- చేయనున్న కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల
- ఈటల, ధర్మపురిలకు కేంద్రం అదనపు భద్రత
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 10 : తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్రలకు బీజేపీ శ్రీకారం చుట్టింది. ఆగస్టు నుంచి తెలంగాణ జిల్లాల్లో పాదయాత్రలు చేయాలని కాషాయనేతలు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, ఎంపీ బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. సిర్పూర్ హనుమాన్ దేవాలయం నుంచి కిషన్‌రెడ్డి పాదయాత్ర చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఈయన పాదయాత్ర కొనసాగనుంది. కొండగట్టు నుంచి ఈటల పాదయాత్రను ప్రారంభిస్తారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఈటల యాత్ర సాగనుంది. భద్రాచలం నుంచి బండి సంజయ్ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో బండి పాదయాత్ర సాగనుంది.
ఈటల, ధర్మపురిలకు కేంద్రం అదనపు భద్రత
తెలంగాణ బీజేపీ కీలక నేతలు ఈటల రాజేందర్ , ధర్మపురి అర్వింద్‌లకు కేంద్రం భద్రతను కల్పించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. ఇరువురు నేతలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో పాటు సీఆర్పీఎఫ్ భద్రతను కేంద్ర హోమ్ శాఖ కల్పించింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటలకు ’వై’ ప్లస్ భద్రతను కేటాయించింది. ఈటలకు బుల్లెట్ ప్రూఫ్ వాహనంతో పాటు 11 మందితో భద్రతా సిబ్బంది రక్షణగా ఉండనున్నారు. అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు ’వై’ కేటగిరి భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. అర్వింద్‌కు సెక్యూరిటీగా ’వై’ కేటగిరీలో మొత్తం 8 మంది భద్రతా సిబ్బంది రక్షణ కల్పించనున్నారు. ఈ మేరకు ఈటల, అరవింద్ నివాసాలకు కేంద్ర భద్రతా బలగాలు వెళ్లనున్నాయి.




