తెలంగాణ సాహిత్య సంపద ఎంతో గొప్పది. పాటలు, కథలు, నవలలు, కవితలు తెలంగాణ సంస్కృతిని, చరిత్రని ప్రభావితం చేయటంతో పాటు రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి కూడా పాటలు ప్రముఖ పాత్ర వహించే ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీ అధికారంలో కూర్చున్నప్పటికీ ఏ పార్టీ ప్రతిపక్షానికే అంకితమైనప్పటికీ ఏ పార్టీ మిత్రపక్షమైనప్పటికీ పార్టీల స్థితిగతులు ఎలా ఉన్నా పాట ప్రాధాన్యత మాత్రం తెలంగాణలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తగ్గదు అని మనకు అర్థం అవుతుంది.
మలిదశ తెలంగాణ ఉద్యమం లో కీలకపాత్ర పోషించింది పాట 2001 టిఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి 2014 తెలంగాణ సాధన వరకు కూడా తెలంగాణ చరిత్ర సంస్కృతి సంప్రదాయం, భాష దాని ప్రభావాన్ని బలంగా తెలిపింది పాట మాత్రమే. మరి ముఖ్యంగా 2009 నుంచి 2014 తెలంగాణ సాధనలో ప్రముఖ పాత్ర వహించింది ధూమ్ ధామ్ కార్యక్రమం. ధూంధాం పేరుతో ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ తో పాటు వివిధ పల్లెల్లో పట్టణాలలో తెలంగాణ గానం తెలంగాణ ఆవిర్భావానికి ప్రముఖంగా ఉపయోగపడిరది. 2014 జూన్ సెకండ్ తెలంగాణ ఆవిర్భవించినప్పటి నుంచి ప్రస్తుతం 2023 ఎన్నికల వరకు కూడా తెలంగాణ రాజకీయ సాంస్కృతిక కార్యక్రమాలలో మరియు ముఖ్యంగా ఎన్నికలలో పాట అనేది ప్రముఖంగా కనిపిస్తూ.. వినిపిస్తూ వొస్తుంది. ఇదే పాటనే ప్రధానంగా చేసుకొని ప్రస్తుత బీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో ప్రచారంలో నిమగ్నమైంది. ప్రతిపక్ష పార్టీలైనటువంటి కాంగ్రెస్ , బిజెపి , సిపిఐ సిపిఎం లు కూడా తెలంగాణ సాహిత్యంతో కూడిన పాటలతో ఎన్నికల ప్రచారంలో దిగారు.
తెలంగాణ ఎన్నికలలో ప్రచారంలో హడావుడి, హామీలు, వాగ్దానాలతో పార్టీలు పోటీపడ్డాయి.ముఖ్యంగా పాటల రూపంలో ప్రచారానికి కొత్త ఊపునిచ్చే ప్రయత్నం జరిగింది. బిఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పలు పాటలను విడుదల చేసి ఊపు తెచ్చారు. మరోవైపు కాంగ్రెస్ ఒక్కే పాటతో ముందుకు వొచ్చింది, కానీ ఆ పాట ప్రజల నోళ్లలో నానేలా చేసింది. ఈ పరిస్థితిలో ఒక ప్రశ్న వొస్తుంది – తెలంగాణ ఎన్నికల్లో సాహిత్యం ఎంత కీలకమో?
పాటలు, సాహిత్యం ఎన్నికల ప్రచారంలో ఎప్పటినుంచో ఉపయోగించబడుతున్నాయి. ప్రజలను ఆకట్టుకోవడానికి, పార్టీల సిద్ధాంతాలను వివరించడానికి పాటలు చక్కని మార్గం. కానీ, తెలంగాణ ఎన్నికల్లో ఈసారి కేసీఆర్ పాటల వ్యూహం కొత్త పుంతలు తొక్కింది. పలువురు కవులు, గాయకులు, కళాకారులతో పాటలు చేయించి, యువతను ప్రభావితం చేశారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, అభివృద్ధిని చాటిచెప్పే పాటలు కూడా వొచ్చాయి. కానీ, వాటిలో కొన్ని విమర్శలకు గురయ్యాయి. కొన్ని పాటల్లో లిరిక్స్ బాగాలేవని, కొన్ని బాణీలు వినబడటం కష్టమని విమర్శలు వచ్చాయి.
మరోవైపు కాంగ్రెస్ ఒక్కే పాటతో ముందుకు వొచ్చింది. ‘‘గల్లంతైన తెలంగాణ’’ పేరుతో వచ్చిన ఈ పాటలో రాష్ట్రంలో కేసీఆర్ పాలనలో జరిగిన లోపాలను, ప్రజల కష్టాలను చిత్రించారు. ఈ పాట కూడా విమర్శలకు గురైంది, కానీ ప్రజలలో చర్చను రేకెత్తించింది. ఈ ఒక్క పాట కాంగ్రెస్‌కు మంచి ప్రచారాన్ని అందించిందని కొందరు అన్నారు.మొత్తం మీద, తెలంగాణ ఎన్నికల్లో పాటల ప్రచారం ప్రజలలో కొత్త ఊపు తీసుకొచ్చింది. ప్రజలను ఆకట్టుకోవడానికి, పార్టీల సందేశాన్ని వివరించడానికి పాటలు ఉపయోగపడాయి కానీ, ప్రజలను ఎంతవరకు ప్రభావితం చేస్తాయో, ఎన్నికల ఫలితాలు చూస్తే మనకు స్పష్టంగా అర్థం అవుతుంది. చివరకు ఎన్నికల్లో గెలుపు తేల్చేది ప్రజల తీర్పు, వారి అభిప్రాయాలు. తెలంగాణ ప్రజలుమంచి పాలన, నాయకత్వం కోసం వోటేశారు ప్రచారంలో హడావుడికి, పాటల సందడికి లొంగిపోకుండా .
తెలంగాణ ప్రజలు. చాలా తెలివిగా తమ నిర్ణయాన్ని వోటు ద్వారా చెప్పినప్పటికీ పాటల ప్రభావం మాత్రం అత్యధికంగా కనిపించింది.అయితే, ఒక విషయం మాత్రం స్పష్టం – తెలంగాణ సాహిత్య సంపద ఎంతో గొప్పది. పాటలు, కథలు, నవలలు, కవితలు తెలంగాణ సంస్కృతిని, చరిత్రని ప్రభావితం చేయటంతో పాటు రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి కూడా పాటలు ప్రముఖ పాత్ర వహించే ఎలాంటి సందేహం లేదు. ఏ పార్టీ అధికారంలో కూర్చున్నప్పటికీ ఏ పార్టీ ప్రతిపక్షానికే అంకితమైనప్పటికీ ఏ పార్టీ మిత్రపక్షమైన ప్పటికీ పార్టీల స్థితిగతులు ఎలా ఉన్నా పాట ప్రాధాన్యత మాత్రం తెలంగాణలో అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ తగ్గదు అని మనకు అర్థం అవుతుంది. అందుకనే తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో కూడా పాట ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆశిద్దాం.
-పూసపాటి వేదాద్రి
కవి, సాహితీ విశ్లేషకులు
9912197694





