కౌలు రైతులను ప్రభుత్వం గుర్తించాలి

  • రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ‘బహిరంగ విచారణ’
  • కౌలు రైతుల గుర్తింపుకై 2011 చట్టం అమలు చేయాలని డిమాండ్‌
సంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 10 : తెలంగాణలో కౌలు రైతులకు అత్యంత అన్యాయం జరుగుతున్నదని, వారి సమస్యలు మళ్ళీ ఈ రోజు చాలా బాధతో వినవలసి వొచ్చిందని, ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించడానికి 2011 చట్టం ఉన్నా కూడా దానిని అమలు చేయట్లేదని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు కన్నెగంటి రవి అన్నారు. కౌలు రైతుల సమస్యలపై సోమవారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో ‘ప్రజా వేదిక’ పేరుతో బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ సందర్భంగా రవి  మాట్లాడుతూ..ఆ చట్టం ప్రకారం కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇస్తే, వారికి బ్యాంకు రుణాలు, పంట బీమా, పంట నష్ట పరిహారం మరియు పంట అమ్ముకోవడానికి వెసులుబాటు కలుగుతాయని, కౌలు రైతుల సమస్యలలో చాలా వరకు పరిష్కారం అవుతాయని స్పష్టం చేశారు. దీని కోసం మనందరం పోరాటం చేయాలని ఈ సందర్భంగా రైతులకు ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దాదాపు 70 మంది కౌలు రైతులు వివిధ మండలాల నుండి హాజరయ్యారు.
రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల సమస్యలు వినట్లేదు కాబట్టి వారు తమ సమస్యలను తామే వేదిక పైకి వొచ్చి వివరించే విధంగా ఈ ప్రత్యేకమైన ‘బహిరంగ విచారణ’ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు రైతు స్వరాజ్య వేదిక నాయకులు తెలిపారు. వేదికపై రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులతో బాటు వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాల, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొని, కౌలు రైతులు వివరించిన సమస్యలను విని, వాటిపై స్పందిస్తూ మాట్లాడారు. కార్యక్రమంలో రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు రవి, బి. కొండల్‌ ‌పాల్గొనగా, మహిళా రైతుల హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌. ‌లక్ష్మి అధ్యక్షత వహించగా, మంజీర రైతు సంఘం నాయకులు పృద్విరాజ్‌ ‌రైతులను వరుసగా పిలిచి బహిరంగ విచారణను నడిపించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోతిరెడ్డి పేట చౌరస్తాలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ‌నుండి మాజీ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, టీజెఎస్‌ ‌లక్ష్మి, బీఎస్పీ కృష్ణ,  టీపీటీఎఫ్‌  ‌రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌ ‌కుమార్‌, ‌స్వేచ్చా  జెఏసీ మట్టం వినోద్‌ ‌కుమార్‌,  ‌డీటీఎఫ్‌ ‌సంఘమేశ్వర్‌, ‌దళిత సంఘం నాయకులు ఆనంతయ్య, బొబ్బిలి గ్రామ మాజీ సర్పంచ్‌ ‌గోపాల్‌, ‌రైతు రక్షణ సమితి నుండి రాఘవేంద్ర రెడ్డి పాల్గొన్నారు.
వివిధ మండలాల నుండి   యాదయ్య-అరూర్‌ ‌గ్రామము, గొల్ల వీరయ్య-కొనాపూర్‌ ‌గ్రామం, జలీల్‌-‌మచిరెడ్డి పల్లి గ్రామం, రమేష్‌-అం‌కెనపల్లి గ్రామం, శశిధర్‌ ‌రెడ్డి-పొట్టిపల్లి, విక్రమ్‌-‌బడంపేట సహా 10 మంది కౌలు రైతులు వారి పరిస్థితిని, వారు ఎదుర్కుంటున్న సమస్యలను వివరించారు. కొంత మంది గతంలో గుర్తింపు కార్డ్ ‌పొందిన  కౌలు రైతులు గుర్తింపు కార్డు(ఎల్‌ఈసి) లభించినట్లు, దాని వలన బ్యాంకు నుండి జేఎల్‌జీ గ్రూప్‌గా రుణం వొచ్చినట్లు, దానిని తిరిగి చెల్లించినట్లు చెప్పారు. కార్డు ఉండటం వలన పత్తి పంటను మొదటి సారిగా సిసిఐ కొనుగోలు కేంద్రంలో అమ్మినట్లు చెప్పారు. అయితే గత 10 సంవత్సరాలుగా కౌలు రైతు గుర్తింపు కార్డులు ప్రభుత్వం ఇవ్వలేదు కాబట్టి పంటను దలారులకు తక్కువ ధరకే అమ్ముకొని నష్టాల పాలు అవుతున్నట్లు తెలిపారు. కౌలు రైతుకి రైతుగా గుర్తింపు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదని, దాని వలన కౌలు రైతులు విపరీతమైన సమస్యలు ఎదుర్కుంటున్నట్లు తెలిపారు.
పంట నష్టం జరిగిందని, అయితే పంట నష్ట పరిహారం క్లెయిమ్‌ ‌డబ్బులు భూ యజమానికే పడుతున్నాయని తెలిపారు. ఇంకా కౌలు రైతులు మాట్లాడుతూ..15 సంవత్సరాలుగా ఎకరా  15 వేలు 20 వేలు చెల్లిస్తూ  కౌలు వ్యవసాయం చేస్తున్న రైతులమైన తమకు కనీస గుర్తింపు లేదని, వాస్తవంగా తాము కష్ట పడి నష్ట పోతున్నామని, అప్పుల పాలైన తమకు రాత్రిళ్ళు నిద్ర కూడా పట్టటం లేదని తెలిపారు. కౌలు రైతులైన మేము ప్రభుత్వానికి అన్ని పన్నులు చెల్లిస్తున్నప్పటికీ తమకు ఎందుకు గుర్తింపు లేదని, కనీసం పంట నష్ట పరిహారం కూడా అందటం లేదని , కౌలు రైతులం అందరం కలిసి పోరాడితే మన హక్కులు సాదించుకోవచ్చని తెలిపారు. కొందరు కొనుగోలు  కేంద్రంలో అమ్ముకోవడం కొరకు భూ యజమాని వద్ద పట్టా పాస్‌ ‌పుస్తకం జిరాక్స్ అడిగితే ఇవ్వలేదని తెలిపారు. కొందరు రైతులు తాము 15 ఎకరాలు కౌలుకి తీసుకొని సాగు చేస్తూ ఉన్నామని, తీవ్రమైన పంట నష్టం జరిగినా నష్ట పరిహారం మాత్రం రావటం లేదని తెలిపారు.
తెలంగాణలో 36 శాతం కౌలు రైతులు ఉన్నట్లు తమ అధ్యయనం తెలిపిందని, వారికి న్యాయం చేయడం ప్రభుత్వ కర్తవ్యమని చెబుతూ, ఇప్పటి వరకు వొచ్చిన పోరాటాలు, కోర్టు కేసులు, వత్తిడి వలన 2023 మార్చి నెలలో మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కౌలు రైతులను ప్రస్తావిస్తూ, భారీ వర్షాల వలన నష్టపోయిన రైతులకు ఎకరానికి పది వేలు పంట నష్ట పరిహారం ప్రకటిస్తూ, ఈ మొత్తాన్ని కౌలు రైతుల అక్కౌంట్లలో నేరుగా వేయాలని ఆదేశించారు. కాబట్టి మనం గట్టిగా పోరాటం కొనసాగిస్తే తప్పక కౌలు రైతుల గుర్తింపు సాధించుకోవచ్చని నమ్మకం వ్యక్తం చేశారు. మహిళా రైతుల హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ సభ్యురాలు లక్ష్మి, మంజీరా రైతు సంఘం నాయకులు పృద్విరాజ్‌  ‌సంగెపు బొర్రన్న మాట్లాడుతూ…2011 ఆధీకృత సాగుదారుల చట్టం పటిష్టంగా అమలు చేయాలని, ప్రతి కౌలు రైతుకు గుర్తింపు కార్డు ఇచ్చి, విత్తన సౌలభ్యం మరియు పంట రుణాలు, పంట నష్ట పరిహారం, రైతు బంధు, రైతు బీమాతో అన్ని ప్రభుత్వ సౌకర్యాలు కౌలు రైతులకు వర్తింప చేయాలని  డిమాండ్‌ ‌చేశారు. కౌలు రైతుల హక్కుల సాధన కోసం త్వరలోనే హైదరాబాద్‌లో ప్రముఖుల సమక్షంలో కౌలు రైతులతో భారీ బహిరంగ విచారణ జరిపి వారి బాధలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసే విధంగా చేస్తామని, ఆ బహిరంగ విచారణకు ప్రతి జిల్లా నుండి కౌలు రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని నిర్వాహకులు కోరారు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *