- అణుదాడిని తట్టుకుని తలెత్తుకు లేచింది..
- వనరులు తక్కువ ఉన్నా అభివృదిలో అగ్రగామిగా నిలిచింది
- చందన్‌వల్లి ఇండస్ట్రియల్ పార్కులో జపాన్ కంపెనీకి కెటిఆర్ శంకుస్థాపన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : తయారీ రంగంలో ప్రపంచానికి జపాన్ ఆదర్శమని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని చెప్పారు. అక్కడ వనరులు తక్కువగా ఉంటాయని, అయినప్పటికీ కొద్దిపాటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా చందన్‌వల్లి ఇండస్ట్రియల్ పార్కులో జపాన్‌కు చెందిన డైఫుకు ఇంట్రాలాజిస్టిక్స్ యూనిట్‌కు, నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్ కంపెనీల ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ..అణుబాంబు దాడిని ఎదుర్కుని కూడా తిరిగి లేచి నిలిచి జపాన్ సత్తా చాటిందన్నారు.
మన దేశంలో ప్రతి ఇంట్లో ఆ దేశానికి చెందిన వస్తువు ఏదో ఒకటి ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌లో ఆ దేశానికి చెందిన మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వొస్తాయని ఆశిస్తున్నామన్నారు. డైఫుకు కంపెనీ దేశంలో అగ్రగామిగా నిలుస్తుందని భావిస్తున్నానని చెప్పారు. సంస్థ రూ.575 కోట్లు పెట్టుబడి పెడుతున్నదని, మూడు నెలల్లోనే పరిశ్రమ ప్రారంభం కానుందని వెల్లడించారు. చందన్‌వల్లికి వెల్‌స్పన్, మైక్రోసాప్ట్ సహా అనేక సంస్థలు వొస్తున్నాయన్నారు. భారత్‌కు చెందిన వెగా కన్వేయర్స్ అండ్ ఆటోమేషన్ కంపెనీతో కలిసి డైపుకు ఇంట్రాలాజిస్టిక్స్ కంపెనీ ఎక్విప్‌మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నది.
మొదటి దశలో రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీని ద్వారా 800 మందికి ఉపాధి లభించనుండగా..తొలి దశలోనే 250 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. దీనిలో కన్వేయర్స్, షార్టర్స్ ఉత్పత్తి చేయనున్నది. ఇక నికోమాక్ తైకిషా లిమిటెడ్ కంపెనీకి వందేండ్లకు పైగా చరిత్ర కలిగి ఉంది. నిర్మాణ రంగానికి చెందిన క్లీన్ రూమ్ ఉత్పత్తులను ఇందులో తయారు చేస్తారు. హెచ్‌వీఏసీ సిస్టమ్స్‌ను మరింత విస్తరించాలనే ఉద్దేశంతో రూ.126.2 కోట్లతో యూనిట్‌ను నెలకొల్పుతున్నది. దీనికి సంబంధించి ప్రభుత్వంతో గత డిసెంబర్‌లో ఒప్పందం కుదుర్చుకున్నది.




