భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 21 : భద్రాచలం వద్ద గత నాలుగు రోజులుగా వేగంగా పెరిగిన గోదావరి శుక్రవారం మధ్యాహ్నం నుండి కాస్త తగ్గుముఖం పట్టింది. శుక్రవారం ఉదయం నాటికి 44.9 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం సాయంత్రానికి 40.1 అడుగులకు చేరుకుంది. గోదావరి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు అధికారులు స్పష్టం చేసారు. గోదావరి పెరిగే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత కాలనీవాసులను ముందుగానే పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించి తీసుకోవల్సిన చర్యలపై మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో పాటు గత ఏడాది ఈ జిల్లాలో వరదల సమయంలో పనిచేసిన అనుభవం ఉన్న కలెక్టర్ అనుదీప్‌ను భద్రాచలంలోనే ఉండి బాధితులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ హుటాహుటిన భద్రాచలం పంపించారు.
ఆయన భద్రాచలంలోనే ఉంటూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మళ్ళీ వరద పెరిగే అవకాశాలు ఉన్నందున చేయాల్సిన చర్యలపై కింది స్థాయి అధికారులకు సూచనలు చేస్తున్నారు. అలాగే వరదలను సమర్ధవంతంగా ఎదుర్కునాల్సిన బాధ్యత అధికారులపై ఉందని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ సమీక్షా సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అలాగే పోలీస్ ఉన్నతాధికారులు అయిన డిఐజి వరద ప్రబావిత ప్రాంతాన్ని పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాల్సిన బాధ్యత పోలీస్ శాఖపై ఉందని స్పష్టం చేసారు. అలాగే ఎస్పీ. డా. వినీత్ భద్రాచలంలోనే మకాం వేసి వరద పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాలైన కాళేశ్వరం, ప్రాణహిత, మేడిగడ్డ, లక్ష్మీబ్యారేజీలో నీటిని ప్రమాదస్థాయికి చేరుకోవడంతో ఆ నీటిని బయలకు వదిలే క్రింది వదిలే అవకాశం ఉన్నందున మళ్ళీ గోదావరి వరద వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.




