కాంగ్రెస్‌ ‌నాయకుల హామీలకు గ్యారెంటీ లేదు…వారెంటీ లేదు…

  • కిందికి నీళ్లు తీసుకుపోతే హారతి పట్టిన పార్టీ
  • 60 ఏళ్లు పట్టించుకోని పాలమూరు బిడ్డల అరిగోస
  • వనపర్తి బహిరంగ సభలో మంత్రి కెటిఆర్‌

వనపర్తి, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 29 : ‌కాంగ్రెస్‌ ‌నాయకుల మాటలు గ్యారెంటీ లేదు…వారెంటీ లేదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. జిల్లా కేంద్రంలోని మిషన్‌ ‌భగీరథ. సురవరం ప్రతాప్‌ ‌రెడ్డి గ్రంథాలయం భవనం, సమీకృత భవనం ప్రారంభోత్సవంతో పాటు వనపర్తి పెబ్బేరు బిటి రోడ్డు పనులకు శంకుస్థాపన సహా పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన భూమి పూజ నిర్వహించారు. అనంతరం పాలిటెక్నిక్‌ ‌భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ. గత కాంగ్రెస్‌ ‌ప్రభుత్వంలో నీళ్లు కిందికి తీసుకుపోతుంటే కాంగ్రెస్‌ ‌నాయకులు మాత్రం హారతి పట్టారని విమర్శించారు. 60 సంవత్సరాలుగా పాలమూరు బిడ్డలు అరగోస పడుతుంటే గత ముఖ్యమంత్రి గానీ మంత్రులు గాని ఏనాడు పట్టించుకోలేదని అన్నారు. 60 ఏళ్లలో చేయని పనులను మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గల దీటుగా అభివృద్ధిలో పోటీ పడుతూ చేస్తున్నాడని, అదే స్థాయిలో ఆయనకు ఈసారి లక్షకు పైగా మెజార్టీ ఇవ్వాలని కెటిఆర్‌ ‌ప్రజలను కోరారు.

నిరంజన్‌ ‌రెడ్డి గెలిస్తే వరదల నిధులు వొచ్చి అభివృద్ధి మరింత జరుగుతుందని ఆయన అన్నారు. 75 ఏళ్లలో దగుల్బాజీలు, అసమర్థులు పాలించారని, వారు చేయలేని పనులు మన ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌చేశాడని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కెసిఆర్‌తో కలిసి నిరంజన్‌ ‌రెడ్డితో పాటు పదిమంది వీరోచితంగా కష్టపడ్డారని, కానీ చంద్రబాబు, కాంగ్రెస్‌, ‌బిజెపి పార్టీలు అష్ట కష్టాలు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఆయన అన్నారు. ప్రస్తుతం లక్ష ఇరవై ఐదు వేల ఎకరాలులో సాగునీరు అందుతుందని, గతంలో సాగునీరు అందించడంలో ప్రతిపక్షాలు విఫలం చెందాయని ఆయన అన్నారు.

వనపర్తిలో వైద్య కళాశాల, కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, ఇంజనీరింగ్‌ ‌కాలేజీ. అగ్రికల్చర్‌ ‌యూనివర్సిటీ తీసుకొచ్చిన ఘనత మంత్రి నిరంజన్‌ ‌రెడ్డిది అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని పీర్లగుట్ట డబల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ‌చాలా బాగున్నాయని అదే విధంగా నిరుపేదలకు అందరికీ డబల్‌ ‌బెడ్‌ ‌రూమ్‌ ఇల్లు నిర్మాణం తోపాటు గృహలక్ష్మి పథకం అందిస్తామని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దేశంలో ఎక్కలేని విధంగా రైతు బీమా, రైతు బంధు, మిషన్‌ ‌భగీరథ, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ ‌వంటి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశం తెలంగాణ వైపు చూసే విధంగా అభివృద్ధి చేస్తున్నాడని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వొస్తే 24 గంటలు కరెంటు ఉండదని, సంక్షేమ పథకాలు అందవని ఆయన అన్నారు.

వోట్లు అడిగేందుకు మాయగాడు మోదీ వస్తున్నాడు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వకుండా పాలమూరుపై కక్ష పెట్టుకున్న ప్రధానమంత్రి మోదీ వోట్లు అడిగేందుకు మాయగాడిగా వొస్తున్నాడని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. న్యాయబద్ధంగా వొచ్చే టీఎంసీ నీళ్ల ఫైలుపై ఎందుకు సంతకం చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని రెండుసార్లు తీర్మానం చేసి పంపిస్తే సంతకం ఎందుకు పెట్టలేదని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రాంత సమస్యలపై పలు లెటర్లు రాస్తే ప్రధాని స్పందించకపోవడం విచారకరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మన్నే శ్రీనివాస్‌ ‌రెడ్డి. రాములు. ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌ ‌రెడ్డి. అబ్రహం. గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ ‌రజిని సాయిచంద్‌. ‌గట్టు తిమ్మప్ప ఉమ్మడి జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్‌ ‌బండారి భాస్కర్‌ ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌గట్టు యాదవ్‌. ‌వైస్‌ ‌చైర్మన్‌  ‌శ్రీధర్‌. ‌జిల్లా గొర్రెల పెంపకదారుల యూనియన్‌ ‌చైర్మన్‌ ‌కురుమూర్తి యాదవ్‌. ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *