3 పిల్లర్లు కాదు…కుప్పకూలిన 3 వ్యవస్థలు
కేసీఆర్ తప్పుడు నిర్ణయం…కాళేశ్వరం నిర్మాణం
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై లక్షల కోట్లు వెచ్చించినా మారని పరిస్థితి
ఆదిలాబాద్ పార్లమెంట్ సన్నాహక సమావేశంలో టి.జె.ఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్
ఖానాపూర్, ప్రజాతంత్ర, మార్చి 24 : దేశ చరిత్రలోనే..ఇప్పటివరకు కాళేశ్వరంలా కూలిపో యిన ప్రాజెక్టు లేదని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. కాగ్ సూచనలను ఏమాత్రం పట్టించుకోకుండా గత ప్రభుత్వం సొంత నిర్ణయాలతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ జన సమితి పార్టీ నిర్మల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం ఖానాపూర్‌లో నిర్వహించిన ఆదిలాబాద్ పార్లమెంట్ స్థాయి సన్నాహక సమావేశంలో కోదండరామ్ మాట్లాడుతూ…కాళేశ్వరంలో 3 పిల్లర్లు కుంగి పోవటం కాదని..3 వ్యవస్థలు కుప్పకూలి పోయాయని ఆరోపించారు. గుండు గుత్తగా ప్రాజెక్టు నిర్మాణాన్ని కాంటాక్టులకు కేసీఆర్ ప్రభుత్వం అప్పజెప్పిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరం ప్రాజెక్టుపైన అసత్య ప్రచారాలు చేసి తప్పించుకుందామని ప్లాన్ చేస్తున్నారని విమర్శించారు. మేడిగడ్డ నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు 80 శాతం నీళ్లు ఎత్తిపోస్తామని గత ప్రభుతం మాటలు చెప్పిందని..కానీ మల్లన్న సాగర్‌లో 20 టీఎంసీలు నీళ్లు నింపితేనే 5 లక్షల మంది ప్రాణాలకు అపాయమని అధికారులు హెచ్చరిస్తున్నట్టు కోదండరామ్ గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సరైన విచారణ జరగకుండా డబ్బు ఖర్చు పెట్టకూడదని రేవంత్ రెడ్డి సర్కారుకు కోదాండరామ్ సూచించారు. కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టుల నిర్మాణాలను పూర్తిగా పక్కన పెట్టారని మండిపడ్డారు. అంతర్జాతీయ నిపుణుల సూచనలు తీసుకుని ప్రాజెక్ట్ మరమ్మతు విషయంలో ముందుకు వెళ్లాలని సూచించారు. ఒక డ్యామ్ పేరుతో లక్ష కోట్లు దోచుకున్నారని కేసీఆర్ కుటుంబంపై కోదండరామ్ తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై లక్షల కోట్లు వెచ్చించినా తెలంగాణ పరిస్థితి మారలేదని కోదండరామ్ ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల మాదిరిగానే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో కొట్టుకుపోయిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాదని, కాంట్రాక్టర్ల ప్రాజెక్టు అని, కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్ట్ అయ్యిందని విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు నిరుపయోగంగా మారాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన 25 వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందని మండిపడ్డారు. ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులకు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ (ఆర్ అండ్ ఆర్) ప్యాకేజీలో సరైన పరిహారం ఇవ్వలేదని విమర్శించారు. కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం ఉండదని తెలిసి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. ఐక్యరాజ్య సమితికి పని చేసిన హన్మంతరావు సైతం కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టవద్దన్నప్పటికి కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్నారు. కాగ్ నివేదికలో ఉన్న అంశాలు మనమే స్వంతంగా రాసినట్టుందని.. ప్రాజెక్ట్ నిర్మాణానికి ముందు ఆర్ధిక అంశాల గురించి అంచనా వేయకుండా నిర్మించారని ఆరోపించారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను కొందరికి గుండు గుత్తగా కేటాయించారని కాగ్ వెల్లడిరచిందన్నారు. కాళేశ్వరం ద్వారా రైతులకు సాగు నీరు అందించడం చాలా కష్టమని, ఒక ఎకరాకు నీరందించడానికి 46 వేల రూపాయలు ఖర్చు అవుతుందని కోదండరామ్ అన్నారు.
రాష్ట్రంలో 60 శాతం విద్యుత్ కాళేశ్వరం నిర్వహణకు అవసరం ఉంటుందని, కాళేశ్వరం ప్రాజెక్టులో మల్లన్న సాగర్ నిర్మాణం వల్ల ఆ ప్రాంతంలో భూకంపాలు వొచ్చే ప్రమాదం ఉందన్నారు. కేవలం కొండపోచ్చమ్మ కాలువ నిర్మాణానికి రూ.70 కోట్లు కేటాయించారని, గతంలో కడెం ప్రాజెక్ట్ మట్టి మాత్రమే కొట్టుకుపోయిందని..తర్వాత జరిగిన నిర్మాణంలో ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజ్‌లో పిల్లర్లు కుంగాయని, ఇంటికి ఒక్క పిల్లర్ కుంగితే ఇల్లు నిలబడుతుందా..అంటూ కోదండరాం ప్రశ్నించారు. కాళేశ్వరంలో మేడిగడ్డ నుంచి 80 శాతం నీళ్లు అందించే బ్యారేజ్ కూడా అదే పగుళ్ళు చూపిందన్నారు. కుంగింది మూడు పిల్లర్లు మాత్రమే కాదని.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు లక్షకు రూ. 87 వేలకోట్లు అప్పు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా కుప్పకూల్చారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ఇంజనిరింగ్ వ్యవస్థ నిర్వీర్యం జరిగిందని..దీనిపై సమగ్రంగా విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై భారం తగ్గేందుకు రీషెడ్యూల్ చెయ్యాలని కోరుతామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితి ఈ విధంగా మారడానికి కారణమైన బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని అన్నారు. సమావేశంలో టిజెఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




