- ఇంతకాలం చిత్తశుద్ధితో విధులను నిర్వర్తించా
- మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ
- కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకుని వెళతా
- దేశ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే రాహుల్ భారత్ జోడో యాత్ర
- నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్న నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే
కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ప్రమాణ స్వీకారంలో మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చాలా పెద్ద బాధ్యత అని పేర్కొన్నారు. తాను చిత్తశుద్ధితో ఇంతకాలం తాను విధులను నిర్వర్తించానని.. అదే విధంగా ఖర్గే కూడా నిలుస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టిన మల్లికార్జున ఖర్గేకు సోనియా అభినందనలు తెలిపారు. ఖర్గే కింది స్థాయి నుంచి పార్టీలోనే ఉంటూ అంచెలంచెలుగా ఎదిగిన నేత అని కొనియాడారు. ఖర్గే నేతృత్వంలో పార్టీ ముందుకు సాగుతుందనే విశ్వాసం తనలో ఉందన్నారు. పార్టీని నిరంతరం బలమైన వ్యవస్థగా నిలుపుతారని ఆశిస్తున్నానని సోనియా పేర్కొన్నారు. పార్టీ బాధ్యతలు చేపట్టడం ఒక సవాల్ అన్నారు. పార్టీ బాధ్యతలు, తన నుంచి ఖర్గేకు చేరాయన్నారు. కాంగ్రెస్ పార్టీ పరిస్ధితి దిగజారుతుందని అంగీకరిస్తూ దీనికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న అప్రజాస్వామిక పాలనను ఎలా ఎదుర్కునాలన్నదే ముందున్న అంశమన్నారు.
గతంలో పార్టీకి చాలా సవాళ్లు ఎదురయ్యాయన్నారు. అందరి ఐక్యత, వ్యూహాలతో ఆ సమస్యను ఎదుర్కునడంలో సరళీకృతం అయ్యామని సోనియా గాంధీ తెలిపారు. కాంగ్రెస్ చీఫ్‌గా తాను పూర్తి సామర్ధ్యంతో పనిచేశానని..ప్రస్తుతం ఈ బాధ్యతల నుంచి తప్పుకోవడం తనకు సంతృప్తి ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ కేవలం ఓ రాజకీయ పార్టీ మాత్రమే కాదని, ఇది ఏండ్ల తరబడి ఉద్యమ పథంలో సాగుతూ ముందుకు వెళుతున్న సంస్థ అని ఆమె అభివర్ణించారు. ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లను మనం ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులను అప్రమత్తం చేశారు. పార్టీ ముందు ఎన్నో సవాళ్లున్నాయని, దేశ ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న ప్రమాదంతో పోరాడటం అతిపెద్ద సవాలని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ శ్రేణులను ఉద్దేశించి ప్రసంగిస్తూ…తన వి•ద విశ్వాసం ఉంచి గెలిపించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు తన జీవితంలో చాలా ముఖ్యమైన రోజని.. ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీని రక్షించడమే మనందరి లక్ష్యం అని పేర్కొన్నారు.
తన అనుభంతో అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తానని తెలిపారు. అంతా కలిసి పార్టీని ఉన్నతస్ధాయికి తీసుకెళ్లాలని సూచించారు. రాత్రింబవళ్లు కష్టపడి పార్టీకోసం పనిచేస్తానని.. సోనియా గాంధీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తానని తెలిపారు. తొలిసారిగా పార్టీ చీఫ్‌గా మాట్లాడిన ఖర్గే, ‘ఒక కార్మికుడి కొడుకు, సాధారణ కాంగ్రెస్ కార్యకర్త పార్టీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడం అనేది.. ఊహించని పరిణామం అని పేర్కొన్నారు. కాంగ్రెస్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లడం గర్వించదగ్గ విషయమని ఖర్గే పేర్కొన్నారు. కాంగ్రెస్ సిద్దాంతాలను ముందుకు తీసుకెళ్లడమే తన లక్ష్యమని ఖర్గే పేర్కొన్నారు. దేశ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టారని పేర్కొన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రాహుల్‌తో లక్షలాది మంది కలిసి నడుస్తున్నారని తెలిపారు. రాహుల్ భారత్ జోడో యాత్ర లక్ష్యాన్ని వృథా కానివ్వమని ఖర్గే ఈ సందర్భంగా పేర్కొన్నారు.


