హైదరాబాద్, పిఐబి, డిసెంబర్ 21 : కుదంకుళం అణు విద్యుత్ ప్లాంట్‌కు మరింత అధునాతన ఇంధన ప్రత్యామ్నాయాన్ని రష్యా ప్రభుత్వ యాజమాన్యంలోని అణు ఇంధన కార్పొరేషన్ రోసాటామ్ ఇచ్చేందుకు ముందుకు వొచ్చినట్టు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. బుధవారం నాడు లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ, తొలి టివిఎస్-2ఎం ఫ్యూయెల్ అసెంబ్లీస్(సన్నని పొడవైన ఇంధన కడ్డీల) ను మే-జూన్ 2022లో రష్యన్ ఫెడరేషన్ నుంచి అందుకుని, యూనిట్ -1లో లోడ్ చేశారని, అవి సంతృప్తికరంగా పని చేస్తున్నాయని తెలిపారు. కెకెఎన్‌పిపి రియాక్టర్లలో ప్రస్తుతం యూనిట్ -2లో ఉపయోగిస్తున్న యుటివిఎస్ ఫ్యూయెల్ అసెంబ్లీతో 12 నెలల నిర్వహణా ఆవృతాలకు బదులుగా 18 నెలల నిర్వహణ ఆవృతాలకు టివిఎస్-2 ఎం ఫ్యూయెల్ అసెంబ్లీలు అనుమతిస్తాయని డాక్టర్ జితేంద్ర సింగ్ వివరించారు.
కుదంకుళం యూనిట్ 1 అండ్ 2 రియాక్టర్లలో ఉపయోగిస్తున్న యుటివిఎస్ రకానికి బదులుగా మరింత అధునాతన ఇంధనం, అనగా టివిఎస్-2ఎం రకాన్ని ఇచ్చేందుకు రష్యా అంగీకరించిందని మంత్రి తెలిపారు. నిపుణులతో వివరణాత్మక చర్చల తర్వాత, టివిఎస్-2ఎం రకం ఫ్యూయెల్ అసెంబ్లీల మెరుగైన నిర్వహణా పనితీరును పరిగణనలోకి తీసుకున్న తర్వాత కుదంకుళం యూనిట్లు 1 అండ్ 2లో యుటివిఎస్ అసెంబ్లీల స్థానంలో టివిఎస్-2ఎం ఇంధనాన్ని ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.



