గ్రానైట్‌ హబ్‌గా భారతం – ప్రజారోగ్యానికి మంగళం

విదేశీయుల దృష్టిని ఆకర్షిస్తూ విలాసవంతమైన అద్భుత అందాల శిలావిన్యాస విందులు వడ్డిస్తున్న అపూర్వ గ్రానైట్‌ శిలల వ్యాపార కేంద్రంగా భారతదేశానికి పేరుంది. భరతమాత ఒడిలో ఒదిగి ప్రకృతి వరంగా సహజంగా లభిస్తున్న గ్రానైట్‌ రాతి ఖనిజ సంపదకు విదేశీ మార్కెట్‌లో అధిక గిరాకీ ఉంటున్నది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న అద్వితీయ రాతి కట్టడాలు, దేవాలయ శిల్ప సంపదలు, చారిత్రక నిర్మాణాలు మన వద్ద నిక్షిప్తమైన విలక్షణ గ్రానైట్‌ వెరైటీలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. మన దేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్నాటక, మహారాష్ట్ర, అస్సోమ్‌, బీహార్‌, రాజస్థాన్‌, ఒడిసా, మేఘాలయా, యంపీ రాష్ట్రాల్లో గ్రానైడ్‌ శిలా సంపదల వనరులు విస్తరించి ఉన్నాయి.
విదేశాల్లో మన బండకు భలే గిరాకీ;
           దేశవ్యాప్తంగా విస్తరించిన 100కు పైగా గ్రానైట్‌ కంపెనీలు సాలీనా 28 బిలియన్ యూఎస్‌‌ డాలర్ల ఎగుమతుల వ్యాపారం చేస్తున్నాయి. మన భారతంలో ఉత్పత్తి అవుతున్న గ్రానైట్‌లో 90 శాతం వరకు విదేశాలకు, అందులో 20 – 30 శాతానికి పైగా యూఎస్‌కు ఎగుమతి అవుతున్నది. ఒక్కొక్క గ్రానైట్‌ కంపెనీలో దాదాపు 20,000 మంది ప్రత్యక్ష/పరోక్ష ఉద్యోగులు/శ్రామికులు పని చేస్తుంటారు. ఒక గ్రానైట్‌ కంటేనర్‌ సగటున దాదాపు 24,000 డాలర్ల ఖరీదు పలుకుతూ సాలీనా 400 వరకు కంటేనర్స్‌ ఉత్పత్తి జరుగుతున్నది. గ్రానైట్‌ పరిశ్రమకు కేంద్రంగా తమిళనాడు నిలుస్తూ, రెండవ స్థానంలో ఆంధ్ర, కర్నాటకలు ఉన్నాయి.  గ్రానైట్‌ ఉత్పత్తి, ఎగుమతుల్లో భారతానికి అధిక ప్రాధాన్యం ఉన్నది. మన దేశ గ్రానైట్‌కు స్లాబ్స్‌, టైల్స్‌, కిచెన్ నిర్మాణాలు,‌ ఉపరితల ప్లేట్స్‌, స్మారక కట్టడాలు, భవన నిర్మాణాలు, పెద్ద పెద్ద కట్టడాలు, దేవాలయాలు, ప్రార్థనగా మందిరాల నిర్మాణాల నిమిత్తం విదేశీ మార్కెట్‌లో భలే గిరాకీ ఉన్నది. యూఎస్‌, యూరోప్‌, జపాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సైత్‌ ఆఫ్రికా, చైనా లాంటి దేశాలకు మన గ్రానైట్‌ ఎగుమతులు అధికంగా జరుగుతున్నాయి.
విదేశాల్లో పెరిగిన గ్రానైట్‌ గిరాకీ:
          కఠిన స్పటిక ఫెల్డ్సార్‌, క్వార్డ్జ్‌, ఇగ్నీసియస్‌ సహజ శిలలను గ్రానైట్‌గా పిలుస్తాం. రంగులు(బ్లాక్‌, గ్రే, పింక్‌, మల్టీకలర్డ్‌), ఆకృతులను(టెక్చర్‌) బట్టి 110 రకాల గ్రానైట్‌ శిలలు మన భారతంలో లభిస్తున్నాయి. నాణ్యత, కఠినత్వం, ప్రత్యేక రంగులకు మన గ్రానైట్‌ చిరునామాగా నిలుస్తున్నది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, రాజస్థాన్‌, తమిళనాడు రాష్ట్రాల గ్రానైట్‌కు అపూర్వ విదేశీ ఆదరణ లభిస్తున్నది. ఆంధ్రప్రదేశ్‌లో 12, కర్నాటకలో 13, తమిళనాడులా 14, రాజస్థాన్‌లో 03, ఒడిస్సాలో ఒకటి చొప్పున మొత్తం 43 గ్రానైట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు విస్తరించబడి ఉన్నాయి. ఇతర దేశాల గ్రానైట్‌ ధరలతో పోల్చితే మన గ్రానైట్‌కు నాణ్యత ఎక్కువ, ధర తక్కువగా ఉండడంతో మన గ్రానైట్‌ ఎగుమతులు అధికంగా జరుగుతున్నాయి. 2023లో గ్రానైట్‌ వ్యాపారం 4.1 శాతం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ గ్రానైట్‌ అవసరాల్లో 15 శాతం భారత్‌ ఉత్పత్తి చేస్తున్నది.
గ్రానైట్‌ పరిశ్రమతో పర్యావరణ కాలుష్యం:
        భారత దేశంలో గ్రానైట్‌ వాణిజ్యం రోజు రోజుకు క్రమంగా పెరుగుతోంది. గ్రానైట్‌ క్వారీల్లో పని చేసే శ్రామికులు, స్థానిక ప్రజానీకం, సాదు జంతువులు, వన్యప్రాణులు, పరిసర ప్రాంతాల పర్యావరణాలు గ్రానైట్‌ పరిశ్రమలతో తీవ్ర కాలుష్యానికి లోనవుతున్నారు. క్వారీ సైట్స్‌, క్వారీ పరిసరాలు, క్రషింగ్‌, రవాణా, డ్రిల్లింగ్, బ్లాస్టింగ్‌, రోడ్డు సైడ్‌‌ ప్రాంతాలు తీవ్ర శబ్ద కాలుష్యపు నెలవులుగా నిలుస్తున్నాయి. క్వారీ వర్కర్లలో 88 శాతం మందికి శ్వాస కోశ సంబంధ సమస్యలు చుట్టు ముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ్రానైట్‌ తవ్వకాల క్వారీలతో నేల నాణ్యత క్షిణించి పోవడం, గాలి కాలుష్యం, శబ్ద కాలుష్యం, నీటి కాలుష్యం, నేల కోత, జీవ వైవిధ్య విచ్ఛిన్నత, క్వారీ వ్యర్థాలు, సింక్‌హోల్స్, ట్రాఫిక్‌, వైబ్రేషన్స్‌, కొండచరియలు విరిగిపడడం, వాతావరణ ప్రతికూల మార్పులు, అడవుల నరికివేత, మానవ – నవ్య ప్రాణుల సంఘర్షణలు‌ లాంటి తీవ్రమైన కాలుష్య సమస్యలు వెంటాడుతున్నాయి. క్వారీ ప్రాంతాలు దట్టమైన దుమ్ము, ధూళి మేఘాలతో నిండిపోతూ కంటి సమస్యలు కూడా ఉత్పన్నం అవుతున్నాయి. క్వారీ పనుల్లో అధిక సమయం పాటు నిమగ్నమవుతున్న శ్రామికులకు తీవ్రమైన అనారోగ్య సమస్యలైన దగ్గు, జలుబు, ఉబ్బసం, గుండె జబ్బులు, తలనొప్పి, కంటి జబ్బులు, గుండె జబ్బులు, ఒత్తిడి, గొంతు సమస్యలు, ఎలర్జీ లాంటి అనారోగ్యాలు పెరుగుతాయి.
గ్రానైట్‌ క్వారీ తవ్వకాలు వరమా, శాపమా !
         గ్రానైట్‌ అందాల వెనుక కాలుష్య భూతాలు క్వారీ పరిసర ప్రాంత ప్రజలను వెంటాడుతున్నాయి. క్వారీ తవ్వకాలతో గుట్టలు, కొండలు క్షణాల్లో మాయం కావడం, పాతాళ లోతుల్లోకి సహితం దూరి గ్రానైట్‌ నిక్షేపాలను వెలికి తీస్తూ బడా బండల బాబులు బంగళాలు కడుతూనే, పర్యావరణ అందాలను మింగేస్తూ, క్వారీ ప్రాంతాలను కాలుష్య కూపాలుగా మార్చుతున్నారు. గ్రానైట్‌ పరిశ్రమలను ఇలాగే అనుమతిస్తే రేపటి తరానికి కొండలు, గుట్టలను ఫోటోల్లోనే చూపించాల్సిన దుస్థితి రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారతంలో నేడు గ్రానైట్‌ వ్యాపారం కంపెనీలకు ఆదాయ వరంగా, గ్రామీణ పర్యావరణానికి శాపంగా మారుతున్నట్లు అభిప్రాయపడడం సముచితంగానే ఉన్నది. ఇలాంటి సహజ ప్రకృతి వనరులను, సంపదలను కాపాడడానికి ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరుతున్నారు. నేటి కొండలు నేలమట్టం అయిన తరువాత తిరిగి వాటిని నిర్మించగలమా అనే ప్రశ్నలను పౌర సమాజం వేసుకొని, చేయి దాటక మునుపే జాగ్రత్త పడదాం, కొండల బండలను, హరిత సంపదలను కాపాడుకుందాం.
image.png
            కెప్టెన్‌: డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
                          9949700037

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *