గుప్పెడు మంది చేతిలోబండెడు సంపద…

  • సంపద కేంద్రీకృతం కావడం దేశ భవిష్యత్తుకు మంచిదేనా..
  • సామ్‌ పిట్రోడా వ్యాఖ్యలెలా ఉన్నా వర్తమానంలో
  • దేశంలో  ఈ అంశంపై చర్చ అత్యావశ్యకం

గత కొద్ది కాలంగా భారత దేశంలో ఆర్థిక అంతరాలు మరింతగా పెరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. విశ్లేషకులు కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. పేత వాడు మరింత పేదరికంలోకి దిగజారుతుంటే, ధనవంతుడు లెక్కకు మించి ఐశ్వర్యవంతుడై మరింత ఎత్తుకు ఎదుగుతున్నాడు. ఇక అటు కాక, ఇటు కాక త్రిశంఖు స్వర్గంలో మధ్యతరగతి జీవులు మోయలేనంత బరువుతో బతుకులీడ్వలేక చతికిలబడుతున్నారు. దేశంలో ప్రస్తుతం గుప్పెడు మంది చేతిలో బండెడు సంపద, బండెడు మంది చేతిలో గుప్పెడు సంపద అన్న చందంగా పరిస్థితి తయారైంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి 100 పేర్లలో నమోదయ్యేంతగా పెరిగిన వేళ్లతో లెక్కించదగిన ఆ కొద్ది మంది సంపాదన అతి కొద్ది కాలంలోనే అంతగా ఎలా పెరిగిందనే దానిపై అనేక ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్‌ పార్టీ ఓవర్సీస్‌ చైర్మన్‌ సామ్‌ పిట్రోడ ఇటీవల ‘వారసత్వ పన్ను’ పై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల సామ్‌ పిట్రోడ ఒక టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యులో మాట్లాడుతూ..అమెరికాలో ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అతని సంపదలో దాదాపు 55 శాతం ప్రభుత్వానికి వారసత్వ పన్నుగా చేరుతుందని, మిగితా 45 శాతం మాత్రమే వారసులకు చెందుతుందని వ్యాఖ్యానించాడు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తమ మ్యానిఫెస్టోలో ‘సామాజి-ఆర్థిక సర్వే’పై ప్రస్తావించడం..సహజంగానే ఇతర రాజకీయ పార్టీలకు రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకోవడానికి అస్త్రంగా దొరికింది. 2019లో కూడా సామ్‌ పిట్రోడా మధ్య తరగతి ప్రజల పన్ను పెంపు అంశం కూడా విమర్శలకు దారి తీసింది. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ తన ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చత్తీస్‌ఘడ్‌ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మాట్టాడుతూ..కాంగ్రెస్‌ పార్టీ ప్రమాదకరమైన ఉద్దేశ్యాలు బహిరంగమవుతున్నాయని, కాంగ్రెస్‌ రాజకుటుంబానికి చెందిన యువరాజు(రాహుల్‌ గాంధీ) సలహాదారు(సామ్‌ పిట్రోడా) ఇంతకు ముందు మధ్యతరగతి ప్రజలపై ఎక్కువ పన్ను విధించాలని చెప్పారని, ఇప్పుడు మరింత ముందుకు వెళ్లి వారసత్వపు పన్ను విధిస్తామని చెబుతునారని దుయ్యబట్టారు.

తల్లిదండ్రులు కష్టపడి కూడబెట్టిన సంపద వారి పిల్లలకు దక్కది, కాంగ్రెస్‌ హస్తం దాన్ని లాక్కుంటుందని, ‘మీ జీవితకాలంలో దోచుకోండి.. మీ మరణానంతరం దోచుకోండి’ అనేది కాంగ్రెస్‌ మంత్రమని తీవ్ర స్థాయిలో విమర్శించారు. దేశ సంపదను పునర్విభజన చేయాలని కాంగ్రెస్‌ యోచిస్తుందని, ఆ పార్టీ అధికారంలోకి వొస్తే ఆస్తులు, ఆభరణాలు తీసుకుంటుందని ఆరోపించారు. ఇక పిట్రోడా వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాలని కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వారి దాగి ఉన్న పథకాలు బయట పడ్డాయని ప్రజలు గమనించాలి, అలాగే కాంగ్రెస్‌ తన మేనిఫెస్టో నుండి సర్వే ప్రస్తావనను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీనిపై కాంగ్రెస్‌ అగ్రేతలు రాహుల్‌ గాంధీ, జైరామ్‌ రమేష్‌ స్పందిస్తూ..సామ్‌ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని, అయినా ప్రతి వ్యక్తికీ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే హక్కు ఉంటుందని, చాలా విషయాల్లో ఆయన సలహాలను తాము తీసుకుంటామని, అయినా తమ మ్యానిఫెస్టోలో పొందుపరిచిన సామాజిక-ఆర్థిక సర్వే అంశం కేవలం ఆర్థిక అసమానతలు తొలంగించటానికి, సంపద కేంద్రీకృతం కాకుండా చేయడానికి చర్యలు చేపట్టడానికి మాత్రమేకానీ, ప్రజల సొమ్మును లాక్కోవడానికి కాదని వివరణ ఇచ్చారు. అంతేకాకుండా తాము ఈ అంశాన్ని మ్యానిఫెస్టోలో ప్రస్తావించడంపై బిజెపి భయపడుతున్నదని, వారిని ఓటమి భయం వెన్నాడుతున్నదని అన్నారు.

ఈ విషయాలన్ని ఎలా ఉన్నా..సామ్‌ పిట్రోడా ఏ ఉద్దేశ్యంతోని ఆ వ్యాఖ్యలు చేసినా, కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో ఏ ఉద్దేశ్యంతో సామాజిక-ఆర్థిక సర్వే అంశాన్ని పొందుపరిచినా ఇప్పుడు ఈ అంశం విస్తృత స్థాయిలో చర్చకు దారి తీయడం ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ఆర్థిక విశ్లేషణల ప్రకారం కూడా మన దేశంలో ఇటీవలి కాలంలో ఆర్థిక అసమానతలు, అంతరాలు గణనీయంగా పెరుగుతున్నాయి. సంపద మొత్తం గుప్పెడు మంది చేతిలో కేంద్రీకృతమవుతున్నది. దీనికి కారణాలు కోకొల్లలు. నీతిగా, నిజాయితీగా సంపద పెంచుకోవడమనేది తక్కువ కాలంలో సాధ్యమయ్యే అంశం కాదన్నది జగద్విదితం. సంపదను అనతి కాలంలోనే పెంచుకోవడానికి అనేక అక్రమాలకు, పెడధోరణులకు, అధికార దుర్వినియోగానికి, అవినీతికి పాల్పడాల్సి వొస్తుంది.

అనేక అడ్డదారులు తొక్కడానికి ప్రేరేపితమవుతుంది. ఇది దీర్ఘ కాలంలో దేశ సర్వతోముఖాభి వృద్ధికి, సమగ్రతకు, ప్రజాస్వామ్య వ్యవస్థకు పెనుముప్పు. భారత దేశంలో కూడా 1985 వరకు 85 శాతం ఎస్టేట్‌ పన్ను చెల్లించే విధానం అమలులో ఉంది. అయితే అమెరికాలో ఉన్నట్టు సంపదలో 85 శాతం అనో, ఇంకో విధంగానో కాకుండా అధికంగా సంపద కలిగి ఉన్న ప్రజలు తాము స్వచ్ఛందగా, స్వేచ్ఛగా తాము ఇవ్వదలిచినంత జాతికి అంకితమిచ్చే విధంగా చట్టాలలో మార్పు తెస్తే బాగానే ఉంటుందేమో. ఏదేమైనా దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులలో ఇటువంటి అంశాలపై విస్తృత స్థాయిలో చర్చ జరుగాల్సిన, దానిపై ప్రజల అభిప్రాయాలను వ్యక్తపరుచాల్సిన అవసరం అత్యావశ్యకం. అది దేశ భవిష్యతుకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోవడాన్నికెంతో ఉపయుక్తమవుతుంది.
-వి.రామ్మోహన్‌ రావు,
ప్రజాతంత్ర ప్రతినిధి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *