మహేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 1: కోట్లు పెట్టి టికెట్లు కొన్నవారిని కాదు.. నిత్యం ప్రజలలో ఉంటూ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం నిస్వార్థంగా కష్టపడి పనిచేస్తున్న సబితమ్మకు పెద్ద ఎత్తున ఓట్లు వేసి, భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని మంత్రి తన్నీరు హరీష్ రావు పిలుపు నిచ్చారు. కోట్లు పెట్టి టికెట్లు కొన్నవారు, రేపు తెలంగాణను అమ్మరన్న గ్యారెంటీ ఏముందన్నారు. అలాంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గం పర్యటనలో భాగంగా.. మంత్రి తన్నీరు హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై, మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తో కలిసి, జల్ పల్లి మున్సిపాలిటి పరిధిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో కుల సంఘాల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని, నూతనంగా నిర్మించనున్న 16 కమ్యూనిటి భవనాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. శ్రీ రాంనగర్ కాలనీ అంటే మినీ ఇండియాగా గుర్తింపు పొందిందన్నారు. ఇక్కడ అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారన్నారు. అన్ని సామాజిక వర్గాలను గౌరవిస్తూ ఆత్మగౌరవ భవనాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. ఈ ప్రాంతంలో ఉపాధి పొందుతున్న వారు మీరు మీ సొంత రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రగతి, అభివృద్ధిని పోల్చి ఒకసారి చూడాలన్నారు. మహారాష్ట్ర లాంటి ప్రాంతాల్లో వారానికి ఒకరోజు కూడా మంచినీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లాలు పెట్టి మంచి నీళ్లు అందిస్తున్నామన్నారు.
మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పేదింటి ఆడపిల్లల పెళ్ళికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకం ఉదా అని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్ కానీ, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసిఆర్ కిట్టు వంటి గొప్ప పథకాలు లేవన్నారు.
కోట్లు పెట్టి టికెట్ కొనుక్కునే వాళ్ళను కాదు. ప్రజాసేవ చేసే నాయకులను మనం గెలిపించుకోవాలన్నారు. సీనియర్ మంత్రి అయిన సబితా ఇంద్రారెడ్డి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. అలాంటి మంచి వారికి ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించుకోవాలని సూచించారు. జల్ పల్లి మున్సిపాలిటీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో ఏనలేని అభివృద్ధి జరిగిందన్నారు. జల్ పల్లి అభివృద్ధికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి వందల కోట్లు ప్రత్యేక నిధులు తీసుకువచ్చినట్లు గుర్తు చేశారు. కోట్లు పెట్టి టికెట్ కొనుక్కున్న నాయకులు రేపు తెలంగాణను కూడా అమ్ముతారాని, అలాంటి వారిని నమ్మకూడదన్నారు. తెలంగాణలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందన్నారు. విద్యుత్ వినియోగం భారీగా పెరిగిందన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత వైద్య విద్య, వైద్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చాయన్నారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం బిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేయాలని ఇతర రాష్ట్రాల ప్రజలు వారి ప్రభుత్వాలను నిలదీస్తున్నరన్నారు. ప్రధాన మంత్రి మోడీ తెలంగాణకు ఏం చేశారని వస్తున్నారని నిలదీశారు. తెలంగాణకు అన్యాయం చేసిన పార్టీ బిజెపి అని అన్నారు. తెలంగాణకు హక్కుగా రావాల్సిన నిధులను ఆపి అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం బీజేపీ చేస్తుందని ఆరోపించారు. మాయమాటలు చెప్పేవారని కాకుండా ఎవరైతే మీకోసం పని చేస్తున్నారో వారికే ఓటు వేసి గెలిపించాలన్నారు. త్వరలో శ్రీరామ్ నగర్ లో యూపీహెచ్సీ నిర్మాణం, అదే విధంగా జల్ పల్లీ మున్సిపాలిటీకి 30 పడకల హాస్పిటల్ మంజూరు చేస్తానని హరీష్ రావు హామీ ఇచ్చారు.
వైద్యంలో బిఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద వేసిందని, పల్లె దవాఖనలు, బస్తీ దవాఖానలు, మెడికల్ కాలేజ్ లు , హైదరాబాదులో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణాలతో పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా వైద్య సౌకర్యాలు పెంచుకుంటు పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి రంజిత్ రెడ్డి, జెడ్పీ చైర్ పర్సన్ అనిత రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి పట్లోళ కార్తిక్ రెడ్డి, కమిషనర్ వసంత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రజినీ సాయి చంద్, యూసుఫ్ పటేల్, పలువురు బిఅర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కోట్లు పెట్టి టికెట్లు కొనేవారిని కాదు.. ప్రజలకు సేవ చేసేవారిని గెలిపించుకోవాలి: మంత్రి తన్నీరు హరీష్ రావు





