగ్రెస్‌ ‌ముసుగులో మళ్లీ తెలంగాణ ద్రోహులు రాష్ట్రానికి వొస్తున్నారు
  • సంగారెడ్డిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి హరీష్‌ ‌రావు
  • వికారాబాద్‌లో చెల్లని రూపాయి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ ‌జహీరాబాద్‌లో
  • చెల్లుతుందా..: జహీరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ ‌రావు

సంగారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 03 : ‌వోటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన వ్యక్తి రేవంత్‌ ‌రెడ్డి సీఎం కేసీఆర్‌ని క్రిమినల్‌ అనడం విడ్డూరంగా ఉందని మంత్రి హరీష్‌ ‌రావు మండిపడ్డారు. కేసీఆర్‌ ‌లాంటి స్ట్రాంగ్‌ ‌లీడర్‌ ఉం‌డగా..మనకు రాంగ్‌ ‌లీడర్లు ఎందుకన్నారు. తెలంగాణ ద్రోహులు అంతా ఒక్కటయ్యారని, కాంగ్రెస్‌ ‌పార్టీ ముసుగులో రాష్ట్రానికి వొస్తున్నారని దుయ్యబట్టారు. జగ్గారెడ్డి సంగారెడ్డిని కర్ణాటకలో కలపమ్మన్న తెలంగాణ ద్రోహి అని అన్నారు. పవన్‌ ‌కళ్యాణ్‌ ‌తెలంగాణ వొస్తే భోజనం మానేస్తానని అన్నాడని, ఆనాటి సీఎం రాజశేఖర్‌ ‌రెడ్డి ఇవ్వడానికి తెలంగాణ సిగరెట్టా..బీడీయా అన్నడని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక వోటు చీలకుండా ఈ సారి ఎన్నికల్లో తెలంగాణలో చంద్రబాబు అసలు పోటీయే చేయడం లేదని అన్నారు. షర్మిల కూడా కాంగ్రెస్‌ ‌పార్టీకి మద్దతు ప్రకటించారని, ఇలా తెలంగాణ వ్యతిరేకులతో రేవంత్‌ ‌రెడ్డి దోస్తు కట్టిండని అన్నారు. తెలంగాణ గెలవాలంటే కారు గుర్తు మీద వోటేయాలని, తెలంగాణ ఓడాలంటే రేవంత్‌ ‌రెడ్డి క్రిమినల్‌ ‌గ్యాంగ్‌కి ఓటేయాలని, ఏది కావాలో ప్రజలే తేల్చుకోవాలన్నారు.

రేవంత్‌ ‌రెడ్డి ఖైదీ నెంబర్‌ 1779 అన్నారు. కర్నాటకలో కేవలం అయిదు గంటలే కరెంట్‌ ఇస్తున్నారని, డీకే శివ కుమార్‌ ‌చెప్పిన ఈ మాటలతో కాంగ్రెస్‌ ‌పార్టీ రన్‌ ఔట్‌ ‌కాదు..హిట్‌ ‌వికెట్‌ అయిందని, బిజెపి డౌక్‌ ఔట్‌ అయిందని, కెసిఆర్‌ ‌సెంచరీ ఖాయమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అన్నారు. శుక్రవారం  సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల విస్తృత సమావేశంలో, జహీరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి హరీష్‌ ‌రావు మాట్లాడుతూ… ఈ సారి సంగారెడ్డి మీద ఎగిరేది గులాబీ జెండానేనన్నారు. మనం గట్టిగా పని చేస్తే జగ్గారెడ్డి గాలిలో కొట్టుకు పోతాడని, కార్యరంగంలో కదన సింహాల లాగా దూకండని పిలుపునిచ్చారు. జగ్గారెడ్డి గురించి ప్రజలకు తెలుసని, లాస్ట్ ఎన్నికల్లో చాలా మాటలు చెప్పిండుని, గల్లీకో ఏటీఎం అన్నడు…మనిషికో కార్డు అన్నడు..కానీ కార్డులు లేవు.. ఏటీఎంలు రాలేదని విమర్శించారు. కొరోనా కష్టకాలాన కూడా పత్తా లేడని, కానీ ఓడినా చింతా ప్రభాకర్‌ ‌ప్రజల్లో ఉన్నారని, ఎంతో సేవ చేశారని అన్నారు.

ఈ సారి సంగారెడ్డి నుంచి చింతా ప్రభాకర్‌ని గెలిపిస్తే అన్ని విధాలా అండగా ఉంటానని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో తను వొచ్చి సహకరిస్తానని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు 10వేల ఇళ్ల స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 50 వేల మెజారిటీతో చింతా ప్రభాకర్‌ ‌ని  గెలిపించాలన్నారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ ‌మాట్లాడుతూ… కార్యకర్తలే తన బలం, ఆరోగ్యం, బలగమని అన్నారు. ఒడినా..నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నానని అన్నారు. అందరి ఆశీర్వాదం, దీవెనలతో తనను గెలిపించాలని ఆయన కోరారు. ఇదేండ్ల పాటు ప్రజా సేవ చేస్తానని అన్నారు. బిఆర్‌ ఎస్‌ ‌రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ‌జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్‌ ‌నరహరి రెడ్డి, సీడీసీ ఛైర్మన్‌ ‌కాసాల బుచ్చిరెడ్డి, సంగారెడ్డి మున్సిపల్‌ ‌ఛైర్మన్‌ ‌విజయలక్ష్మి, పార్టీ సీనియర్‌ ‌నాయకులు ముఖీమ్‌, ‌మామిళ్ల రాజేందర్‌ ‌తదితరులు మాట్లాడారు. నియోజకవర్గం లోని ముఖ్యకార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వికారాబాద్‌లో చెల్లని రూపాయి అయిన కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ ‌జహీరాబాద్‌లో చెల్లుతుందా..: జహీరాబాద్‌ ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్‌ ‌రావు
వికారాబాద్‌లో ఓడగొట్టారని కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ ‌జహీరాబాద్‌కు వొచ్చారని మంత్రి హరీష్‌ ‌రావు విమర్శించారు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా..? అని ప్రశ్నించారు. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో 10 కి 10 సీట్లు గెలిచి కేసీఆర్‌ ‌కి గిఫ్ట్ ఇద్దామని అన్నారు. గీతారెడ్డి కాంగ్రెస్‌ ‌మంత్రిగా ఉన్నప్పుడు ఏం పనులు చేయలేదని అన్నారు. కేసీఆర్‌ అం‌టే నమ్మకం, విశ్వాసం అని తెలిపారు. కాంగ్రెస్‌ అం‌టే నయవంచన, నాటకం అని అన్నారు. డీకే శివకుమార్‌ ‌తో ఆ శివుడు నిజాలు చెప్పిచ్చినట్టు ఉన్నాడని అన్నారు. శివకుమార్‌ 5 ‌గంటల కరెంట్‌ ‌కామెంట్స్ ‌తో కాంగ్రెస్‌ ‌పార్టీని బొంద పెట్టాడని అన్నారు. కర్ణాటకలో అక్రమంగా డబ్బులు సంపాదించి ఇక్కడ ఖర్చు చేసి కాంగ్రెస్‌ ‌పార్టీ గెలవాలని చూస్తుందని తెలిపారు. రేవంత్‌ ‌రెడ్డి మాట్లాడితే బూతులే అని అన్నారు.

మనకి బూతులు కావాలా..? తెలంగాణ భవిష్యత్తు కావాలా..? అని అన్నారు. కేసీఆర్‌ ‌రైతు బంధు ఇస్తే బిచ్చం ఇస్తున్నారని ఎగతాళి చేస్తున్నారని తెలిపారు. తెలంగాణ వస్తే అన్నం తినబుద్ది కావడం లేదని హీరో పవన్‌ ‌కళ్యాణ్‌ ‌బాధపడ్డారని,తెలంగాణ ద్రోహులంతా ఒక్కటయ్యారు. కాంగ్రెస్‌ ‌పార్టీ రైతు వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. రైతు బంధు ఆపాలని ఎలక్షన్‌ ‌కమిషన్‌కి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్‌ ‌పార్టీ అని అన్నారు. కాంగ్రెస్‌ ‌పార్టీ రైతుకు 15 వేలు అంటే , కేసీఆర్‌ ఎకరానికి 16 వేలు ఇస్తా అన్నారు. నూనె, నీళ్లు కలుస్తాయా..బిజెపి, బిఆర్‌ఎస్‌ ‌కూడా ఎప్పటికి కలవవని తెలిపారు. కర్ణాటకలో సీఎంని మార్చాలని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు డిమాండ్‌ ‌చేస్తున్నారని తెలిపారు. నిన్న 25 మంది ఎమ్మెల్యేలు రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. తెలంగాణలో జరిగిన 3 ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌డిపాజిట్లు కోల్పోయిందని అన్నారు. కాంగ్రెస్‌, ‌బీజేపీ రెండు పార్టీలు ఒక్కటే అని తెలిపారు.

తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, ‌బిజెపి మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందని అన్నారు. నిన్నటి వరకు బీజేపీలో ఉన్న వివేక్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరారని,మొన్న రాజగోపాల్‌ ‌రెడ్డి బీజేపీలో చేరారని, జహీరాబాద్‌ ‌కాంగ్రెస్‌ అభ్యర్థి చంద్రశేఖర్‌ ‌కూడా మొన్నటి వరకు బిజెపిలోనే ఉన్నారని, బీజేపీలో ఉన్న నాయకులంతా కాంగ్రెస్‌ ‌లో చేరుతున్నారని తెలిపారు. ఈ మధ్య కాంగ్రెస్‌ ‌వాళ్లు కొన్ని కుట్రలు చేస్తున్నారని అన్నారు. కొందరికి తాగించి మన ఎమ్మెల్యేలు పోయినప్పుడు గొడవ చేయిస్తున్నారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *