- నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం
- ఉమ్మడి నిజామాబాద్‌లో 4 కొత్త మండలాలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : తెలంగాణలో కొత్తగా 13 మండలాలు ఏర్పాటు అయ్యాయి. ప్రజల ఆకాంక్ష, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి, పరిపాలనా సంస్కరణల్లో భాగంగా మరికొన్ని మండలాలను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. కేసీఆర్ ఆదేశాల మేరకు పలు జిల్లాల్లో కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు కొత్త మండలాలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయా జిల్లాల కలెక్టర్లకు పంపారు. ప్రజా ఆకాంక్షలు, స్థానిక ప్రజా అవసరాలను పరిశీలించి మరికొన్ని మండలాలు ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.
వివిధ జిల్లాల్లో నూతన మండలాల ఏర్పాటుకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఉమ్మడి నిజామాబాద్‌లో కొత్తగా నాలుగు మండలాలు ఏర్పాటు కానున్నాయి. నారాయణపేట జిల్లాలో గుండుమల్, కొత్తప్లలె మండలాలు ఏర్పాటు కానున్నాయి. వికారాబాద్ జిల్లాలోని తాండూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో దుడ్యాల్ మండలం కానుంది. మహబూబ్‌నగర్ జిల్లాలో కౌకుంట్ల మండలం ఏర్పాటు కానుంది. నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఆలూర్, డొంకేశ్వర్ కొత్త మండలాలు కానున్నాయి. జిల్లాలోని బోధన్ రెవెన్యూ డివిజన్ పరిధిలో సాలూర మండలం ఏర్పాటు కానుంది.
మహబూబాబాద్ జిల్లాలో సీరోల్, నల్గొండ జిల్లాలో గట్టుప్పల్ మండలాలు కొలువు తీరనున్నాయి. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ రెవెన్యూ డివిజన్ పరిధిలో నిజాంపేట్ మండలంగా మారనుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ రెవెన్యూ డివిజన్ పరిధిలో డోంగ్లి మండలం ఏర్పాటు కానుంది. జగిత్యాల జిల్లాలో జగిత్యాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎండపల్లి, కోరుట్ల డివిజన్ పరిధిలో భీమారం మండలాలు ఏర్పాటు కానున్నాయి.
అభ్యంతరాలకు 15 రోజులు కొత్త మండలాల ఏర్పాటుకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటిపై 15 రోజుల్లోగా అభ్యంతరాలు, వినతులను సంబంధిత జిల్లాల కలెక్టర్లకు అందించాల్సి ఉంటుంది. వాటన్నింటినీ పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ జారీ చేయనుంది.




