టీ-డయాగ్నొస్టిక్స్‌లో ఉచితంగా 134 వైద్యపరీక్షలు

  • ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ
  • మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు
  • దేశంలో ఎక్కడా ఇలాంటి
  • కార్యక్రమం లేదని వెల్లడి

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, జూలై 1 : టి-డయాగొస్టిక్స్ ‌ద్వారా ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న 57 రకాల ఉచిత వైద్య పరీక్షలను 134కు పెంచి రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు అన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం కృషిచేద్దామని మంత్రి హరీష్‌ ‌రావు  అన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల వైద్య సైవలు, పరీక్షలు ఉచితంగా అందిస్తున్నామని చెప్పారు. 70 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లోనే జరుగుతున్నాయని తెలిపారు. ఆయన శనివారం శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్‌ ‌డివిజన్‌ ‌పరిధిలోని జిల్లా ప్రభుత్వ దవాఖాన నుంచి వర్చువల్‌గా ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వ విప్‌, ‌శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…రాష్ట్ర వ్యాప్తంగా 8 డయాగ్నొస్టిక్స్ ‌సెంటర్లు, 16 రేడియాలజీ సెంటర్లను అందుబాటులోకి వొచ్చాయి.

తెలంగాణ డయాగ్నొస్టిక్స్ ‌ద్వారా ఇప్పటి వరకు 54 వైద్య పరిక్షలు ఉచితంగా అందుబాటులో ఉండగా ఇప్పుడు 134 వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. దేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం లేదని మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. పరీక్షలకు సంబంధించిన రిపోర్టులను రోగి, వైద్యుల మొబైల్‌కు పంపిస్తారని. ప్రభుత్వ హాస్పిటళ్లలో టిఫా స్కాన్‌, 2‌డి-ఎకో రేడియాలజీ ల్యాబ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ హాస్పిటళ్లను కార్పొరేట్‌ ‌స్థాయి హాస్పిటళ్లకు దీటుగా మార్చి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌ ‌చుట్టుపక్కల నాలుగు మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్లు త్వరలోనే అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. కొరోనా సమయంలో వైద్యులు ప్రాణాలకు తెగించి పనిచేశారని, ప్రజలను మహమ్మారి బారి నుంచి రక్షించారని వెల్లడించారు. రాష్ట్రంలో వైద్యుల పనితీరు అద్భుతంగా ఉందన్నారు. వైద్యారోగ్య రంగంలో దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలిచేలా కృషిచేసిన డాక్టర్లందరికీ.. వరల్డ్ ‌డాక్టర్స్ ‌డే శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ  మాట్లాడుతూ…వైద్యం కోసం ఏ దవాఖానకు వెళ్లినా వైద్యులు రక్త పరీక్షలు చేయాలని అంటారని, అందుకోసమే తెలంగాణ డయాగ్నోస్టిక్‌ ‌సేవలు ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ఇక్కడి పేద మధ్యతరగతి ప్రజలకు అది ఎంతగానో ఉపయోగపడుతుందని, కొండాపూర్‌ ‌జిల్లా ప్రభుత్వ హాస్పిటల్‌తో పాటు అన్ని హంగులతో సకల సౌకర్యాలతో అన్ని ప్రభుత్వ హాస్పిటళ్లను కార్పోరేట్‌కు దీటుగా తీర్చిదిద్దిన ఘనత  ముఖ్యమంత్రి  కేసీఆర్‌ ‌కే దక్కుతుందని,  ప్రతి ఒక్కరు ఈ చక్కటి సదవకాశాన్ని సద్వినియోగపర్చుకోవాలని కోరారు. జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా వైద్యులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

బస్తీ ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని ఉద్దేశ్యంతో 57 రకాల ఉచిత వైద్య పరిక్షల నుండి 134  పరీక్షలు చేయనున్నామని  వైద్యం కోసం వొచ్చే శేరిలింగంపల్లి పరిసర ప్రాంత ప్రజలు మరోచోటకు వెళ్లకుండా ఇక్కడే అన్ని రకాల వైద్యసదుపాయాలు పొందాలనే విధంగా ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ విధమైన వైద్య సదుపాయాలను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ,ప్రస్తుత రోజుల్లో ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌లో మధ్యతరగతి, పేద వారికి వైద్యం అందనంత దూరంలో ఉందని వారికి అందుబాటులోకి  ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలను తీసుకువచ్చిందని,  పేద ప్రజలు ఈ వైద్య సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ హాస్పిటల్‌లో వైద్యులు బాగా అనుభవజ్ఞులైన వారు ఉంటారని వారి సేవలు పొందాలని ప్రభుత్వ విప్‌ ‌గాంధీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, డాక్టర్లు, అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *