ఇదో రకమైన భూకబ్జానే అంటూ వ్యాఖ్యలు
హైదరాబాద్, జూన్ 28(ఆర్‌ఎన్‌ఎ) : కమ్మ, వెలమ సంఘాలకు భూములు కేటాయిస్తూ జారీ చేసిన జీవో నెంబరు 47పై తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. 2021లో కమ్మ, వెలమ కుల సంఘాలకు చెరి ఐదు ఎకరాల భూములు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. బలమైన కులాలకు భూకేటాయింపులు సరికాదంటూ ప్రొఫెసర్ ఎ.వినాయక్ రెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ తుకారాంజీ బెంచ్ విచారణ చేపట్టింది. ప్రభుత్వమే కులాలను పెంచి పోషిస్తుందా..హైటెక్ రాష్ట్రం తెలంగాణలో ఇదేం పద్ధతి?.. 21వ శతాబ్దంలోనూ ఇలాంటి విధానాలు సరికాదంటూ హైకోర్టు తీవ్ర వాఖ్యలు చేసింది. కుల సంఘాలకు ప్రభుత్వ భూములను కేటాయించడం అసంబద్ధమైన విధానమని న్యాయస్థానం పేర్కొంది.
సమాజంలో అణగారిన వర్గాలకే ప్రభుత్వాలు భూములను కేటాయించాలని రాజ్యాంగంలో ఉందని హైకోర్టు దర్మాసనం వెల్లడించింది. ఇలాంటి కేటాయింపులు కూడా భూ ఆక్రమణల కిందకే వొస్తాయని పేర్కొంది. కులాల వారీగా భూముల కేటాయింపును తప్పుబట్టిన కోర్టు.. ఆ భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. 2021లో తెలంగాణ ప్రభుత్వం కమ్మ, వెలమ సంఘాలకు ఖానామెట్‌లో ఐదు ఎకరాల చొప్పున భూమి కేటాయించింది.
దీనిపై కాకతీయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి హైకోర్టులో వేసిన పిల్‌పై సిజె బెంచ్ బుధవారం విచారించింది. అణగారిన వర్గాలకు భూములు ఇస్తే అర్థ చేసుకోవచ్చునని.. కాని, బలమైన కుల సంఘాలకు భూములు ఇవ్వడం ఎందుకని బెంచ్ ప్రశ్నించింది. ఇలా భూములు కేటాయించడం కూడా ఒక విధమైన కబ్జానే అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా సాయిసింధు ఫౌండేషన్‌కు ప్రభుత్వం కేటాయించిన భూమి రద్దును హైకోర్టు గుర్తు చేసింది. భూ కేటాయింపులపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు స్టే కొనసాగుతుందని వెల్లడించింది. కౌంటర్ దాఖలు చేసేందుకు కమ్మ సంఘానికి కోర్టు అనుమతి ఇచ్చింది. తదుపరి విచారణను ఆగస్టు 2వ తేదీకి వాయిదా వేసింది.




