చిక్కుముడి వీడని పాలేరు పంచాయితీ

  • కాంగ్రెస్‌ ‌కంచుకోటపై పొంగులేటి, షర్మిల, తుమ్మల కన్ను..
  • పొత్తు ఉన్నా, లేకున్నా తనకే అంటున్న సీపీఎం తమ్మినేని

తెలంగాణలోని రాజకీయ పార్టీలందరి దృష్టీ ఇప్పుడు పాలేరు నియోజకవర్గం పైనే ఉంది. ఈ నియోజకవర్గం నుండి పోటీ పడుతున్న వారంతా ప్రముఖులు కావడంతో ఇది ప్రత్యేకతను చాటుకుంది. వాస్తవానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకే ప్రత్యేకత ఉంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు(ఎన్టీఆర్‌) ‌ప్రభంజనాన్ని, ఆ తర్వాత ఉధృతంగా సాగిన తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో జరిగిన ఎన్నికల్లో తట్టుకుని ఈ జిల్లా తన ప్రత్యేకతను చాటుకుంది. ఇక్కడ కమ్యూనిస్టులకు ఎంత పట్టు ఉందో, కాంగ్రెస్‌కు అంత పట్టు ఉంది. అలాగే పాలేరు నియోజకవర్గానిది కూడా అదే ప్రత్యేకత. ఈ నియోజకవర్గాన్ని ఎక్కువ సార్లు గెలుచుకున్న చరిత్ర కాంగ్రెస్‌కుంది. కాగా సిపిఎం రెండు సార్లు, సిపిఐతోపాటు నాటి టిఆర్‌ఎస్‌ ‌నేటి బిఆర్‌ఎస్‌ ఒక్కోసారి మాత్రమే ఈ స్థానాన్ని కైవసం చేసుకోగలిగాయి. అయితే తాజాగా ఈ నియోజకవర్గం నుండి పలువురు పోటీ పడుతుండడంతో  మరోసారి ఈ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.

విచిత్రమేమంటే కాంగ్రెస్‌లోనే పోటీ పెరగడంతో ఎవరినీ కాదనలేని పరిస్థితి నాయకత్వానికి ఏర్పడింది. ఫలితంగా ఈ పంచాయితీ ఇప్పుడు ఇటు టీపీసీసీలో కాకుండా అటు దిల్లీ అధిష్టానం వద్ద కాకుండా మధ్యలో బెంగుళూరుకు చేరుకుంది. ఈ నియోజకవర్గం కోసం పోటీ పడుతున్న ముగ్గురూ కీలక నేతలే కావడం ఒక ఎత్తు అయితే…కాంగ్రెస్‌ ‌తన బలాన్ని పెంచుకునే క్రమంలో పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నవారు వీరిలో ఇద్దరుండడంతో ఇదిప్పుడు ఆసక్తిగా మారింది. వైఎస్‌ఆర్‌టిపి పార్టీ అధినేత వైఎస్‌ ‌షర్మిల కాంగ్రెస్‌ ‌తీర్థం పుచ్చుకోవటం ఖామమైందన్న వార్తలు వినిపిస్తున్నాయి.. అయితే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు అమె కొన్ని షరుతులు పెట్టినట్లు తెలుస్తున్నది. మిగతా వాటి విషయం ఎలా ఉన్నా ప్రధానంగా పాలేరు నియోజక వర్గం నుండి తాను పోటీచేస్తానన్నది వాటిలో ప్రధానమని తెలుస్తున్నది. తాను మూడేళ్ళ కింద పార్టీ స్థాపించినప్పటి నుండీ తనకు అనువైన నియోజకవర్గంగా ఆమె పాలేరును ఎంపిక చేసుకోవడంతో పాటు అక్కడ తన పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటుచేసుకుని, ఆ నియోజకవర్గంపైనే ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తున్నది.

అయితే తన పార్టీ ఒంటరిగా పోటీ చేసి తట్టుకోలేదనుకుందో ఏమోగాని కాంగ్రెస్‌లో పార్టీలో విలీనం చేసేందుకు దాదాపు అంగీకరించింది. దీనిపైన ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పక్రియను విజయవంతంగా పూర్తిచేసే బాధ్యతను కాంగ్రెస్‌ అధిష్టానవర్గం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్‌కు అప్పగించింది. ఒక వేళ విలీనమైనప్పటికీ తాను పాలేరునుండే పోటీచేసే పట్టుదలతో ఆమె ఉన్నట్లు తెలుస్తున్నది. అయితే  తెలంగాణ రాజకీయాల్లో షర్మిల ప్రమేయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇష్టపడడంలేదు. ఆమెను ఏపికి పరిమితం చేయాలన్న తన అభిప్రాయాన్ని అధిష్టానం వద్ద గట్టిగా వినిపిస్తున్నాడాయన. ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు  డికె శివకుమార్‌ ‌ముందు పరిష్కారానికి ఉంది. షర్మిలను కాంగ్రెస్‌లోకి తీసుకురావడంలో ఆయన ప్రమేయమే ఉండడమే అందుకు కారణం.

ఇదిలా ఉంటే బిఆర్‌ఎస్‌లో టికెట్‌  ఆశించి భంగపడిన తుమ్మల నాగేశ్వర్‌ ‌రావు ఎపిసోడ్‌ ‌కూడా అటుతిరిగి ఇటు తిరిగి పాలేరు వద్దనే నిలుస్తున్నది. మొదటి నుండి తుమ్మల నాగేశ్వర్‌రావు పాలేరు మీదనే ఆశపెట్టుకున్నారు. బిఆర్‌ఎస్‌లో తనకు పాలేరు సీటు ఖాయమనుకుని ఆయన ఇప్పటికే ఆక్కడ తన వంతు కార్యక్రమాలను నిర్వహించుకుంటూ వొస్తున్నారు. అయితే అనూహ్యంగా ఆయనను  కాదని మరొకరికి పాలేరు అభ్యర్థిగా బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ‌ప్రకటించారు. దీంతో అలిగిన తుమ్మలను అనునయించడానికి బిఆర్‌ఎస్‌ ‌నాయకత్వం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసి కొట్టాయి. దీంతో ఆయన ఖమ్మం జిల్లాలో తన బలమేంటన్నది తాజాగా బ్రహ్మాండమైన ప్రదర్శన ద్వారా చెప్పకనే చెప్పారు. తుమ్మలను తమ పార్టీలో చేర్చుకోవడం ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తమ బలం ఇనుమడిస్తుందని కాంగ్రెస్‌ ‌భావించింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, శాసనసభలో కాంగ్రెస్‌ ‌పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఆయనను స్వయంగా కలుసుకుని మంతనాలు చేశారు. ఆయన ఇంకా అధికారికంగా గ్రీన్‌ ‌సిగ్నల్‌ ఇవ్వకున్నప్పటికీ కాంగ్రెస్‌లో చేరటం ఖాయమంటున్నారు. అయితే ఆయన కూడా పాలేరు నుండే పోటీ చేసే షరతు విధిస్తున్నట్లు వార్త. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పేరున్న, పలుకుబడి కలిగిన సీనియర్‌ ‌నాయకుడు కావడంతో ఆయన డిమాండ్‌ను పరిశీలించాల్సిందిగా రేవంత్‌రెడ్డి అధిష్టానం పైన వొత్తిడి తీసుకువొస్తున్నట్లు వినికిడి.

కాగా ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాను ఒంటిచేత్తో గెలిపించుకువొస్తానని శపథం చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కూడా పాలేరుపై కన్ను ఉంది. ఖమ్మంలో స్ట్రాంగ్‌ ‌లీడర్‌గా కాంగ్రెస్‌ అధిష్టానం ఆయన మాటను కాదనలేని పరిస్థితి. వీరే కాకుండా కాంగ్రెస్‌ ‌నుండి మరికొందరు కూడా పాలేరుపై మనసు పారేసుకున్నారు. వారిలో గతంలో కాంగ్రెస్‌ ‌పక్షాన ఇక్కడ పోటీచేసి ఓటమి చవిచూసిన రాయల నాగేశ్వర్‌రావు, మద్ది శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు చరణ్‌రెడ్డి, రామసహాయం మాధవరెడ్డి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వామపక్షాలను ఈసారి బిఆర్‌ఎస్‌ ‌పక్కకు పెట్టింది. ఒక వేళ కలిసి పోటీచేసినా, చేయకపోయినా పాలేరు నుండి పోటీకి సిపిఎం నేత తమ్మినేని వీరభద్రం ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు వామపక్షాలకు కాంగ్రెస్‌తో పొత్తు కుదిరితే పాలేరుపైన మరోసారి పీఠముడి పడకపోదు. మొత్తం మీద ఈ ఎన్నికల్లో పాలేరు చిక్కుముడిలో పడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *