జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర తగ్గుతుంది

కేంద్ర కేబినెట్‌లోనూ ప్రాతినిధ్యం తక్కువే..
జాతీయ స్థాయిలో రాణించేందుకు అందరూ కలిసిరావాలి..
‘గవర్నర్పేట్‌ టు గవర్నర్స్‌ హౌజ్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి పాత్ర కాలక్రమంగా తగ్గుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభిప్రాయపడ్డారు. గతంలో సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్‌ జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని, వారి తరువాత జైపాల్‌ రెడ్డి, వెంకయ్యనాయుడు ఆ స్థాయిని కొంతవరకు నిలబెట్టారని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ఎంసీహెచ్‌ఆర్డీలో ‘గవర్నర్పేట్‌ టు గవర్నర్స్‌ హౌజ్‌’ పుస్తకాన్ని  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకావడం ఒక మంచి అవకాశంగా భావిస్తున్నానని తెలిపారు. 76 సంవత్సరాల్లో అన్నింటిపై అవగాహన పొందిన పెద్దలందరినీ కలుసుకోవడం గొప్ప అనుభూతి అని అన్నారు. అయితే ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఇది మన మనుగడకు, గుర్తింపునకు మంచి పరిణామం కాదన్నారు. మనవాళ్లుగా మనమంతా  కలిసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు. జాతీయ స్థాయిలో హిందీ తరువాత అత్యధికంగా మాట్లాడేది తెలుగు భాషేనని, జాతీయ రాజకీయాల్లో కూడా ఆ స్థాయిలో నిలవాలని సిఎం ఆకాంక్షించారు. కేంద్ర కేబినెట్‌లోనూ మనవాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి ఉందని, వారి లాంటి అనుభవజ్ఞుల నుంచి తమ ప్రభుత్వం సూచనలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి తెలిపారు. గతంలో నంద్యాలలో పీవీ పోటీ చేసినప్పుడు.. తెలుగువాడు ప్రధానిగా ఉండాలని ఎన్టీఆర్‌ పీవీపై తమ పార్టీ అభ్యర్థిని పోటీకి పెట్టకుండా ఏకగ్రీవం చేసే ప్రయత్నం చేశారని కొనియాడారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు మంచి సంప్రదాయాలను పాటించడంలో తప్పులేదని, తమ ప్రభుత్వం కూడా అలాంటి సంప్రదాయాన్ని పాటిస్తుందన్నారు. రాష్ట్రాలుగా విడిపోయినా మనుషులుగా మనం కలిసి ఉండాలని, అభివృద్ధిని ప్రజల చెంతకు చేరవేయడానికి నిరంతరం  కృషి చేస్తామని, అందుకు అందరి సహకారం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *