ఖరారు కానున్న 4 కాంగ్రెస్‌ ఎంపి సీట్లు

దిల్లీ చేరుకున్న సీఎం రేవంత్‌, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క
ఖమ్మంపై పలువురి నేతల పట్టు

న్యూదిల్లీ, ఏప్రిల్‌1: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించాల్సిన నాలుగు ఎంపి స్థానాలు కాకరేపుతున్న వేళ సిఎం రేవంత్‌, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్కలు దిల్లీ చేరుకున్నారు. సీట్లపై కాంగ్రెస్‌ అధిష్టనం కసరత్తు చేయనుంది. ఇకపోతే ఖమ్మం సీటులో పోటీ ఎక్కువగా ఉంది. ఇక్కడ మాకు కావల్సిందంటే.. మాకు కావాల్సిందేనంటూ బడా నేతలు పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే సందట్లో సడేమియాలాగా కొత్త వ్యక్తులు రంగంలోకి దిగుతున్నారు. తెలంగాణలో మిగిలిన 4 స్థానాలపై కాంగ్రెస్‌ కసరత్తు నిర్వహిస్తోంది.

కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటి సాయంత్రం భేటీ కానుంది. కరీంనగర్‌, వరంగల్‌, ఖమ్మం, హైదరాబాద్‌ స్థానాల్లో అభ్యర్థులను అధిష్టానం ఖరారు చేయనుంది. ఇప్పటికే మిగతా13 స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్‌ నాయకత్వం ఖరారు చేసింది. ఖమ్మం సీటు కోసం ముగ్గురు మంత్రుల కుటుంబాలు పోటీ పడుతున్నాయి. పోటీ పడుతున్న వారిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి సోదరుడు ప్రసాద్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుటుంబం నుంచి తుమ్మల యుగంధర్‌ ఉన్నారు.

ఈ ముగ్గురిని కాదని కాంగ్రెస్‌ నేత వంకాయలపాటి రాజేందప్రసాద్‌ కొత్తగా తెరపైకి వచ్చారు. మంత్రుల కుటుంబాలను కాదని వంకాయలపాటి రాజేందప్రసాద్‌ కు టికెట్‌ ఇచ్చే అవకాశం ఉంది. వరంగల్‌ స్థానం కోసం జరుగుతున్న సుధీర్ఘ కసరత్తు నిర్వహించనుంది. డి. సాంబయ్య, డా. పరమేశ్వర్‌, సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ సహా పలువురు నేతలు టికెట్‌ ఆశిస్తున్నారు. తాజాగా కడియం శ్రీహరి, ఆయన కుమార్తె కావ్య కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కడియం చేరిక నేపథ్యంలో వరంగల్‌ సీటుపై ఆసక్తి పెరిగింది. మాదిగ వర్గానికి ఈ సీటు ఇవ్వాలని మాదిగ జేఏసీ డిమాండ్‌ చేస్తోంది. కడియం కుటుంబాన్ని మాదిగ వర్గంగా పరిగణించకూడదని విజ్ఞప్తి చేశారు.

కరీంనగర్‌ నుంచి ప్రవీణ్‌ రెడ్డి, సంతోష్‌ కుమార్‌ టికెట్‌ ఆశిస్తున్నారు. తీన్మార్‌ మల్లన్న పేరు తాజాగా తెరపైకి వచ్చింది. హుస్నాబాద్‌ స్థానాన్ని అసెంబ్లీ ఎన్నికల సమయంలో పొన్నం ప్రభాకర్‌ కోసం ప్రవీణ్‌ రెడ్డి వొదులుకున్నారు. ముగ్గురిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతోందన్నది ఆసక్తికరంగా మారింది. అసదుద్దీన్‌ ఓవైసీ పోటీ చేస్తున్న హైదరాబాద్‌ స్థానం కోసం టెన్నిస్‌ స్టార్‌ సానియా ర్జాతో పాటు షానవాజ్‌ తుబసం పేర్లను పరిశీలిస్తున్నారు. పెండిరగ్‌ లో ఉన్న ఈ నాలుగు స్థానాలతో పాటు సికింద్రాబాద్‌ అభ్యర్థి మార్పుపై చర్చించే అవకాశం ఉంది. దానం నాగేందర్‌ పేరును అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది. బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్‌ రాజీనామా చేయలేదు. ఆయనను మార్చే పక్షంలో పరిశీలనలో బొంతు రామ్మోహన్‌ సహా మరికొందరి పేర్లున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *