- ఎల్బీ స్టేడియంలో జెండా ఆవిష్కరించిన సిఎం కెసిఆర్
- ఆకట్టుకున్న వార్సి బ్రదర్స్ ఖవ్వాలి
- ఉర్రూతలూగించిన శంకర్ మహదేవన్ గానం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 22 :: భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ ముగింపు వేడుకలు ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. వేడుకలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు హాజరయ్యారు. స్టేడియం వద్దకు వచ్చిన సీఎంకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. స్టేడియంలో మొదట మహాత్మా గాంధీకి సీఎం కెసిఆర్ నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి, జెండావందనం చేశారు. దేశానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారంతో వేడుకలు ముగియనుండగా.. పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ముగింపు వేడుకలకు రాష్ట్రం నలమూలల నుంచి ప్రజాప్రతినిధులు తరలివచ్చారు. ఈ వేడుకల్లో భాగంగా వార్సి బ్రదర్స్ నిర్వహించిన ఖవాలి అందరిని మైమరిపించింది.
వారి గానానికి అందరూ మంత్ర ముగ్ధులయ్యారు. ఈ వేడుకలను సీఎం కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షిస్తున్నారు. వార్సి బద్రర్స్ ప్రఖ్యాతమైన ఖవాలి కళాకారులు. 2014లో కేంద్ర సంగీత నాటక అకాడవి• అవార్డు అందుకున్నారు. ఇప్పుడు ఆ ఉర్దూ సుగంధాన్ని పంచబోతున్నారు. ఇరానీ చాయ్‌లో బన్ మస్కతి అద్దుకొని తిన్నట్లు కవాలిని ఆస్వాదిద్దామని ప్రముఖ కవి, గాయకుడు, రచయిత దేశపతి శ్రీనివాస్ సభకు తెలియజేశారు. ఇకపోతే స్వరశిఖరం.. భారత బాలీవుడ్ సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ తన గానంతో తుపాను సృష్టించారు. ఎల్బీ స్టేడియంలో వజ్రోత్సవ ముగింపు వేడుకల్లో శంకర్ మహాదేవన్ తన గాత్రంతో అందర్నీ మైమరిపించారు. గణనాయ కాయ పాటతో తన కార్యక్రమాన్ని శంకర్ మహదేవన్ ప్రారంభించారు. ఎవరి పేరు చెబితే యావత్ భారతం సముద్ర తరంగమై ఉప్పొంగుతుందో..
ఎవరి పేరు చెబితే ఒక అద్భుతమైన గానం మన హృదయాల్లో ఆవహిస్తుందో.. ఎవరి పేరు చెబితే యువకులు ఆశ్వాల్లాగా పరుగెడుతారో.. అటువంటి ఓ స్వర మాంత్రికుడు, స్వరగిరి శిఖరం, ముంబై దగ్గరుండే చెంబూరులో జన్మించి, ఐదో ఏట నుంచే సంగీతాన్ని అభ్యసించడం మొదలుపెట్టాడు. ఆయన కర్ణాటక సంగీతంలో విద్వాంసులు. హిందుస్తానీ సంగీతంలో విద్వాంసులు. పాశ్చాత్య సంగీత కళలన్నీ అవపోసన పట్టాడు. 1988లో బ్రీత్‌లెస్ సాంగ్ పాడి ఓ కొత్త ఒరవడిని సృష్టించాడు. అది ఒక మహోన్నతమైనటువంటి సంగీత తుపానుగా భారతాన్ని చుట్టుముట్టింది. ఆయనే శంకర్ మహదేవన్ అంటూ దేశపతి శ్రీనివాస్ సభకు పరిచయం చేశారు. ఆయన గానంతో అందర్ని మైమరిపించారు. పద్మశ్రీ పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది.




