హిమాయత్‌నగర్, ప్రజాతంత్ర, నవంబర్ 27 : నవరత్న వంటి అనేక ప్రభుత్వరంగ సంస్థలు స్థాపించి దేశంలోని లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించి, వారి సామజిక భద్రత కోసం కార్మిక చట్టాలు తీసుకవచ్చి, కార్మిక సంక్షేమం కోరే కాంగ్రెస్ పార్టీని ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని సీనియర్ ఐ.ఎన్.టి.యు.సి నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఐ.ఎన్.టి.యు.సి జాతీయ అధ్యక్షులు అంబటి కృష్ణమూర్తిలు రాష్ట్రంలోని కార్మికవర్గానికి విజ్ఞప్తి చేసారు. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐసీసీ మాజీ సభ్యులు, డా. సి.యాదగిరి, ఐ.ఎన్.టి.యు.సి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గుంజ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గూడా ఐలయ్య గౌడ్, సీనియర్ నాయకులూ సి.నాగరాజు, ఐ.ఎన్.టి.యు.సి జాతీయ కార్యదర్శి బి.అమర్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సన్ని యాదవ్ లతో కలసి సర్వ్ సత్యనారాయణ, అంబటి కృష్ణమూర్తిలు మాట్లాడుతూ కార్మికుల సామాజిక, ఆర్థిక దోపిడీ, అసమానతలను తొలగించడంలో ఫూర్తి ఉపాధి కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముందుంటుందని తెలిపారు. వేతనంతోపాటు పనికి భద్రత కల్పిస్తూ కార్మికుల జీవన ప్రమాణంలో ప్రగతిశీల మెరుగుదలను తీసుకవచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో వేతనాలు పెరగడంతోపాటు ఉద్యోగభద్రత ఉండేదని, పెన్షన్ విధానం కూడా సక్రమంగా అమలు చేసేదని అయన గుర్తు చేసారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో బిఆర్ఎస్ పాలనలో కార్మికులకు హక్కులు, సంక్షేమం, భద్రత లేకుండా పోయిందని అయన ఆరోపించారు. సోనియమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని, కాంగ్రెస్ ప్రసాదించిన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత పది సంవత్సరాలలో ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం కొత్త ఉద్యోగాలు కల్పించలేదు, ఉన్న కార్మికవర్గానికి చేసిందేమీ లేకుండా వారు హక్కులను కాలరాసిందని అయన మండిపడ్డారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి, ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలకు తగిన బుద్ధి చెప్పాలని కార్మికవర్గానికి సర్వ్ సత్యనారాయణ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఐ.ఎన్.టి.యు.సి నాయకులు చాంద్ పాషా, భాస్కర్, ప్రకాష్, ఎన్.నాగరాజు పాల్గొన్నారు.
కార్మికుల హక్కుల కోసం చట్టాలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీయే





