- పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు..
- 10 మంది మావోయిస్టులు మృతి.. ధృవీకరించిన బస్తర్ ఐజి సుందర్ రాజ్
- మృతుల్లో ఇద్దరు మహిళలు, 8 మంది పురుషులు
భద్రాచలం, ప్రజాతంత్ర,ఏప్రిల్ 30 : తెలంగాణకు సరిహద్దున ఉన్న ఛత్తీస్‌ఘఢ్ రాష్ట్రం నారాయణ్ పూర్‌లోని అబూజ్‌మడ్ దండకారాణ్యంలో మళ్ళీ తుపాకుల మోత మోగింది. దండకారణ్యంలో నెత్తురు ఏరులై పారుతుంది. మంగళవారం నారాయణ్‌పూర్ అబూజ్‌మడ్ దండకారణ్యంలో జవాన్‌లకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా జవాన్‌లు కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో మావోయిస్టులు ఆ ప్రాంతంలో సంచరిస్తున్నారు. జవాన్‌ల రాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించటంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టులను గుర్తించినట్లు బస్తర్ ఐజి సుందర్ రాజ్ తెలిపారు.
మృతి చెందిన మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలతో పాటు ఎనిమిది మంది పురుషులు ఉన్నట్లు తెలుస్తుంది. ఘటన స్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ రాబిన్‌సన్ వెల్లడిరచారు. ఘటనా స్థలం నుండి ఒక ఏకె47 ఆయుధంతో పాటు మందుగుండు సామాగ్రి కూడ స్వాధీనం చేసుకున్నారు. డిఆర్‌జి మరియు ఎస్‌టిఎఫ్ సమైఖ్య బృందం మావోయిస్టులపై కాల్పులు జరిపినట్లు ఐజి తెలిపారు. కాగా కాల్పులు జరిగిన సంఘటన స్థలంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో సిసి సభ్యుడు, డివిసి సభ్యులు హతమైనట్లు సమాచారం. ఘటనస్థలంలో బంకర్‌లు తవ్వేందుకు ఉపయోగించే జేసిబిల మిషనును స్వాధీనం చేసుకున్నారు. బస్తర్ అటవీ ప్రాంతంలో సీనియర్ మావోయిస్టులు ఉన్నారనే పక్కా సమాచారంతోనే జిల్లా రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాక్స్‌ఫోర్స్ సంయుక్త బృందం సోమవారం రాత్రి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహించారు. కంకూర్ గ్రామానికి చేరుకున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగాయి.
ఈ కాల్పులో 10 మంది మావోయిస్టులు మృత్యువాత పడ్డారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టులకు భారీగా ఎదురుదెబ్బ తగులుతుంది. గత ఏప్రిల్ 16వ తేదీన కాంకర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మావోయిస్టులను మావోయిస్టు పార్టీ కోల్పోయింది. 30వ తేదీన 10 మంది మావోయిస్టులను ఆ పార్టీ కోల్పోవల్సి వొచ్చింది. ఈ సంఘటనపై భద్రతా సిబ్బందిపై చేయి సాధించినట్లైంది. మావోయిస్టులను ఛత్తీస్‌ఘఢ్ అటవీ ప్రాంతం నుండి ఏరివేసేందుకు ఆ ప్రభుత్వాలు పక్కా మాస్టర్ ప్లాన్ వేస్తుంది. నిత్యం మావోయిస్టుల ఏరివేతకు ప్రత్యేక పోలీస్ బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతున్నాయి. ఈ క్రమంలో మావోయిస్టులు ఎటూ తప్పించుకోలేని పరిస్థితి ఏర్పడడంతో మావోయిస్టు పార్టీ ఇటీవల కాలంలో తీవ్రంగా నష్టం చవి చూడాల్సి వొచ్చింది.





