ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 30 : మహేశ్వర మహా పిరమిడ్, పత్రీజీ శక్తి స్థల్ గ్లోబల్ హెడ్ క్వార్టర్ గా విరాజిల్లబోతుందని పిఎస్ఎస్ఎం గ్లోబల్ ఫౌండర్ పరిమళ పత్రి అన్నారు. ప్రతి ఆదివారం ఆరు నుంచి ఏడు వరకు నిర్వహించే ‘పత్రీజీ వన్ నెస్ మెడిటేషన్’లో ప్రతి ధ్యాని చేరి ధ్యానం చేయాలని పిలుపునిచ్చారు. ది హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచ్యువల్ సొసైటీ ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వర పిరమిడ్ లో జరుగుతున్న పత్రీజీ ధ్యాన మహాయాగం వేడుకలు శనివారం పదవ రోజుకు చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న లక్షలాది ధ్యానులు హాజరై పత్రీజీ శక్తి స్థల్ కు ధ్యానంతో నివాళ్లర్పించారు. ఉదయం 5 గంటల నుంచి 8 వరకు నిర్వహిస్తున్న సంగీత ప్రాతఃకాల ధ్యానానికి వేల మంది పిరమిడ్ మాస్టర్లు హాజరయ్యారు. పరిమళ పత్రీ మాట్లాడుతూ 2024 పత్రీజీ మహిళా ధ్యాన మహా యాగం కార్యక్రమం ఘనంగా నిర్వహించుకోవాలని, అందుకు జనవరి నుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. నేటి టెక్నాలజీ యుగంలో వేల కిలోమీటర్లు ప్రయాణించి ధ్యానం నేర్పాల్సిన అవసరం ఇప్పుడు లేదని, మొబైల్ టీవీ ద్వారా జ్ఞానాన్ని పంచుకునే అవకాశం కలిగిందన్నారు. పత్రీజీ శరీరంలా కాకుండా ఒక ఎనర్జీలాగా కనెక్ట్ అయి ఉండేవాడని అన్నారు. ఇవ్వకపోవడం ప్రాపంచిక ఈగో, తీసుకోకపోవడం ఆధ్యాత్మిక ఈగో అన్నారు. విజయ్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ స్థాయిలో పత్రీజీ శక్తి స్థల్ నిర్మాణం చేయడమే తమ ధ్యేయం అని అన్నారు. ఇందుకు ప్రతి ఒక్కరు చేయి చేయి కలపాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పత్రీజీ శక్తి స్థల్ నిర్మాణానికి పాల్వంచకు చెందిన జయశ్రీ రూ.1 లక్ష విరాళం అందజేశారు. పరిణిత పత్రీ మాట్లాడుతూ ఎంతో ముందు చూపు కలిగిన వ్యక్తి బ్రహ్మర్శి పత్రీజీ అని, అన్ని ఆత్మజ్ఞాన గ్రంథాలను అధ్యయనం చేసి ఆ జ్ఞానాన్ని మనకు పంచారని అన్నారు. పత్రీజీ ప్రేమ అనంతమైనది అని, భూమి మీద ఏ జీవి చంప బడకూడదనే సంకల్పించారని అన్నారు. మాంసాహారం తినడం పాపం అని ధైర్యంగా చాటి చెప్పిన వ్యక్తి పత్రీజీ అని అన్నారు. పత్రీజీ శిష్యరికంలో ఎంతోమంది జ్ఞాన యోగులుగా మారి ప్రపంచానికి ధ్యానం నేర్పుతున్నారని అన్నారు. ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా చక్కటి ఆదిత్యం ఇచ్చి తానే స్వయంగా వండి వడ్డించేవారని అన్నారు. పత్రీజీ కొన్ని లక్షల మంది ధ్యాన యోగులను తయారు చేశారని అన్నారు. పత్రీజీ ధ్యాన మహాయాగం విజయవంతం అవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు, గీతాలాపనలు అలరించాయి. కళాకారులు, కవులు, ఆధ్యాత్మిక వేత్తలను సత్కరించి అభినందించారు. ఆధ్యాత్మిక గీతాలు, ధ్యాన గురువుల సందేశాలతో కార్యక్రమం కొనసాగింది. ఈ కార్యక్రమంలో సాంబశివరావు, మారం శివప్రసాద్ రావు, శివప్ప, ధాత్రిక మాధవి, బాలవికాస్ ఇంచార్జి మహేశ్వరి, దామోదర్ రెడ్డి, కూకట్పల్లి లక్ష్మి, నవకాంత్, కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్లోబల్ హెడ్ క్వార్టర్ గా పత్రీజీ శక్తి స్థల్ పరిమళ పత్రీ





