రాహుల్ గాంధీకి ప్రధాని అయ్యే చాన్స్ లేదు
రాష్ట్రంలో కెసిఆర్ కుటుంబ పాలన అంతమైంది
మజ్లిస్ అభ్యర్థిని గట్టిగా ఢీ కొంటాం
మహేశ్వరం గావ్ చలో అభియాన్‌లో కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి
మహేశ్వరం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 06 : దేశంలో అవినీతిలేని, అంకిత భావంతో పాలన జనరంజకంగా సాగుతుందని, రాబోయే ఎన్నికల్లో మూడవ సారి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వొస్తుందని, కేంద్ర పర్యాటక శాఖమంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు. జి. కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన బిజెపి గావ్ చలో అభియాన్ పేరిట మంగళవారం మహేశ్వరం మండలం అమీర్ పేట్ గ్రామంలో చేపట్టిన కార్తక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం, డ్వాక్రా మహిళలతో జరిగిన ముఖాముఖీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…దేశంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం నరేంద్ర మోదీ వైపు ఉన్నారని, రాహుల్ గాంధీ అసలు పాటీలోనే లేరని అన్నారు.
తెలంగాణలో ఆరు గారెంటీల పేరుతో కాంగ్రెస్ గారడీ చేస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు పదవుల కోసం డబ్బుల సూట్‌కేసులు దిల్లీకి పంపుతున్నారని, కాంగ్రెస్, బిఆర్‌ఎస్ కోట్లు పంచినా మోదీ గెలుపు ఆపలేరని అన్నారు. బిఆర్‌ఎస్ అవసరం తెలంగాణకు లేదని, టిఆర్‌ఎస్ పార్టీ బిఆర్‌ఎస్‌గా మారినపుడే ఆ పార్టీ పని అయిపోయిందని, కెసిఆర్ కుటుంబ పాలన అంతమైందన్నారు. ముస్లిం మహిళల హక్కులను పునరుద్ధరించి వారికి రక్షణ కల్పించిన నరేంద్ర మోదీకి ముస్లిం మహిళలు అండగా ఉన్నారని, హైదరాబాద్‌లో మజీస్ అభ్యర్థి ఓవైసేని గట్టిగా ఢీకొంటామని, తెలంగాణలో మెజార్టీ పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటామని స్పష్టం చేశారు. తొమ్మిదిన్నర ఏళ్ల మోదీ పాలనలో రాష్ట్రంలో ఐదువేల కిమీ జాతీయ రహదారులను విస్తరించామని, 32 జిల్లా కేంద్రాలను జాతీయ రహదారులతో అనుసంధానం చేసిన ఘనత అంతా కేంద్ర ప్రభుత్వానికే దక్కిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పేదల సంక్షేమం, మహిళా సాధికారత, శాంతి భద్రతలతో పాటు ప్రపంచ దేశాల్లో భారతదేశ గౌరవాన్ని పెంచిన మోదీ ప్రభుత్వం కోసం బూత్ స్థాయి కార్యకర్తలు శక్తి వంచన లేకుండా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు బి పాపయ్య, బొక్క నర్సింహారెడ్డి, మిద్దె సుదర్శన్ రెడ్డి, అనంతయ్య గౌడ్, పోతర్ల సుదర్శన్ యాదవ్, యాదయ్య గౌడ్‌తో పాటు బిజెపి నాయకులు పాల్గొన్నారు.




