పటాన్ చెరు,ప్రజాతంత్ర, ఆగస్ట్ 11: జిహెచ్ఎంసి పరిధిలోని డివిజన్ల అభివృద్ధికి కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేస్తూ, మౌలిక వసతుల కల్పనలో ఆదర్శంగా నిలుస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.పటాన్ చెరు డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీ, శ్రీరామ్ నగర్ కాలనీ, శాంతినగర్ కాలనీలలో కోటి రూపాయల అంచనా వ్యయంతో చేపట్టనున్న సిసి రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… జిహెచ్ఎంసి పరిధిలోని పటాన్ చెరు, రామచంద్రాపురం, భారతీ నగర్, డివిజన్ల పరిధిలో సిసి రోడ్ల నిర్మాణ పనులకు ప్రభుత్వం ఇటీవల 22 కోట్ల రూపాయల నిధులు కేటాయించడం జరిగిందని తెలిపారు. వీటి ద్వారా ప్రతి కాలనీలో నూతన సీసీ రోడ్ల నిర్మాణంతోపాటు వివిధ అభివృద్ధి పనులను చేపడుతున్నామని పేర్కొన్నారు. వీటితోపాటు ప్రతి వార్డులో ఓపెన్ జిమ్, పార్కులు, వాకింగ్ ట్రాక్ ల నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, జిహెచ్ఎంసి డిప్యూటీ కమిషనర్ సురేష్, సీనియర్ నాయకులు గూడెం మధుసూదన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అఫ్జల్, బీఆర్ఎస్ ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు కొమరగూడెం వెంకటేష్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




