అక్షరానికే అంతుపట్టడం లేదు
మూగబోయిన
నా మనోవేదనని వర్ణించేందుకు.
నిత్య బోయీనైన నాలో
ఎద మోయలేని భావాలభారాలు
వెల్లువెత్తుతోంటే,
నాలోని ఆవేదన సుడిగాలై
నను నిలవనీయట్లేదు,
నేనొక మూగ జీవిని.
ఏదో సాధించాలన్న తపన నాలో ఉన్నా,
ఏమీ చేయలేని మౌనజీవిని.
నిజాలు తేటతెల్లంగా కనిపిస్తున్నా
దృష్టిలోపమున్నట్టు
అబద్దాలకే మద్దత్తు లభిస్తోంటే,
నిఖార్సయిన నిజమిదంటూ
ఎలుగెత్తి అరవాలని ఉన్నా,
స్వార్థం నిండిన మనసులను చేరదని
కళ్ళు ఉన్న కబోదులకు కనబడదని,
అరవలేని మూగజీవిని.
అనుభవాల వృక్షాన్ని
అవమానాల కత్తెరతో కత్తిరిస్తోంటే,
మది ఛిద్రమై
ఆత్మవిశ్వాసపు వెలుగుదీపం
మిణుకు మిణుకు మంటోంది.
నమ్మకం పదే పదే ఓడిపోతోంటే
మనసు మౌనంగా
శిశిరపు వాకిట నిలిచి
నిట్టూర్పు గేయాలు ఆలపిస్తోంది
జరుగుతోన్న అన్యాయాన్ని తలచుకొని
హృదయం చెమ్మగిల్లగా…
– వేమూరి శ్రీనివాస్
9912128967
తాడేపల్లిగూడెం




