- మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- సీఎస్ రామకృష్ణారావుతో కలిసి కలెక్టర్లతో వీసీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 14: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తక్షణ సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల చేసినట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై చీఫ్ సెక్రటరీ కె..రామకృష్ణారావుతో కలిసి సచివాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. సెలవల్లో ఉన్న అధికారులు, సిబ్బందికి సెలవలను రద్దు చేసి వెనక్కు పిలిపించాలన్నారు. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ జిల్లాల్లో పరిస్థితి గురించి మంత్రి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలు, వరద ముంపు ప్రాంతాల్లో చేపట్టవలసిన రక్షణ చర్యల గురించి ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని మంత్రి పొంగులేటి సూచించారు.


