- హైకోర్టు తీర్పు…రెండవ స్థానంలో ఉన్న జలగంను ఎమ్మెల్యేగా పరిగణన
- అనర్హత వేటుతోపాటు రూ.5 లక్షలు జరిమానా
- అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చాడన్న హైకోర్టు
హైదరాబాద్, జూలై 25(ఆర్ఎన్ఎ) : కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావుకు తెలంగాణ హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఎన్నికల్లో తప్పుడు అఫిడవిట్ ఇచ్చారని ఆయన సమీప అభ్యర్థి జలగం వెంకట్రావు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ జరిపిన కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్యే వనమాపై ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేసిన కోర్టు రూ.5 లక్షలు జరిమానా విధించింది. అంతేకాదు 2018 డిసెంబర్ 12 నుంచి జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. కాగా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వనమా వెంకటేశ్వర్ రావు పోటీ చేయగా..బీఆర్ఎస్ తరపున జలగం వెంకట్రావు బరిలో నిలిచారు. ఈ పోటీలో వనమా వెంకటేశ్వర్ రావు 4,139 వోట్లతో గెలుపొందగా ఆ తరువాత ఆయన బీఆర్ఎస్లో చేరారు. అయితే వనమా తన ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చారని జలగం వెంకట్రావు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
దీనిపై విచారణ జరగగా కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నేడు ఆ తీర్పును వెలువరించిన కోర్టు వనమా ఎన్నిక చెల్లదని తేల్చేసింది. తప్పుడు సమాచారం ఇచ్చినందుకు రూ.5 లక్షల జరిమానా విధించారు. ఇదే సమయంలో జలగం వెంకట్రావునే కొత్తగూడెం ఎమ్మెల్యేగా పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఇక అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు గాను 5 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా వనమాపై హైకోర్టు నిషేధం విధించింది. కోర్టు నిర్ణయంతో వనమాకు ఊహించని షాక్ తగిలింది. అయితే హైకోర్టు తీర్పును వనమా సుప్రీమ్ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది. మంగళవారం హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో నెలరోజుల లోపు సుప్రీమ్ కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంటుంది.
ఎన్నికలు మరికొన్ని నెలల్లో ఉండగా హైకోర్టు తీర్పుతో వనమా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది. కాగా గత ఎన్నికల సమయంలో వనమా దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్ లో భూములు, తన ఇంటికి సంబంధించిన వివరాలపై తప్పుడు సమాచారం ఇచ్చారని..దీనిపై కోర్టులో పిటీషన్ వేసినట్టు జలగం వెంకట్రావు తరపు లాయర్ చెప్పుకొచ్చారు. వివరాలు అఫిడవిట్లో పొందుపరచకున్న తప్పుడు సమాచారం ఇచ్చినట్టు అవుతుందనే విషయాన్ని తాము కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్టు తెలిపారు. అయితే దీనిపై వనమా సుప్రీమ్ కోర్టుకు వెళ్తే తాము ఇక్కడి లాగే వాదనలు వినిపించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అంతేకాదు వనమాకు జైలు శిక్ష వేయాలని కోర్టును కూడా కోరనున్నట్టు జలగం వెంకట్రావు తరపు న్యాయవాది తెలిపారు.




