ఊరంతా చలి దుప్పటిని
పక్కకు విసిరేసింది
గరిక పడుచు ముక్కు పుడక
మంచు బిందువుతో తళ్లుకున
మెరిసి మాయమైంది
దొడ్లో చెట్టుమీద రామచిలుక
మిగలముగ్గిన జామపండు తింటూ
వలస వెళ్లిన మిత్రులకు
ఆహ్వానం పలుకుతుంది
అవ్వతాతల అనుభాల
పాఠాలను అందిపుచ్చుకోలేని
ఈనాటి కుర్ర కుంకలు
చేల్లో తాలుగింజల్లా మిగిలిపోతున్న
దృశ్యాలు కళ్లకు కనిపిస్తున్నాయి
పట్టణ వాసన రుచి మరిగిన
యువతరం వెర్రి పోకడల
జులుంతో విర్ర వీగుతున్నారు
స్వార్ధం పడగనీడలో బజ్జున్న
రక్త సంబంధాలు
నన్ను ఎక్కురిస్తున్నాయి
పరోప కారుల జాడ
కూసింత అయినా
కన్పించి చావదే
ఇప్పుడు ఇళ్లన్ని నగరాలను
తలపిస్తున్నాయి
వేశాధారణమాట
అసలు చెప్పక్కర్లేదు సుమా
పల్లెలన్నీ పట్టణం పోకడలు
అనురిస్తున్నాయి కాబోలు
బాల్యం అనుభూతులన్నీ
పొగ చూరి పోయాయి
ఇక్క్కడకు రాకుండా
ఉండవలసింది
పసితనం యవ్వనం
తీపి గుర్తుల తేనెపట్టు అయినా
మిగిలి ఉండేది
చెమ్మగిల్లిన నాకళ్ళు
మొద్దుబారిన నా మెదడు
నా అడుగులు
తడబడుతున్నాయి
ఎక్కువ రోజులు ఉందామని
వచ్చిన నేను
కొద్ది క్షణాలు మాత్రమే గడిపాను
వెనకడుగు వేశాను
భారమైన హృదయంతో
-గాదిరాజు రంగరాజు
న్యూజెర్సీ, అమెరికా





ఈ రోజుల్లో డొల్ల సాహిత్యం ఇలాగే అమ్ముడుపోతోంది నాగిని కందాల