ప్రజా పాలనలో పెన్నులు గన్నులయ్యాయా? అఇచ్చిన హామీలన్నీ విస్మరించారు
రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు..కాంగ్రెస్‌ను కూడా మోసగిస్తున్నారు..
మళ్లీ మోదీయే ప్రధాని అవుతారని చెప్పకనే చెప్పిండు
మీడియాతో చిట్‌చాట్‌లో మాజీ మంత్రి, సిద్ధిపేట ఎంఎల్ఏ హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వొచ్చాక విలేఖరులకు స్వేచ్ఛ లేకుండాపోయిందని, ప్రజాపాలనలో పెన్నులు గన్నులయ్యాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో చిట్ చాట్‌లో మాట్లాడుతూ.. తమ ప్రభుత్వంలో జర్నలిస్టులు సచివాలయంలో అన్ని ఫ్లోర్లు స్వేచ్చగా తిరిగేవారని, కానీ కాంగ్రెస్ ఎందుకు స్వేచ్ఛ ఇవ్వడం లేదని ప్రశ్నించారు. నిధులు దుర్వినియోగమని చెప్పిన ప్రభుత్వం ఆరుగురు పిఆర్వోలను ఎందుకు పెట్టుకున్నారని ఆయన నిలదీశారు. మంగళవారం నాటి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తనను చూసి, తన 100 రోజుల పాలన చూసి వోటు వేయాలని అడుగుతున్నాడని..కానీ అసలు 100 రోజుల పాలనలో ఏముందని ప్రశ్నించారు. వైట్ పేపర్…ఆ ఆపేర్ అంటూ కాషాయ పేపర్ మీద ఆయన లవ్ లెటర్ రాశారని ఎద్దేవా చేశారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి ప్రజలనే కాదు..కాంగ్రెస్ పార్టీని కూడా మోసం చేశాడని విమర్శించారు. గుజరాత్ మెడల్ ఫైల్ అని..గుజరాత్ మోడల్ కావాలని రేవంత్ అన్నాడని గుర్తుచేశారు. మళ్లీ మోడీ అధికారంలోకి వొస్తారని చెప్పారని ఆరోపించారు.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని చెప్పకనే చెప్పారని తెలిపారు. 3 నెలల పాలనలో అటు ప్రజలను, ఇటు కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నాడని విమర్శించారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పటి వరకు కూడా రుణమాఫీ లేదని, కనీసం ఇటీవలి బడ్జెట్లో కూడా రైతు రుణమాఫీకి నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే కరువు వొచ్చిందని, కొత్త బోరు బండ్లు వొచ్చాయని, ట్యాంకర్ల ద్వారా వరి పంటకు నీళ్లు పోస్తున్నారని ఎద్దేవా చేశారు. వృద్ధులకు రెండు వేలు పెన్షన్ కూడా ఇవ్వకుండా ఒక నెల ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. దీనిపై బాండ్ పేపర్ రాసిచ్చిచ్చారని, బాండ్ పేపర్ రాసి ఇచ్చిన వారిపై కేస్ పెట్టాలని అన్నారు. 6 గ్యారెంటీలల్లో 13 హామీలు ఉన్నాయని, అవన్నీ అమలు చేయాలని, అప్పుడే ప్రజలు వోటు వేయాలని హరీష్ రావు పిలుపునిచ్చారు. మహిళలను మహాలక్ష్మీలను చేస్తామన్న హామీ ఏమైందని, అడబిడ్డలు ఆలోచన చేయాలని ఆయన కోరారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా ఇస్తామన్నారని, ఇప్పుడు రక్తం పిండి వసూలు చేస్తున్నారని మండిపడ్డారు.
నాడు తాము అధికారంలోకి వొస్తే ఉచితంగా అన్నారని, ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఇస్తామన్న 4 వేలు భృతి ఏమైందని, ఆటోడ్రైవర్లకు ఇస్తామన్న రూ.12000 ఊసే లేదని ఆయన విమర్శించారు. ఆనాడు అప్పుల గురించి మాట్లాడారని, వారే ఇవాళ 16 వేల కోట్ల అప్పు చేశారని, ఇంకా అప్పుకోసం దిల్లీలో ప్రయత్నం చేస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు. బాండ్ పేపర్ రాసిచ్చిన డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీని సైతం తప్పుదోవ పట్టించారని విమర్శించారు. ఒక్క బిల్డింగ్‌లో 3 ఫ్లోర్లు ఉంటే అన్నదమ్ములు ఫ్లోర్లో ఒక్క కుటుంబం ఉంటుందని, అందులో ఒక్క కుటుంబానికి మాత్రమే రేషన్ కార్డు ఉంటుందని.. అలాంటప్పుడు మూడు మీటర్లకీ ఉచిత విద్యుత్ కింద గృహ లక్ష్మీ పథకం అమలు కాదని చెప్పారు. ఎప్పుడైనా ఎన్నికల కోడ్ వొచ్చే అవకాశం ఉందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవుతాడంటున్నారని, మరి అలాంటప్పుడు మోదీని సహకారం కావాలని ఎలా అడుగుతారని ప్రశ్నించారు. ఉపాధి హామీ పథకం కింద పనిచేసే 3000 మందికి ఇప్పటివరకు జీతాలు రాలేదని, ఎన్హెచ్ఎంలో రెండు నెలల నుంచి జీతాలు రాలేదని, వృద్దులకు, వితంతులకు, వికలాంగులకు ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టారని ఆరోపించారు.
విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు లేవని, విదేశీ విద్యకు ఇప్పటి వరకు పైసలు ఇవ్వడం లేదన్నారు. సీఎంఆర్ఎఫ్ కింద దాదాపు 70 వేల మంది దరఖాస్తులను పెండిరగ్లో పెట్టారని తెలిపారు. నాడు పోలవరం ప్రాజెక్టు వాల్ కొట్టుకుపోయిందని, డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిందని, కానీ ఇప్పటి వరకు రిపోర్ట్ లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఎన్డిఎస్ఏ రిపోర్ట్ 4 నెలల్లో వొస్తుందంటున్నారని, అప్పటి వరకు ఎందుకు సమయం పడుతుందని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత అనారోగ్యం కారణంగా అసెంబ్లీకి రాలేదని, ఆ విషయం రేవంత్‌కు కూడా తెలుసని, కానీ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి గురించి ఇష్టం వొచ్చినట్లు మాట్లాడుతున్నారని హరిష్ రావు మండిపడ్డారు. వెంకట్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.





