కేంద్రక శక్తిని ఒడిసి పట్టడంలో విజయం సాధించిన యూయస్‌ ‌శాస్త్రజ్ఞులు

తాజాగా విడుదలైన ‘యూయస్‌ ‌లారెన్స్ ‌లివర్‌మోర్‌ ‌లాబొరేటరీ, కాలిఫోర్నియా’ శాస్త్రజ్ఞుల ప్రయోగ ఫలితాల ఆధారంగా

కేంద్రక సంలీన శక్తిని ఒడిసి పట్టి సుస్థిరాభివృద్ధి దిశగా వినియోగించుకోవడానికి ‘క్లీన్‌ ఎవర్జీ’గా మార్చే ప్రయోగాలు సఫలం అయ్యాయని కాలిఫోర్నియాలోని ‘యూయస్‌ ‌నేషనల్‌ ‌లాబొరేటరీ’ పరిశోధక బృందం ఇటీవల వెల్లడించడం ఓ ప్రధాన వార్తగా ప్రపంచ శాస్త్ర సమాజంతో పాటు విశ్వ మానవాళి అభిప్రాయ పడుతున్నది. సాన్‌‌ఫ్రాన్సిస్కో సమీపాన ‘లారెన్స్ ‌లివర్‌మోర్‌ ‌నేషనల్‌ ‌లాబొరేటరీ’ శాస్త్రజ్ఞులు చేసిన ప్రయోగాల్లో తొలిసారి కేంద్రక సంలీన (న్యూక్లియర్‌ ‌ఫ్యూజన్‌) ‌ప్రక్రియ ద్వారా పర్యావరణహిత క్లీన్‌ ఎనర్జీని ఉత్పత్తి చేయడంలో కృతకృత్యులయ్యారని తెలుస్తున్నది. కేంద్రక సంలీనంలో విడుదలైన క్లీన్‌ ఎనర్జీని మానవాళి సంక్షేమానికి వాడుకోవడానికి, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న శక్తి లోటును అధిగమించడానికి ఈ ప్రయోగ ఫలితాలు ఎంతగానో ఉపకరిస్తాయనడంలో సందేహం లేదు. గత 6 దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కేంద్రక శక్తి ప్రయోగ ఫలితాల ద్వారా వాణిజ్య స్థాయిలో శక్తిని ఉత్పత్తి చేయడానికి రానున్న రోజుల్లో మార్గం సుగమం అయ్యింది. కేంద్రక సంలీన ప్రక్రియలో ఎలాంటి కార్బన్‌ ఉద్గారాలు, రేడియోధార్మిక అవశేషాలు విడుదల కావని, అందువల్లనే పర్యావరణహిత ‘క్లీన్‌ ఎనర్జీ’ విడుదల అవుతున్నదనే విషయాలను వివరిస్తున్నారు. ఈ ప్రయోగ ఫలితాలు వాణిజ్య రూపం దాల్చితే ప్రపంచ మానవాళికి శక్తి కొరత సమస్య శాశ్వతంగా పరిష్కరించబడుతుందని సంతోషపడాలి.
కేంద్రక సంలీన ప్రక్రియల ద్వారా క్లీన్‌ ఎనర్జీ విడుదల :
తక్కువ పరమాణు సంఖ్య కలిగిన (హైడ్రోజన్‌ ‌లాంటి) రెండు పరమాణు కేంద్రకాలను ఏకం చేస్తూ మరో నూతన (హీలియం లాంటి) పెద్ద కేంద్రకం ఏర్పాటు చేసే క్రమంలో అపార శక్తి విడుదల కావడాన్ని కేంద్రక సంలీనం లేదా న్యూక్లియర్‌ ‌ఫ్యూజన్‌ అం‌టారు. రెండు కేంద్రకాలు సంలీనం చెందుతూ మరో పెద్ద కేంద్రకం ఏర్పడే క్రమంలో కొంత ద్రవ్యరాశి మాయమైన శక్తిగా (నెట్‌ ఎనర్జీ గేయిన్‌) ‌మారడం జరుగుతుందని అర్థం చేసుకోవాలి. హైడ్రోజన్‌ ‌బాంబ్‌ (‌హెచ్‌ – ‌బాంబ్‌) ‌తయారీలో కేంద్రక సంలీన ప్రక్రియ వినియోగపడుతున్నది. ఒక అధిక పరమాణు సంఖ్య (యురేనియం లాంటి) కలిగిన భారీ కేంద్రకాన్ని రెండు చిన్న కేంద్రకాలుగా విచ్ఛిన్నం చేసినపుడు కూడా అపారమైన శక్తి విడుదల అవుతుంది. ఈ ప్రక్రియనే ‘ఆటమ్‌ ‌బాంబ్‌’ ‌తయారీలో వాడుతూ ‘కేంద్రక విచ్ఛిత్తి’ పేరుతో వ్యవహరిస్తూ ఉంటారు.
ద్రవ్యరాశి శక్తి తుల్యత నియమం ప్రకారం ద్రవ్యరాశిని శక్తిగా మార్చవచ్చని, కేంద్రక సంలీన లేదా విచ్ఛిన్న ప్రక్రియలు జరగడానికి అత్యధిక పీడనంతో పాటు 100 మిలియన్‌ ‌డిగ్రీల సెల్సియస్‌ (180 ‌మిలియన్‌ ‌ఫారన్‌హీట్‌) ఉష్ణోగ్రతలు వినియోగించాల్సి ఉండడమనే అవరోధంతో పాటు ఆ శక్తిని అదుపు చేస్తూ మానవాళి శ్రేయస్సుకు వాడడంలో పలు అవాంతరాలు దశాబ్దాలుగా ఎదురవుతూ వస్తున్న వేళ నేటి ప్రయోగ ఫలితాలు ఓ మహత్తర శక్తి ఉత్పత్తి మార్గాన్ని చూపించడం హర్షదాయకం. కేంద్రక సంలీనంలో అపారమైన శక్తి విడుదల అవడమే కాకుండా ఎలాంటి పర్యావరణ హాని కలిగించే ఎలాంటి పదార్థాలు ఏర్పడని కారణంగా నేటి ప్రయోగ ఫలితాలు గ్రీన్‌/‌క్లీన్‌ ఎనర్జీ ఉత్పత్తికి దోహదపడనున్నాయి. కేంద్రక సంలీన ప్రక్రియ సాకారం కావడానికి వినియోగించే శక్తి (ఇజ్నిషన్‌ ఎనర్జీ) కన్న విడుదలయ్యే శక్తి అనేక రెట్లు అధికంగా ఉండడంతో మానవాళి శక్తి (నికర శక్తి లాభం, నెట్ట ఎనర్జీ గేయిన్‌) అవసరాలు తీరనున్నట్లు వివరిస్తున్నారు. సూర్యుడు, నక్షత్రాల ఉపరితలం మీద జరుగుతున్న కేంద్రక సంలీన ప్రక్రియ కారణంగానే అపార శక్తి సౌర శక్తి విడుదల కావడం జరుగుతున్నదని మనకు తెలుసు.
కేంద్రక సంలీన ప్రక్రియ ఫలితాలు సామాన్యుల దరికి చేరడానికి, వాణిజ్యపర వినియోగ స్థాయికి చేరడానికి మరికొంత సమయం పట్టవచ్చు. అయినప్పటికీ రానున్న రోజుల్లో న్యూక్లియర్‌ ఎనర్జీని  పరిమితులే లేని క్లీన్‌ ఎనర్జీ (లిమిట్‌లెస్‌ ‌క్లీన్‌ ఎనర్జీ) రూపంలో ఉత్పత్తి చేస్తూ, శక్తి అవసరాలకు వాడుకోవడానికి మార్గం సుగమం కావడం నేటి మానవాళికి ఊరటను కలిగిస్తున్నది.
image.png
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి కరీంనగర్‌ – 9949700037

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *