- ప్రస్తుతం సమస్యల వలయంలో విలవిల
- ప్రజల్లో విశ్వాసం కోల్పోయి నైతికంగా దెబ్బతిన్న వైనం
- అంతా స్వయంకృతాపరాధమే
(వి. రామ్మోహన్ రావు, ప్రజాతంత్ర): కెసిఆర్…ఈ మూడక్షరాల పేరు వింటేనే ఒకప్పుడు ప్రజల్లో చైతన్యం కలిగించేది. ఆయన పిలుపు నివ్వడమే ఆలస్యం వేలాదిగా జనం తరలి వొచ్చేవారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో విడదీ యలేనంతగా ముడిపడి ఉన్న వ్యక్తి. ఆ సమయంలో తెలంగాణ అంటేనే కెసిఆర్‌కా ఇలాకా అని దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి. తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ భాషలలో మంచి పట్టు కలిగి అనర్గళంగా మాట్లాడగలిగిన మంచి వక్త. అందుకే ఆయనను మాటల మరాఠీగా ఉదహరిస్తారు. మేధావి. విద్యావంతుడు. తన వద్దకు వొచ్చిన ఎంతటి వారినైనా తన వాక్చాతుర్యంతో ఇట్టే తన పైపు తిప్పుకోగలిగిన నేర్పరి . రాష్ట్ర సాధనలో భాగంగా దేశవ్యాప్తంగా ఎందరో నాయకులను కలిసి వ్యతిరేకంగా ఉన్నవారిని తెలంగాణకు అనుకూలంగా మాట్లాడేటట్టు చేసిన రాజకీయ చతురత ఆయనది. 2001లో టిఆర్ఎస్ పార్టీని స్థాపించి ఎన్నో అవమానాలను, చీత్కారాలను, ఉత్తాన పతనాలను, దూషణలను, భూషణలను చవి చూసిన వ్యక్తి. రాజకీయంలో భాగంగానైనా ఎక్కడా ఎదురు, బెదురు లేకుండా లక్ష్య సాధనలో అందరినీ ఒక్క తాటి పైకి తెచ్చి గమ్యాన్ని ముద్దాడిన వ్యక్తి. తెలంగాణ చరిత్ర పుస్తకంలో తనవంటూ కొన్ని పేజీలు సృష్టించుకుని శాశ్వతంగా నిలిచి పోయిన వ్యక్తి.
రాష్ట్ర అవతరణ అనంతరం ఏకచ్ఛాధిపత్యంగా పది సంవత్సరాలు రాష్ట్రాన్ని ఏలి అహంకారిగా, నియంతగా పేరు తెచ్చుకున్న వ్యక్తి. ఇక ప్రస్తుతం కెసిఆర్, ఆయన కుటుంబం, ఆయన పార్టీ సమస్యల సుడిగుండంలో చిక్కుకుని బయటకు రాలేక కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. గట్టి పునాది కూడా నిర్మించుకోకుండా పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించి కేంద్రంలో చక్రం తిప్పుదామనుకున్న ఆయన ఆశయం నెరవేరలేదు. దేశ వ్యాప్తంగా విస్తరించడమటుంచి రాష్ట్రంలో ఉన్న అధికారం కోల్పోయారు. తానేది చెప్పినా..చేసినా ప్రజలు అంగీకరిస్తారనే అతి విశ్వాసంతో గత అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలయ్యారు. స్వతహాగా రెండు చోట్ల పోటీ చేసిన కెసిఆర్‌ను కూడా ఒక చోట ఓడిరచి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారు. ఇదంతా ఆయన స్వయంకృతాపరాధం. ఆయన తన అహంకార ధోరణితో, ఎవరినీ లెక్క చేయని తల బిరుసు తనంతో, తాను చెప్పిందే వేదమనే విధంగా తానేది చెప్పినా ప్రజలు గుడ్డిగా నమ్ముతారనే పెడ ధోరణితో ఆయన పదేళ్ల పాలనలో క్రమంగా ప్రజలకు దూరమయ్యారు. ఎవరినైనా మాటలతో ఒకసారి మోసం చేయవొచ్చు..నాలుగు సార్లు మోసం చేయవొచ్చు..కానీ అన్ని వేళలా మోసం చేయలేమనే విషయం కెసిఆర్‌కు తెలియనిది కాదు. కానీ అధికార మత్తులో కెసిఆర్‌కు ఆవేమి మదికి రాలేదేమో..!
కెసిఆర్ తన మొదటి అయిదు సంవత్సరాల పాలనలో ప్రజల్లో కొద్దో గొప్పో విశ్వాసం పొందగలిగారు. ప్రజల్లో అనేక ఆశలు కల్పించి వారికి రంగుల ప్రపంచం చూపించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణ విడివడితే రాష్ట్రం తీవ్ర విద్యుత్ సమస్య ఎదుర్కుంటుందని, అంధకారం అవుతుందని సీమాంధ్ర పాలకులు ఉద్యమం సందర్భంగా చేసిన వాఖ్యలను కెసిఆర్ రాజకీయంగా చక్కగా వాడుకున్నారు. రాష్ట్రం ఏర్పాటైన కొద్ది కాలంలోనే కోతలు లేకుండా ఏ విధంగా అయితేనేమి 24 గంటలు నిరంతరంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసి పారిశ్రామిక వేత్తల, కార్మికుల, రైతుల, ప్రజల మన్ననలు పొంద గలిగారు. ఇక 24 గంటలు తాగు నీరు సరఫరాకు మిషన్ భగీరథ, వ్యవసాయ రంగానికి సంబంధించి చిన్న నీటి పారుదల రంగానికి సంబంధించి మిషన్ భగీరథ, భారీ నీటి పారుదలకు ప్రపంచంలోనే అతి లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టుగా పేర్కొంటూ కాళేశ్వరం ప్రాజెక్టు, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, హరిత హారం , రైతు బంధు ఇలా అనేక కొత్త కొత్త పథకాలతో ప్రజలలో అనేక ఆశలు కల్పించారు.
రాష్ట్ర బడ్జెట్‌కు మించి పథకాలతో పరిమితికి మించి అప్పులు చేయడం వంటి చర్యల వల్ల ప్రజల్లో క్రమంగా భ్రమలు తొలగిపోవడం మొదలయింది. అలా మూడవ సారి ఎన్నికలకు పోయే నాటికి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొనడంతో పరాజయం పాలయ్యే పరిస్థితి ఏర్పడిరది. దాంతో అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలయినా 39 సీట్లు గెలుచుకుని కనీసం గట్టి ప్రతిపక్షంగానైనా నిలబడగలిగింది. కానీ పార్లమెంటు ఎన్నికలకు వొచ్చే సరికి 17 సీట్లలో కనీసం ఒక్క సీటు గెలువలేక పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారిన దుస్థితి ఏర్పడిరది. కెసిఆర్ తన మేధస్సును రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసం వినియోగిస్తే ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉండేది. కానీ అది తప్పు దోవలో వినియోగించి ప్రజల హృదయంలో ఉన్న స్థానం కోల్పోయిన పరిస్థితి నెలకొంది.
ఇప్పుడు కెసిఆర్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయి నైతింకంగా దెబ్బతిన్నారు. అదే విధంగా పార్టీని కాపాడుకోవడమే ఇప్పుడు ఒక పెద్ద సవాల్‌గా మారింది. ఇదే సమయంలో అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పుడు వ్యవహారరాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇప్పటికే దిల్లీ లిక్కర్ స్కామ్‌లో పీకల్లోతు కూరుకుని కూతురు కవిత తీహార్ జైలులో ఉన్నారు. మరో వైపు కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, విద్యుత్ ఒప్పందాలు, గొర్రరెల స్కీమ్, వంటి వాటిలో తీవ్ర స్థాయిలో అవినీతి ఉందని ఆరోపిస్తూ విచారణను చేపట్టి కమిషన్లు వేయడం, మరోవైపు గొర్రెల పంపిణీ స్కీమ్‌కు సంబంధించి ఈడీ ప్రవేశించి వివరాలు సేకరించడం వంటివి ఒక్కొక్కటిగా మెడకు చుట్టుకుంటుండడంతో కెసిఆర్ ఊక్కిరి బిక్కిరి అవుతున్నారు. వీటన్నిటినీ ఏ అంతా ఉత్తదే..అని ఇదివరకటిలా కొట్టి పారేయడానికి లేకుండా పక్కా సాక్షాధారాలు ఒక్కొక్కటిగా బహిర్గతమవుతున్నాయి.
ప్రజలు కూడా ఇదివరకటిలా కెసిఆర్ చెప్పిందల్లా నమ్మి వెంట నడిచే పరిస్థితి లేదు. ఇక సొంత రాష్ట్రంలోనే ఓడిపోయిన కెసిఆర్‌కు జాతీయ స్థాయిలో కూడా ఖచ్చితంగా ఆదరణ లభించదు. ఏది ఏమైనా అధికారం, పదవులు శాశ్వతం కాదని, ఎల్ల వేళలా తమ మాటే చెల్లుబాటవుతుందని అనుకోవడం సరికాదని మరోసారి రుజువయింది. అన్నీ తెలిసిన కెసిఆర్ కూడా అదే పంథాలో నడిచి రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తినడం ఆశ్చర్యకర విషయమే. అంతా ఆయన స్వయంకృతాపరాధమే. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఎమర్జెన్సీ విధించి అంత వ్యతిరేకతను కూడగట్టుకున్న ఇందిరా గాంధీ కూడా పడి లేచిన కెరటంలా రెట్టింపు ఉత్సాహంతో తిరిగి రాణించిన విధంగా కెసిఆర్ కూడా తన తప్పులను సరిదిద్దుకుని తిరిగి రాణించడం సాధ్యం కాని విషయమేమీ కాదు. పాలిటిక్స్ ఆర్ డైనమిక్స్…ఏదేనా జరుగవొచ్చు.





