శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండ•ంతో రాష్ట్రంలో ఒకపక్క రాజకీయ వేడి రాచుకుంటుంటే అధికార పార్టీలో మాత్రం ఆందోళన కొనసాగుతున్నది. గత ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యే లలో దాదాపు ఇరవైఐదు మందిపైన కేసులుండడమే ఈ ఆందోళనకు కారణమైంది. గత ఎన్నికల సమయంలో ఎలక్షన్ కమిషన్• కు సమర్పించిన ధృవపత్రాలు సరిగాలేవని, లెక్కింపులో లోపాలున్నాయని, తమపై ఉన్న కేసులు, ఆస్తుల వివరాలను సంపూర్ణంగా అందజేయలేదంటూ పలువురు అధికార పార్టీ ఎమ్మెల్యే మీద కేసులు నమోదు అయినాయి. గత నాలుగు సంవత్సరాలుగా వీటిపైన విచారణ జరుగుతుండగా ఇప్పుడా కేసులన్నీ ఆఖరి అంకంలో ఉండడంతో వారిలో గుబులు బయలుదేరింది.
రాష్ట్రంలో మరో నాలుగు నెలల్లో ఎన్నికలు వొస్తుండడంతో తమ సీటు గ్యారంటీ అనుకుంటున్న తరుణంలో ఈ ఉపద్రవం వారికి నిద్రపట్టకుండా చేస్తోంది. ముఖ్యంగా ఎంఎల్‌ఏలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలైన పలు కేసులకు సంబంధించి ఆగస్ట్ ఆఖరి నాటికి అన్ని కేసులను పరిష్కరించాలని దేశంలోని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించినమేరకు ఒక్కొక్కకేసు తీర్పుకు చేరువలో ఉండడమే అధికారపార్టీ వర్గాలను ఆవేదనలో పడవేస్తోంది. దానికి తగినట్లుగా తాజాగా మంగళవారం రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మరింత టెన్షన్‌కు గురిచేస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వర్‌రావు ఎన్నిక చెల్లదని మంగళవారం రాష్ట్ర హైకోర్టు సంచలనాత్మక తీర్పు నిచ్చింది. 2018లో జరిగిన సాధారణ ఎన్నిక) సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో వివరాలు సరిగాలేవన్నది ఆయనమీదున్న ఆరోపణ. ఆనాడాయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 4,139వోట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఆయన ప్రత్యర్థి, అధికారపార్టీ అభ్యర్థిగా ఓటమి పాలైన జలగం వెంకట్రావ్ ఆయన ఎన్నిక చెల్లదని కేసు పెట్టారు.
వాస్తవంగా ఆయన తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారాన్నది ప్రధాన ఆరోపణ. వనమా తనపైన ఉన్న క్రిమినల్ కేసుల వివరాలు, ఆయన భార్య పేరున ఉన్న ఆస్తుల వివరాలను అఫిడవిట్‌లో తెలియజేయలేదని 2019 జనవరి 25న హైకోర్టులో పిటీషన్ వేశారు. అయితే తనపైన తప్పుడు కేసు పెట్టారని, దాన్ని కొట్టివేయాల్సిందిగా హైకోర్టును వనమా కోరిన దరిమిలా పలు దఫాలుగా కేసు వాయిదా పడుతూ ఆఖరికి మంగళవారం హైకోర్టు తీర్పు ప్రకటించింది. పిటీషన్ దాఖలుచేసిన జలగం వెంకట్రావ్‌ను 2018 డిసెంబర్ 12 నుంచి ఎంఎల్‌ఏ పరిగణించాలని, తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసిన వనమాకు అయిదు లక్షల రూపాయల జరిమానను విధించడంతోపాటు, జలగంకు ఆయిన ఖర్చులను కూడా చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటికే కేసులను ఎదుర్కుంటున్న అధికార పార్టీ ఎంఎల్‌ఏల గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లైంది. దానికితోడు మంత్రి శ్రీనివాసగౌడ్ కేసులో కూడా కోర్టు ఆదేశాలు సంచలనాత్మకంగానే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఒక మంత్రిపైన ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయమని స్వయంగా న్యాయస్థానమే ఆదేశించడమన్నది అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం.
గత ఎన్నికల్లో అఫిడవిట్ ట్యాంపర్ చేశాడన్నది ఆయనపైన ఉన్న ఆభియోగం. ఆయన రెండు సార్లు అఫిడవిట్‌లను దాఖలుచేసాడని, అందులో ఆస్తులు, ఆదాయ వివరాలు తప్పుగా చూపించాడన్నది ఆరోపణ. మహబూబ్‌నగర్ శాసనసభ స్థానానికి బిఆర్‌ఎస్ అభ్యర్ధిగా నిలిచిన గౌడ్‌తో పోటీ పడిన కాంగ్రెస్ అభ్యర్థి చలువగాలి రాఘవేందర్‌రాజు వేసిన పిటీషన్‌ను విచారించిన ప్రజాప్రతినిధుల కోర్టు శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ట్యాంపరింగ్‌కు సహకరించిన స్టేట్, సెంట్రల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులను కలిపి మొత్తంగా నలుగురు ఐఏఎస్ అధికారులపైన ఎఫ్‌ఐఆర్ ( క్రిమినల్ కేసు )నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలుస్తున్నది. ఈ ఆదేశాలు చూస్తుంటే కేసును కోర్టు సీరియస్‌గా తీసుకున్నట్లు కనిపిస్తున్నది. మరోమంత్రి గంగుల కమలాకర్‌పైన కూడా ఇలాంటి కేసే మరోటి నమోదు అయింది. ఆయన కూడా గత ఎన్నికల సందర్భంగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేవాడంటూ ఇద్దరు కేసు వేశారు. అందులో ఒకరు బిజెపి అభ్యర్థి బండి సంజయ్‌కాగా, మరో వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్.
బండి సంజయ్ తర్వాత ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ప్రస్తుతం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. అయితే పిటీషనర్‌ను క్రాస్ ఎగ్జామిన్ చేసేందుకు రిటైర్డ్ జిల్లా న్యాయమూర్తి శైలజను హైకోర్టు నియమించింది. ఆగస్ట్ 12 నుండి 17 వరకు క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేయాలంటూ తదపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. అలాగే మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌పైన కూడా వ్యాజ్యం నడుస్తోంది. 441 వోట్లతో ధర్మపురి ఎంఎల్‌ఏగా గెలిచిన ఈశ్వర్ ఎన్నికల చెల్లదని కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ పిటీషన్ దాఖలు చేశారు. ఈ కేసుకూడా అనేక ఆసక్తికర మలుపులు తిరుగుతూ వొస్తున్నది.. తనపై వొచ్చిన ఆరోపణ నిరాధారమనీ.. కేసు కొట్టేయ్యాలని మంత్రి కొప్పుల వేసిన పిటీషన్‌ను మంగళవారం హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో వోట్లను మళ్ళీ లెక్కించాలన్న ఆదేశాల క్రమంలో అనేక ఆసక్తి సంఘటనలు చోటుచేసుకున్నాయి. బ్యాలెట్ బాక్స్‌లు దాచిన స్ట్రాంగ్‌రూమ్ తాళాలు లేవని కొంతకాలం, తాళాలు పగులగొడితే డాక్యుమెంట్లు కనిపించకపోవడం లాంటి సంఘటనతో కేసు కొనసాగుతున్నది.
వేములవాడ ఎంఎల్‌ఏ చెన్నమనేని రమేష్‌బాబు పౌరసత్వంపైన దశాబ్దాలుగా కేసు కొనసాగుతున్నది. ఆయన ఇప్పటికే నాలుగుసార్లు ఎంఎల్‌ఏగా గెలుపొంది, మరోసారి టికెట్ కోసం ఎదురు చూస్తున్నారు. నాగర్‌కర్నూల్ ఎంఎల్‌ఏ ఇవిఎంలను ట్యాంపరింగ్ కేసును ఎదుర్కుంటున్నారు. జనగామ ఎంఎల్‌ఏ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి ఇలా దాదపు 25 మంది ఎంఎల్‌ఏలు కేసులు ఎదుర్కుంటున్నట్లు సమాచారం. బిఆర్‌ఎస్ పార్టీ ఒక పక్క సిట్టింగ్‌లకే టికెట్ కేటాయిస్తామని చెబుతుంటే వీరంతా ఆ ఎన్నికలకు సంబంధించిన తప్పుడు అఫిడవిట్ కేసు)తో తలమునకలవుతున్నారు. ఎన్నికలనాటికి వీరిలో ఎందరు కేసులనుండి బయటపడుతారో చూడాలిమరి.




