టెట్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 1: ఉపాధ్యాయ అర్హత పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు . శుక్రవారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో  సెప్టెంబర్ 15న నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్ష సజావుగా జరిగే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. జిల్లాలోని 25 కేంద్రాల్లో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.   ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు నిర్వహించే పరీక్షకు 5765 మంది అభ్యర్థులు అదేవిధంగా  మధ్యాహ్నం 2:30 నుండి 5 గంటల వరకు నిర్వహించే పరీక్షకు 3846 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు ఆయన తెలిపారు. పరీక్షలు నిర్వహించే కేంద్రాల వద్ద అన్ని మౌలిక సదుపాయాలను సమకూర్చుకోవాలని ఆయన సూచించారు. పరీక్ష కేంద్రాల  వద్ద అత్యవసర మందులతోపాటు ఏఎన్ఎం,  సిబ్బంది నియమించాలని వైద్యాధికారికి సూచించారు. పరీక్ష సమయాలకు అనుగుణంగా బస్సులను నడపాలని ఆర్టిసి అధికారులకు తెలిపారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్స్ అనుమతించకూడదని అధికారులకు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు నిర్వహించాలని ,  పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించార .ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకా దేవి, డిటిఓ దశరథ్,  డిప్యూటీ డిఎంహెచ్ఓ జీవరాజ్, ఆర్టీసీ డిప్యూటీ మేనేజర్ భిక్షు నాయక్, విద్యుత్ శాఖ ఏఈ రాజగోపాల్ రెడ్డి, పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ డి.వి.పి. రాజు,  ట్రాన్స్ పోర్ట్ అధికారి జోసెఫ్ లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *