గాంధీ చూపిన అహింసా మార్గంలోనే తెలంగాణ సాకారం

  • భారత స్వాతంత్య్ర పోరాట చరిత్ర నేటి యువతకు స్ఫూర్తి
  • అహింస అనే పదునైన కొత్త ఆయుధాలను పరిచయం చేసిన మహాత్ముడు
  • 30 లక్షల విద్యార్థులకు ‘గాంధీ’ చిత్రాన్ని చూపించినందుకు సమాచార పౌర సంబంధాల శాఖకు అభినందనలు
  • స్వాతంత్య భారత వజ్రోత్సవాల ముగింపు సభలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 1 : ‌గాంధీ చూపిన  అహింసా మార్గంలోనే తెలంగాణ సాకారమైందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ ‌రావు స్పష్టం చేశారు. భారత వజ్రోత్సవాలలో స్వాతంత్య్ర పోరాట చరిత్రను, తమ కోసం ప్రాణాలను ధారపోసిన మహనీయుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి భారతీయుని బాధ్యత అని సిఎం అన్నారు. శుక్రవారం హెచ్‌ఐసీసీలో జరిగిన స్వాతంత్య భారత వజ్రోత్సవాల ముగింపు సభకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ ‌రావు ముఖ్య అతిథిగా హాజరై సందేశం ఇచ్చారు. ముందుగా వజ్రోత్సవ ముగింపు వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికీ ఆయన హార్థిక శుభాకాంక్షలు తెలియజేశారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల సందర్భం విశిష్టమైనదని అన్నారు. భారత స్వాతంత్య్ర పోరాట చరిత్రనూ ఆదర్శాలనూ, నేటి తరానికి  తెలియజేయాలనే సత్సంకల్పంతో  గత సంవత్సరం వజ్రోత్సవాల ప్రారంభ వేడుకలను ఎంతో ఘనంగా 15 రోజులపాటు నిర్వహించుకున్నామని సీఎం  అన్నారు. ముగింపు ఘట్టానికి చేరుకున్నామని, ఈ ఉత్సవాలలో భాగంగా నిర్వహించిన అనేక కార్యక్రమాలలో రాష్ట్ర ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలిపారు.

వజ్రోత్సవాల సందర్భంగా 30 లక్షల మంది విద్యార్థినీ, విద్యార్థులకు మహాత్మాగాంధీ చలనచిత్రాన్ని చూపించినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు. సమాచార ప్రజా సంబంధాల శాఖ, విద్యాశాఖల అధికారులు, సిబ్బంది ఈ పనిని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారని, వారికి  అభినందనలు తెలిపారు. భారతదేశం మానవజాతి ఆవిర్భావ వికాసాలకు, ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక తాత్విక చింతనకు, ఉన్నతమైన నాగరికతకు, సాంప్రదాయాలకు పుట్టినిల్లని అన్నారు. అతి ప్రాచీన కాలంలోనే యావత్‌ ‌ప్రపంచానికీ మార్గదర్శిగా నిలిచిన ఘనత మన భారతదేశానిదని సీఎం ఈ సందర్భంగా కొనియాడారు.

బ్రిటిష్‌ ‌వలస పాలనకు వ్యతిరేకంగా సుదీర్ఘ కాలం సాగిన వీరోచిత స్వాతంత్య్ర సమరం  ప్రపంచ చరిత్రలో ఒక మహోన్నత పోరాటంగా నిలిచిపోయిందని, అనేక మంది మేధావులు దేశ ప్రజలలో స్వాతంత్య్ర కాంక్షను రగిలించారన్నారు. స్వామి వివేకానంద  భారత దేశ ఔన్నత్యాన్ని  వివరించడం వల్ల భారతీయులలో  జాతీయ స్పృహ రగిలిందని తెలిపారు. బ్రిటిష్‌ ‌పాలన మన దేశానికి లాభదాయకమని, బ్రిటిషర్లు మన దేశాన్ని ఉద్ధరిస్తున్నారని నమ్మే దురాలోచనాపరులు ఆనాడు కూడా ఉండేవారని, విభిన్న సంస్కృతుల కలయిక అయిన భారతదేశాన్ని ఒక్కతాటి మీద స్వాతంత్ర సమరం నిలబెట్టిందని తెలిపారు. ఆనాడు మహత్మాగాంధీ వంటి మహనీయులు ఎంతో శ్రమకోర్చి దేశ ప్రజలందరిలోనూ భారతీయ భావనను పాదుకొల్పారని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రపంచ మానవాళిని అత్యధికంగా ప్రభావితం చేసిన గొప్ప నాయకుల్లో మహాత్మా గాంధీ అగ్రగణ్యులని కొనియాడారు. యుద్ధాలతో కొట్టుకుచస్తున్న మానవ జాతికి సత్యాగ్రహం, అహింస అనే పదునైన కొత్త  ఆయుధాలను పరిచయం గాంధీ పరిచయం చేశాడని అన్నారు.

గాంధీజీ చరఖా చేత బట్టి నూలు వడికినా, చీపురు పట్టుకొని మురికి వాడలు శుభ్రం చేసినా, ఉప్పు వండినా, ఉపవాస దీక్ష చేసినా బ్రిటిష్‌ ‌ప్రభుత్వం వణికిపోయిందని, ‘‘ ఈశ్వర్‌ అల్లా తేరే నామ్‌ ‌సబ్‌ ‌కో సన్మతి దే భగవాన్‌’’ అం‌టూ మత సామరస్యం కోసం యావజ్జీవం పోరాడిన గాంధీజీ చివరికి మతోన్మాద శక్తుల చేతుల్లోనే హత్యకు గురికావడం చారిత్రిక విషాదమన్నారు. గాంధీజీ ఒక్క భారతదేశం మీదనే కాదు, యావత్‌ ‌ప్రపంచం మీద గొప్ప ముద్ర వేశారని అన్నారు. మార్టిన్‌ ‌లూథర్‌ ‌కింగ్‌ ‌నుంచి నెల్సన్‌ ‌మండేలా వరకు నల్లజాతి ప్రజల పోరాటాలకు గాంధేయవాదమే ఆదర్శంగా నిలిచిందని, గాంధీని ఎంతగానో ఆరాధించిన నెల్సన్‌ ‌మండేలా గాంధీజీ గురించి గొప్ప విషయాలు చెప్పారని సీఎం అన్నారు. ‘‘నైతికత, నిరాడంబరత, పేదల పట్ల ప్రేమలో మహత్మాగాంధీ యొక్క స్థాయిని నేనెన్నటికీ అందుకోలేకపోయానని, గాంధీ ఏ బలహీనతలు లేని మనిషి. నేను అనేక బలహీనతలున్నవాడిని..’’ అని మండేలా చెప్పుకున్నారని గుర్తు చేశారు.

నేటికీ యావత్‌ ‌ప్రపంచాన్ని గాంధీ సిద్ధాంతం ప్రభావితం చేస్తున్నదని, గాంధీ చూపిన అహింసామార్గంలో స్వాతంత్రోద్యమం విజయతీరం చేరిందని తెలిపారు.   రెండు శతాబ్దాల పరాధీనత నుండి విముక్తి కోసం జరిగిన సమరంలో ఎంతో నెత్తురు ధారపోయాల్సి వొచ్చిందని, ఎందరో ప్రాణాలను బలిపెట్టవలసి వొచ్చిందని అన్నారు. చిరునవ్వుతో ఉరికంబమెక్కిన భగత్‌ ‌సింగ్‌, ‌రాజ్‌ ‌గురు, సుఖ్‌ ‌దేవ్‌ల వంటి అనేకమంది వీరుల త్యాగం భారత జాతి తలపులలో చిరస్మరణీయంగా నిలిచి ఉంటుందని చెప్పారు. ‘‘మీరు నాకు రక్తాన్నివ్వండి, నేను మీకు స్వాతంత్య్రాన్నిస్తాను’’ అని పిలుపునిచ్చి సాయుధ సమరాన్ని నడిపిన సుభాష్‌ ‌చంద్రబోస్‌ ‌వీరత్వం నేటికీ మనందరికీ గొప్ప ప్రేరణనిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు. స్వాతంత్ర సమర ఆశయాల వెలుగులోనే అంబేద్కర్‌ ‌మహాశయుడు భారత రాజ్యాంగాన్ని రూపొందించారని సీఎం తెలిపారు. భారత రాజ్యాంగం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆధునిక విలువలకు  వేదికగా నిలుస్తున్నదని అభిప్రాయపడ్డారు.

ఇక గాంధీ మార్గంలో, రాజ్యాంగ పరిధిలో ఉద్యమించడం వల్లనే తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందని, పోరాటం గమ్యాన్ని ముద్దాడిందని తెలిపారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం అంటే హింసాత్మక ఆందోళన అనే అభిప్రాయం ఉండేదని, టీఆర్‌ఎస్‌ను స్థాపించినపుడు అహింసాయుత ఉద్యమం ద్వారా, రాజ్యాంగ పరిధిలోనే ఉద్యమించి విజయం సాధిస్తామని స్పష్టంగా ప్రకటించానని ఈ సందర్భంగా సిఎం పునరుద్ఘాటించారు. మొదట కొందరు  ఏకీభవించలేదని, కానీ రానురాను అందరూ తాను ఎంచుకున్న మార్గమే సరైనదని అంగీకరించి వెంట నడిచారని తెలిపారు. ప్రాణాన్ని పణంగా పెట్టయినా సరే లక్ష్యాన్ని సాధించాలి తప్ప, అహింసామార్గాన్ని వీడకూడదని నిర్ణయించుకున్నట్లు ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌తెలిపారు. ఆ నేపథ్యంలోంచి వొచ్చిందే ఆమరణ నిరాహార దీక్ష ఆలోచన అని వెల్లడించారు. స్వతంత్ర పోరాట కాలంలో బ్రిటిష్‌ ‌పాలనే బాగుందని అన్న ప్రబుద్ధుల వంటివారు…తెలంగాణ ఉద్యమకాలంలోనూ ఉన్నారని, వారు తెలంగాణ వద్దు..సమైక్య పాలనే ముద్దు అని నిస్సిగ్గుగా ప్రకటిస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని గుర్తు చేశారు.

మన చిత్తశుద్ధి ముందు వాళ్ల ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పారు. విచిత్రం ఏమిటంటే…వాళ్లే ఇవాళ మనకు తెలంగాణ ఉద్యమం గురించి పాఠాలు చెప్పడానికి సిద్ధపడుతున్నారని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఆదర్శవంతమైనది అయినట్టే.. తెలంగాణ పరిపాలన కూడా స్వాతంత్య్ర పోరాట ఆశయాలకు అనుగుణమైనదని సిఎం స్పష్టం చేశారు. స్వతంత్ర భారతంలో ఏనాడూ లేని విధంగా స్వరాష్ట్రంలో  వ్యవసాయ సంక్షోభాన్ని పరిష్కరించామని అన్నారు.   రైతు బంధు వంటి పథకాల ద్వారా రైతన్నల కళ్ళలో వెలుగులు చూస్తున్నామని అన్నారు. గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వయంపోషకత్వం దిశగా ఎంతో దూరం ప్రయాణించామని, గ్రామీణ వృత్తులకు ప్రోత్సాహమివ్వడం వల్ల  గ్రామాలు సుసంపన్నంగా మారాయని వెల్లడించారు. ప్రజలందరికీ మంచినీళ్ళు కూడా ఇంతకాలం ప్రభుత్వాలు ఇవ్వలేదని, కానీ తెలంగాణ రాష్ట్రం ఈ విషయంలో దేశానికి ఆదర్శంగా నిలిచిందని సిఎం కెసిఆర్‌ ‌తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *