మా నాయకుడు రేవంత్ రెడ్డియే
మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11 : బీజేపీ కుల, మతాల మధ్య ఘర్షణ పెట్టి లబ్ది పొందాలని చూస్తుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. దేశ ఐక్యతకు జరగబోయే ఎన్నికలే నిదర్శనమన్నారు. రేవంత్ రెడ్డి 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటారన్నారు. కాంగ్రెస్ 10 ఏళ్లు అధికారంలో ఉంటుందన్నారు. కాంగ్రెస్లో ఏకనాథ్ షిండేలు లేరన్నారు. అలాగే తమ పార్టీలో గ్రూపులు లేవని కోమటిరెడ్డి అన్నారు.నల్గొండలో ఈద్గా వద్ద సీనియర్ నేత జానారెడ్డితో కలిసి ముస్లింలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సీఎం పదవిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నామని తెలిపారు. ఏకనాథ్ షిండేను సృష్టించిందే బీజేపీ అని కోమటిరెడ్డి అన్నారు. మంత్రి హరీష్ రావు, మహేశ్వర్ రెడ్డిలు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందన్నారు. పనికి రాని మాటలు, చిట్చాట్లు బంద్ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 14 సీట్లు గెలుచుకుంటుందన్నారు. బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు గెలుచుకుంటే తాను దేనికైనా సిద్ధమని సవాల్ విసిరారు. మా పార్టీ అంతర్గత విషయాల్లో మహేశ్వర్ రెడ్డి జోక్యం చేసుకోవద్దని కోమటిరెడ్డి వెంకటరెడ్డి హితవు పలికారు.





