అరెస్టు అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమన్న మాజీ మంత్రి హరీష్ రావు
కవిత అరెస్టులో కుట్ర కోణం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్య
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 15 : ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా నేడు శనివారం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని బిఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించింది. వొచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసమే బిజెపి, కాంగ్రెస్ కలిపి కుట్ర చేసి అరెస్ట్ చేశాయని, దీనిపై రాజకీయంగా, న్యాయ పరంగా పోరాడటానికి సిద్దమని తెలిపింది. కవిత అరెస్టు నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ..అరెస్ట్ అప్రజాస్వామికం, అక్రమం, అనైతికమని, తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఎందుకంటే ఒకవైపు సుప్రీమ్ కోర్టులో కేస్ పెండిరగ్లో ఉండగా శుక్రవారం రోజు కావాలనే అరెస్ట్ చేశారని, శని, ఆదివారాల్లో కోర్టుకు సెలవు ఉంటుంది గనుక రాజకీయ దురుద్దేశంతో తమ మీద బురద జల్లాలని రాజకీయంగా తమను దెబ్బతీయాలని ఒక పథకం ప్రకారంగా కుట్రతో ఈరోజు బిజెపి మా శాసనమండలి సభ్యురాలిని అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని, ఎందుకంటే, కవిత అరెస్టు మీద ఇప్పటికే కేంద్ర మంత్రి సహా అనేక మంది బీజేపీ నాయకులు చాలామంది ప్రకటనలు చేశారని, ఈడి అధికారులు లాగా కవితను అరెస్టు చేస్తామని గత సంవత్సరన్నర కాలంగా బిజెపి నాయకులు, బిజెపి కేంద్ర మంత్రులు, బిజెపి ఎంపీలు పలుమార్లు ప్రకటన చేసిన విషయం కూడా అందరికీ కూడా తెలుసునని అన్నారు. శనివారం పార్లమెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ వొస్తుంది కనుక ఇప్పటికే ఈసీ ప్రకటన కూడా ఇచ్చిందని, శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామని తెలిసి ఈరోజు కవితను అరెస్టు చేయడం అంటే ఇది బిఆర్ఎస్ పార్టీని, కేసీఆర్‌ను డిమోరలైజ్ చేసేటటువంటి ఒక ప్రయత్నమని, తద్వారా ఈ ఎన్నికల్లో రాజకీయంగా లబ్ధి పొందాలని బిజెపి, కాంగ్రెస్ రాష్ట్రంలో కలిసి కుట్ర చేసాయని అన్నారు. అరెస్టులు గానీ, వేధింపులు గానీ, కుట్రలు గానీ తమకు, బిఆర్ఎస్కు కొత్త కాదని, ఇలాంటివి ఛేదించి తెలంగాణ రాష్ట్రం సాధించామని, 14 ఏళ్లు పోరాటం చేశామని, రాజకీయంగా, న్యాయపరంగా ఎదుర్కుంటామని, సుప్రీమ్ కోర్టులో అక్రమ అరెస్ట్ మీద కేసు వేసి లీగల్‌గా ఫైట్ చేస్తామన్నారు. సుప్రీమ్ కోర్టులో చెప్పిన మాటకు విరుద్ధంగా శుక్రవారం సాయంత్రం అరెస్టు చేయడం అంటే ఇది కచ్చితంగా రాజకీయ కుట్ర అని, 19వ తేదీ కేసు ఉంది కదా ఎందుకు అర్జెంట్‌గా అరెస్ట్ చేయాలని హరీష్ రావు ప్రశ్నించారు. మహిళలను ఈడి అరెస్టు చేయొచ్చా, చేయొద్దా అనే అంశం కోర్టులో ఉందని, మమతా బెనర్జీ కుటుంబ సభ్యురాలి పైన, నలిని చిదంబరం పైన, కవిత పైన ఈ అన్ని కేసులు కలిపి సుప్రీమ్ కోర్టు విచారిస్తున్నదని, ఒకవైపు సుప్రీమ్ కోర్టులో విచారణ జరుగుతుంటే, మూడు రోజుల ముందే అరెస్టు చేయడం అంటే, పార్లమెంట్ ఎన్నికల్లో తమను దెబ్బతీసే కుట్ర అని అర్థమవుతున్నదన్నారు.
ఎమర్జెన్సీని మించిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని, దౌర్జన్యంగా కవితను అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. గతంలో బిఆర్ఎస్ మంత్రులను, ఎమ్మెల్యేలను బెదిరించే ప్రయత్నం చేశారని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తే ప్రయత్నం కూడా చేశారని అన్నారు. రాజకీయంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, ఈ అప్రజాస్వామిక చర్యలకు నిరసనగా, కవిత అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా నేడు అన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ పిలుపు ఇస్తున్నదని తెలిపారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన అరెస్టు అని, కాంగ్రెస్, బిజెపిల దుర్మార్గపు చర్య అని, బిఆర్ఎస్ పార్టీ దీన్ని ప్రజాక్షేత్రంలో ఎదుర్కుంటుందని, బిజెపి కాంగ్రెస్‌లకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని అన్నారు. ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట అన్నారని, ఫ్లైట్ టికెట్లు కూడా బుక్ చేసుకుని వొచ్చారని, అంతా ఒక ప్రణాళిక ప్రకారం చేశారని, కోర్టుకు కూడా వెళ్లే అవకాశం లేకుండా చేశారని, నేడు శనివారం, రేపు ఆదివారం కనుక ఒక పథకం ప్రకారం చేశారని, ఎవరెన్ని చేసినా పోరాటాలు తమకు కొత్త కాదని, అక్రమ కేసులు నిర్బంధాలు కొత్త కాదని అన్నారు. ప్రజాక్షేత్రంలో ఉద్యమిస్తామని, న్యాయపరంగా పోరాటం చేస్తామని, నేడు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఎక్కడికక్కడ బిఆర్ఎస్ శ్రేణులు అక్రమ అరెస్టుకు నిరసనగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తారని హరీష్ రావు వెల్లడిరచారు.
కవిత అరెస్టులో కుట్ర కోణం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి వ్యాఖ్య
కవిత అరెస్టును తాము రాజకీయ కుట్రక్కోణంగానే చూస్తున్నామని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చిన కవిత తన విధిగా హాజరయ్యారు విచారణకు సహకరించారని, సిమ్ కార్డులను కూడా సబ్మిట్ చేశారని, నిందితురాలు కాదని చెప్పి పంపినవారు ఏడాది తర్వాత ఈరోజు హడావుడిగా అరెస్టు చేయడం అంటే ఇది కుట్రలో భాగమేనని అన్నారు. ఇంతకు మించిన దుర్మార్గపు చర్యలేదని, బిజెపి కేంద్ర ప్రభుత్వ సంస్థలను తన జేబు సంస్థలుగా మార్చుకున్నదని, సుప్రీమ్ కోర్టులో కేసు ఉండగా ఇలా చేయడం అప్రజాస్వామికమని, బిజెపి ఈ దేశంలో రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నదని, వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలపైన తన అధికారాన్ని ప్రయోగిస్తున్నదని, లొంగదీసుకునేందుకు అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నదని, ఎదురు నిలబడితే దౌర్జన్యం చేసి ఇలా కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నదని దుయ్యబట్టారు. బిజెపి విధానాలకు నిరసనగా నేడు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ తరఫున కోరుతున్నామని జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు.