- లారీని వేగంగా ఢీకొన్న స్కార్పియో
- ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం
గద్వాల, ప్రజాతంత్ర, జూన్ 1 : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను కర్నూలు దవాఖానకు తరలించారు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి హైదరాబాద్ వొస్తుండగా ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి ఉన్నారని చెప్పారు. అంతా ఒకే కుటుంబానికి చెందినవారని వెల్లడిరచారు.
మృతులను వెంకటేశ్ (కారు డ్రైవర్), భార్య పుష్ప (35), తల్లి లత (55), వెంకటేశ్ చెల్లెలు కుమారుడు ఆదిత్య (6)గా గుర్తించారు. అతివేగం, నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎర్రవల్లి చౌరస్తాలోని పెట్రోల్ పంపు దగ్గర జాతీయ రహదారిపై శనివారం తెల్లవారు జామున అతి వేగంగా వొస్తున్న స్కార్పియో వాహనం లారీని ఢీ కొన్న సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. అలాగే క్షతగాత్రులను సవ్నిప హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు.





