జూన్ 5 నుంచి 12 మధ్య పరీక్షలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 31 : గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. జూన్ 5 నుంచి 12వ తేదీ మధ్య ఎగ్జామ్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మెయిన్స్ పరీక్షను ఇంగ్లీష్, తెలుగుతో పాటు ఉర్దూలో నిర్వహించనున్నారు. క్వాలిఫైయింగ్ పేపర్ అయిన జనరల్ ఇంగ్లీష్ లో ప్రశ్నలు పదో తరగతి స్థాయిలో ఉంటుందని ప్రకటించింది. ఇంగ్లీష్ పరీక్షలో వచ్చే మార్కులను ర్యాంకుల ఖరారులో పరగణలోకి తీసుకోమని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. మెయిన్ పరీక్షలను ఉదయం10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు నిర్వహిస్తారు. జూన్ 5 నుంచి 12 వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నది.
అందులో 11వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజు పరీక్ష ఉండదని వెల్లడించింది. జనరల్ ఇంగ్లిష్ పేపర్ మినహా మిగతా అన్ని పేపర్లకు అభ్యర్థులు తాము ఎంచుకున్న భాషలో పరీక్ష రాసుకోవచ్చని పేర్కొంది. కాగా, గత ఏడాది అక్టోబర్ 16న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2,86,051 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. గ్రూప్-1 ద్వారా మొత్తం 503 పోస్టులను భర్తీ చేయనున్న టీఎస్పీఎస్సీ ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేసింది. అంటే ప్రిలిమ్స్‌కు హాజరైన వారి నుంచి 25,150 మంది అభ్యర్థులను మెయిన్స్ పరీక్షకు ఎంపిక చేసింది.





