సేవాలాల్ జయంతి ఉత్సవాలకు రూ. 2 కోట్లు
ఉన్నతోద్యోగాలు పొందుతున్న బంజారాలు..వారిని ఎస్టిల్లో ఇందిరా గాంధీ చేర్చారు
సేవాలాల్ జయంతి ఉత్సవాలల్లో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15 : రాష్ట్రంలోని అన్ని తండాల్లో, గూడెలాల్లో పాఠశాలలను ప్రారంభిస్తామని, అన్ని తండాల్లో బీటీ రోడ్లు నిర్మిస్తామని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్లో సేవాలాల్ జయంతి ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సేవాలాల్ ఆయన విగ్రహానికి పూలమాలుల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…నాటి ప్రధాని ఇందిరా గాంధీ బంజారాలను ఎస్టీల్లో చేర్చారని గుర్తు చేశారు. అందువల్లే వారు సివిల్ సర్వీసు సహా అనేక ఉన్నతమైన ఉద్యోగాలు పొందారని తెలిపారు. ఆదివాసీలు తెలంగాణలో ఉద్యమంలో చురగ్గా పాల్గొన్నారని, సీతక్కకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించామని చెప్పారు. సంత్ సేవాలాల్ జయంతి రోజు ఆఫ్షనల్ హాలీడే ఇచ్చామన్నారు.సేవాలాల్ జయంతి ఉత్సవాలకు రూ. 2 కోట్లు ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తండాల్లో సింగిల్ టీచర్ పాఠశాలలను మూసివేసిందని విమర్శించారు. బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్. నాగరిక సమాజానికి దూరంగా అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్న గిరిజనులకు దిశానిర్దేశం చేసిన మహనీయుడని, బంజారాల ఆలోచన, జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చారని, సాంఘిక సమానత్వం కావాలని ఆకాంక్షించారని, బంజారాలు ఆర్థికంగా ఎదగాలని కోరుకున్నారని తెలిపారు.





