గ్రామ పంచాయతీ కార్మికుల న్యాయమైన సమ్మె పట్ల వివక్ష తగదు : కెవిపిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 17: రాష్ట్రంలో 12,769 గ్రామాలలో 50వేల మంది పంచాయతీ సిబ్బంది ఎండ వాన చలి లో ప్రజలకు ప్రత్యక్ష సేవలందిస్తున్నారు .వీరిలో నూటికి 80శాతం మంది దళితులేనని న్యాయమైన డిమాండ్స్ వెంటనే పరిష్కరించాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు అతిమేల మాణిక్ డిమాండ్ చేశారు. సోమవారం పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ చౌరస్తాలో గ్రామపంచాయతీ కార్మికుల 12వ రోజు సమ్మెకు మద్దతుగా పాల్గొని మాట్లాడడం జరిగింది.ఈ సందర్భంగా అతిమేల మానిక్ మాట్లాడుతూ …గ్రామ పంచాయతీ కార్మికులు పంపుఆపరేటర్లు,కారోబార్లు ఎలక్ట్రిషియన్లు, బిల్ కలెక్టర్లు గ్రామ పంచాయతీ సిబ్బంది కరోన వంటి క్లిష్ట పరిస్థితులలోకూడా తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ప్రజలకు సేవలందించారనీ అన్నారు. మోడీ స్వచ్చ భారత్ పిలుపు అయిన కేసీఆర్ పచ్చదనం పరిశుభ్రత పిలుపు అయిన చిత్తశుద్ధితో అమలు చేసింది గ్రామ పంచాయితీ సిబ్బంది. గ్రామీణ ప్రజల జీవన విధానంలో ముఖ్య భూమిక పోషిస్తున్న పంచాయతీ సిబ్బంది పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తుంది.సమ్మె చేస్తున్న కార్మికుల పట్ల వివక్ష పాటిస్తుందనీ అన్నారు. 2014సం.2018 లో జరిగిన ఎన్నికలసందర్బంగా పంచాయతీ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామని సీఎం వాగ్దానం చేశారనీ 9 ఏండ్లు గడిచినా నేటికీ అమలు చేయలేదు. కార్మికులకు కనీస వేతనం లేకుండా వెట్టి చాకిరి చేస్తున్నారు వేతనాలు పెంపు కోసం ప్రభుత్వం రూపొందించిన జీవో నెంబర్ 60 ప్రకారంగా గ్రామపంచాయతీ సిబ్బందికి 19వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం కేవలం 8500 మాత్రమే ఇస్తున్న దుస్థితి ఉంది. ఈ ఆరాకోర వేతనం సరిపోక రోజువారీగా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల వల్ల నానా ఇబ్బందులు పడుతున్నారను ఆవేదనా వ్యక్తం చేశారు. వేతనాలు పెంచకపోవడంతో సిబ్బంది ఆరోగ్యాలు, పిల్లల చదువులు, సరైన భోజనం చేయలేకపోతున్నారు వేతనాలు పెంచకుండా పని భారం పెంచడానికి జీవో నెంబర్ 51 ని రూపొందించి ఒకే కార్మికుడు అనేక పనులు చేయాలనే మల్టిపర్పస్ విధానాన్ని తెచ్చింది. దీంతో కార్మికులపై పని భారం పెరుగుతుంది. మల్టిపర్పస్ విధానం రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలి.గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెలోగొంతెమ్మ కోర్కెలు లేవు. న్యాయం, ధర్మం నీతి ఉంది.గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాల అమలు కోసమే నేడు సమ్మె జరుగుతుంది కార్మికులను పర్మినెంట్ చేస్తామని వేతనాలు పెంచుతామని ముఖ్యమంత్రి గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పిన మాటలునిలబెట్టుకోలేదు పల్లెల్లో ప్రజలకు ప్రత్యక్ష సేవలందిస్తున్న పంచాయతీ కార్మికుల అత్యధికులు దళితులు కావడం వల్లే ప్రభుత్వం వివక్ష పాటిస్తుందా?అనే అనుమానం కలుగుతుంది ప్రమాదవశాత్తు కార్మికులు మరణించినా కనీస ఎక్స్ గ్రేషియో ప్రభుత్వం ఇవ్వలేకపోవడం సిగ్గుచేటు.గ్రామ పంచాయతీ సిబ్బందికి,పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించకపోవడం అన్యాయం కాదా. పంచాయితీ సిబ్బంది అంటే ప్రజా సేవకులు.వారి పట్ల ఈ ఉదాసీనత సరైంది కాదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సర్కార్ కార్మికుల హక్కులను కాలరాసే చర్యలకు ఒడిగట్టింది. బీజేపీ నేతలు నేడు టెంట్ల వద్దకు వచ్చి మద్దతు ఇచ్చినప్పటికీ అసలు కార్మికుల ప్రాథమిక హక్కులను లేకుండా చేస్తున్నది బీజేపీ అనేది మరువకూడదు. కార్పొరేట్లకు ఉపయోగపడే 4 లేబర్ కోడ్ లను తెచ్చి కార్మికుల పొట్టలు కొట్టి కార్పొరేట్లకు మేలు చేస్తుంది. 8 గంటల పని విధానాన్ని 12 గంటలకు పెంచిన ఘనత బిజెపి సర్కార్ దే .గత 9రోజులుగా సమ్మెలో ఉన్న ప్రభుత్వం స్పందించకపోవడం విచారకరం.తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జిపి జేఏసీ ని చర్చలకు ఆహ్వానించి సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింప చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *