కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో కేసీఆర్‌ ‌పూజలు

  • నామినేషన్‌ ‌పత్రాలకు ప్రత్యేక పూజలు…ఆలయంలోనే సంతకాలు చేసిన కేసీఆర్‌
  • 9‌న గజ్వేల్‌, ‌కామారెడ్డిలో నామినేషన్‌ ‌దాఖలు చేయనున్న కేసీఆర్‌
  • ‌మంత్రి హరీష్‌రావు నామినేషన్‌ ‌పత్రాలకూ ప్రత్యేక పూజలు
  • 9ననే సిద్ధిపేటలో నామినేషన్‌ ‌దాఖలు చేయనున్న హరీష్‌రావు

సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 4: ‌ముఖ్యమంత్రి కల్వకుంట్ల, బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఎప్పటిలాగనే తన సెంటిమెంట్‌(ఇష్ట దైవం) దేవాలయమైన సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలోని కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామిని  దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గజ్వేల్‌, ‌కామారెడ్డిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వేయనున్న నామినేషన్లను కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి పాదాల ముందు ఉంచి  ప్రత్యేక పూజలు  చేయించారు. ప్రత్యేక పూజల అనంతరం సిఎం కేసీఆర్‌ ఆలయంలోనే నామినేషన్ల పత్రాలపై సంతకాలు చేశారు. శనివారం మధ్యాహ్నం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి రోడ్డు మార్గాన చేరుకున్న సిఎం కేసీఆర్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, అర్చకులు, స్థానిక బిఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు స్వాగతం పలికారు.

1985లో సిఎం కేసీఆర్‌ ‌సిద్ధిపేట నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మొదలుకుని ప్రతీ ఎన్నికల సమయంలోనూ  కోనాయిపల్లి గ్రామంలో ఉన్న వేంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్‌ ‌పత్రాలకి పూజ చేయించడం కేసీఆర్‌కు  ఆనవాయితీ. గత 38 ఏళ్లుగా కేసీఆర్‌ ‌కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేస్తున్నారు.  ఇప్పుడూ అదే ఆనవాయితీని కొనసాగించారు. నామినేషన్ల స్వీకరణ మొదలైన నేపథ్యంలో సిఎం కేసీఆర్‌ ‌కూడా నామినేషన్ల సమర్పణకు ఇప్పటికే తేదీని నిర్ణయించుకున్నారు. సిఎం కేసీఆర్‌ ఈ ‌నెల 9న గజ్వేల్‌, ‌కామారెడ్డి రెండు చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్‌ ‌వేయనున్నారు.

మంత్రి హరీష్‌రావు కూడా ఎప్పటిలాగనే…
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, సిద్ధిపేట బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తన్నీరు హరీష్‌రావు కూడా ఎప్పటిలాగనే సిద్ధిపేటలోని భారత్‌నగర్‌లో తన సొంతింట్లో పూజలు చేసి.. కాస్సేపు కూర్చొని కోనాయిపల్లికి వెళ్లి సిఎం కేసీఆర్‌తో కలిసి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆనవాయితీ ప్రకారం మంత్రి హరీష్‌రావు కూడా నామినేషన్‌ ‌పత్రాలను  స్వామివారి పాదాల ముందు పెట్టి పూజలు చేయించారు. మంత్రి హరీష్‌రావు కూడా ఈ నెల 9న సిద్ధిపేటలో నామినేషన్‌ ‌వేయనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *