బాలల భారతం
డా।। పులివర్తి కృష్ణమూర్తి
ఇక్కడ నా సోదరులూ, తల్లీ నిద్ర పోతున్నారు. మనం దూరంగా వెళ్ళి మన బలాబలాలను చూసుకుందాం. నీ చెల్లెలు నువ్వు చెప్పినట్లుగా చేద్దామనే వచ్చింది. కానీ దాని మనస్సు కామవశం అయింది. దాన్ని ఏమి చెయ్యవద్దు. మనమిద్దరం మన బలాబలాలు పరీక్షించుకుందాం’ అంటున్న భీముడితో ‘ నీరక్తం త్రాగుతాను చూడు’ అంటూ హిడింబుడు ముందుకు తన చేతిని జాపాడు. భీముడు ఆ చేతిని గట్టిగా పట్టుకుని వెనుకకు త్రోసుకుంటూ పోయాడు. హిడింబుని తన బాహువుల మధ్యన బిగించాడు. వాడు గిలగిలలాడిపోయాడు. వారు ముష్టియుద్ధం చేశారు. మదమెక్కిన ఏనుగుల్లాగా వారు పోరుసల్పారు. ధర్మరాజాదులు అప్పటికి నిద్రలేచారు. కుంతి ఎదురుగా కనిపించిన అందాలరాశిని విషయాలు అడిగి తెలుసుకుంది. భీముడు హిడింబుని వధించాడు. కుంతీ, పాండవులూ ఆ తర్వాత ముందుకు సాగిపోతూవున్నారు.
హిడింబి కూడా వారి వెంటే వెళ్ళింది. కుంతీదేవికి తన కామవాంఛను తెలియపర్చి అనుగ్రహించుకుంది. కుంతీదేవి హృదయం ద్రవించింది. స్త్రీని ఆమె క్లేశం నుండి రక్షించడం కూడా ధర్మమే గావున హిడింబిని చేరదీయమంది. ధర్మరాజూ అందుకు అంగీకరించారు. హిడింబిని భీముడు పాణిగ్రహణం గావిస్తూ, ఆమెకు ఒక కుమారుడు కలిగేంతవరకు మాత్రమే తనతో ఉండాలన్నాడు. అందుకు హిడింబి అంగీకరించింది. వారు శృంగార యాత్ర వనాలలో పర్వత గుహలలోనూ సాగిపోయింది. వారికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి భయంకరమైన కన్నులూ, శంఖం వంటి గొంతూ, విశాలదేహమూ ఉన్నాయి. నెత్తిమీద జుట్టు లేదు. అందువలన అతనికి ఘటోత్కచుడు అని పేరు పెట్టింది హిడింబి. అనుకున్న విధంగా హిడింబి తన కొడుకును తీసుకుని వారిని విడిచి వెళ్ళిపోయింది.





