స్వచ్ఛ సర్వేక్షణ్-2023లో నగరానికి 5 అవార్డులు
దిల్లీలో ప్రదానం…అవార్డులు అందుకున్న జిహెచ్ఎంసి ప్రతినిధులు
జిహెచ్ఎంసికి క్లీన్ సిటీ అవార్డుపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 11 : లక్ష జనాభా పైబడిన నగరాల్లో ఆల్ ఇండియా క్లీన్ సిటీ 9వ ర్యాంకు సాధించిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛ సర్వేక్షణ్- 2023 సంవత్సరానికి గాను ఫైవ్ స్టార్ రేటింగ్లో అవార్డు జిహెచ్ఎంసి అందుకుంది. గురువారం దిల్లీలో భారత మండపం వేదికగా జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి చేతుల మీదుగా అవార్డును జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్, శానిటేషన్ అడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ సోమ భరత్, సానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్ మంజుల అందుకున్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్-2023 కింద హైదరాబాద్ నగరానికి భారతదేశంలో 9వ క్లీన్ సిటీ, భారతదేశంలో 5 స్టార్ రేటింగ్ పొందిన చెత్త రహిత నగరం, తెలంగాణలో స్వచ్ఛ నగరం,
తెలంగాణలో మొదటి 5 స్టార్ రేటింగ్ పొందిన నగరం(జనాభా – 1 లక్ష), వాటర్G సిటీగా మళ్లీ ధృవీకరణ వంటి 5 అవార్డులను అందుకుంది. ఇక జిహెచ్ఎంసి ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను అందుకుంటూనే ఉంది. జిహెచ్ఎంసి స్వచ్ఛ సర్వేక్షణ్ కింద 2015 నుండి 2022 వరకు 10 లక్షల జనాభా కంటే ఎక్కువ సిటీ జాబితాలో ర్యాంకింగ్ సాధించింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2018 లో గ్రేటర్ హైదరాబాద్కు బెస్ట్ స్టేట్ క్యాపిటల్ అవార్డు పొందింది.
స్వచ్ఛ సర్వేక్షణ్-2019లో బెస్ట్ మెట్రో సిటీ అవార్డు దక్కింది. ఇదే సంవత్సరంలో ఓడిఎఫ్GG పొందింది. 2019 సంవత్సరంలో జిహెచ్ఎంసి స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు ను పొందింది. స్వచ్ఛ సర్వేక్షణ్-2020లో బెస్ట్ మెగా సిటీ, ఇన్ సిటిజన్ ఫీడ్ బ్యాక్ అవార్డు పొందింది. 2021 సంవత్సరంలో బెస్ట్ సెల్ఫ్ సస్టైనబుల్ మెగా సిటీ అవార్డును పొందడం ద్వారా త్రీ స్టార్ హోదాను పొందింది. ఇదే సంవత్సరంలో వాటర్ ప్లస్ సర్టిఫికెట్ను మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ అఫైర్స్, హౌసింగ్ ద్వారా పొందింది. 2022 సంవత్సరంలో గార్బేజ్ ఫ్రీ సిటీ కింద త్రీ స్టార్ హోదా ను పొందింది. తిరిగి ఈ సంవత్సరం కూడా రీ-సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకుంది. జాతీయ స్థాయిలో జిహెచ్ఎంసికి అవార్డు రావడం మరింత బాధ్యత పెరిగిందని, జాతీయ స్థాయిలో గ్రేటర్ కు అవార్డు దక్కడంలో విశేష కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఈ సంద్భంగా మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
జిహెచ్ఎంసికి క్లీన్ సిటీ అవార్డుపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం
జిహెచ్ఎంసికి ఫైవ్ స్టార్ రేటింగ్లో 2023 సంవత్సరానికి గాను స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు రావడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రోనాల్డ్ రాస్తో పాటు ఆడిషనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డిని ఆయన అభినందించారు. భవిష్యత్ లో మరిన్ని అవార్డ్ లు అందుకోవాలని ఆకాంక్షించారు.




