జూన్‌ 24 నుంచి ప్రత్యేక ‘పార్లమెంట్‌’

న్యూదిల్లీ, జూన్‌ 11 : కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరిన వేళ, పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలను కూడా నిర్వహించేందుకు కసరత్తు మొదలయ్యింది. ఈ క్రమంలో లోక్‌సభ కార్యకలాపాలు నిర్వహించేందుకు స్పీకర్‌ను ఎన్నుకోవాల్సి ఉంది. అంతకంటే ముందుగా కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. వీటికోసం పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయని సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి.

జూన్‌ 24 నుంచి జులై 3 వరకు వీటిని నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. జూన్‌ 24-25 తేదీల్లో ఎంపీల ప్రమాణ స్వీకారం, జూన్‌ 26న స్పీకర్‌ ఎన్నిక ఉండొచ్చని సమాచారం. ఈ సమయంలో స్పీకర్‌ పదవి ఎవరికి దక్కొచ్చనే అంశం ఆసక్తిగా మారింది.   మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో కీలకంగా ఉన్న తెదేపా, జేడీయూ ఆ పదవిని ఆశించినట్లు వార్తలు వొచ్చాయి. ఇండియా కూటమి పార్టీలు సైతం స్పీకర్‌ పోస్టుకు పట్టుబట్టాలని వీరిపై ఒత్తిడి తేవడం గమనార్హం. మరోపక్క, రాజస్థాన్‌ కోటా స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఓం బిర్లాకు మరోసారి అవకాశం ఇవ్వొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఆంధప్రదేశ్‌ భాజపా అధ్యక్షురాలు పురందేశ్వరి పేరు కూడా ప్రచారంలో ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *