తెలంగాణ రవాణా రంగ కార్మికుల జేఏసీ పోస్టర్ ను ఆవిష్కరణ
వనస్థలిపురం, ప్రజాతంత్ర, జూలై 23: డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలి. స్వయం ఉపాధి కోసం డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్నవారు ఎన్నో సమస్యలు కొట్టుమిట్టాడుతున్నారని ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, పీసీసీ డెలిగేట్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రవాణా రంగ కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న చలో హైదరాబాద్ పోస్టర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జక్కిడి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ… రవాణా రంగ కార్మికుల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలి. డ్రైవర్ వృత్తిలో కొనసాగుతున్న వారు పేదరికంలో మగ్గుతున్నారని, నగరంలో అద్దె ఇళ్లలో నివసిస్తూ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి డ్రైవర్ కు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే డ్రైవర్ల జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఓలా, ఉబేర్ వంటి కార్పోరేట్ కంపెనీలు నిర్వహిస్తున్న యాప్ లను రద్దుచేసి, ప్రభుత్వమే ఒక యాప్ ను నిర్వహించాలి. కార్పొరేట్ కంపెనీలకు వెళ్తున్న కమిషన్, ప్రభుత్వ నిర్వాహణలోని యాప్ ద్వారా వచ్చే లాభాలను డ్రైవర్లను ఆదుకునేందుకు ఖర్చు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పెద్ద సంఖ్యలో డ్రైవర్లు పాల్గొన్నారు.




