కల్వకుంట్ల కుటుంబం నిర్బంధంలో తెలంగాణ

  • చట్టబద్ధ సంస్థలన్నీ నిర్వీర్యం
  • నిజాం పాలను గుర్తు చేస్తున్నారు
  • కుటుంబానికి ఆపదొస్తే తెలంగాణ సమాజానికి ముడి పెట్టడం ఏమిటి
  • త్వరలోనే కెసిఆర్‌ ‌ఖేల్‌ ‌కతం
  • మెరుగైన పాలన బిజెపి అందిస్తుంది
  • విలేఖరుల సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి

మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మార్చ్ 8 : ‌రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్తులు తరిగాయని, కల్వకుంట్ల కుటుంబ ఆస్తులు మాత్రం పెరిగాయని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మాత్యులు కిషన్‌ ‌రెడ్డి అన్నారు. బుధవారం పాలమూరు జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…కల్వకుంట్ల కుటుంబానికి ఆపదొస్తే తెలంగాణ సమాజానికి ముడి పెట్టడం ఏమిటని  ప్రశ్నించారు. తొమ్మిదేళ్లుగా తెలంగాణను దోచుకున్నది చాలదన్నట్టు. దిల్లీలో దోస్తీ కట్టి లిక్కర్‌ ‌కుంభకోణానికి తేరపతి తీసిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ అసెంబ్లీలో ఐదేళ్లు మహిళా మంత్రి లేకుండా పాలన కొనసాగించి నేడు మహిళా బిల్లు గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందన్నారు. నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వొచ్చిన నాడు దేశంలో మహిళల కంటే పురుష జనాభా ఎక్కువ ఉండేదని, అది గుర్తించిన ప్రధాని నరేంద్ర మోడీ బేటి బచావో.. బేటి పడావో అనే పథకం తీసుకు వొచ్చారని అన్నారు.

దాని ద్వారా మారుమూల ప్రాంతాలకు సైతం ఆడబిడ్డలు విద్యను అభ్యసించే దిశగా పాలన కొనసాగుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గంలో మహిళల స్థానం పెరిగిందన్నారు. ఈరోజు దేశ రక్షణ రంగంలో వాయుసేన యుద్ధ విమానాల విభాగానికి ఒక మహిళ నేతృత్వం వహించడం గర్వకారణమన్నారు. నరేంద్ర మోదీ  అట్టడుగు వర్గాలను సైతం గుర్తించి ఒక గిరిజన మహిళను రాష్ట్రపతిగా నియమించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 10 శాతం గిరిజన రిజర్వేషన్‌ ‌చేస్తానని మాయ మాటలు చెప్పి మోసం చేశారన్నారు. మొట్టమొదటిగా దళిత ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళిత సామాజిక వర్గాన్ని వెన్నుపోటు పొడిచారన్నారు. దళిత విద్యార్థులకు నేడు స్కాలర్షిప్‌లు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి దళిత విద్యార్థుల జాబితాను సరైన సమయంలో పంపకపోవడం వల్ల 300 కోట్ల రూపాయలు పేద దళిత విద్యార్థులకు అందకుండా పోతున్నాయని అన్నారు. దళిత బంధు ఈరోజు టిఆర్‌ఎస్‌ ‌బంధుగా మారిందన్నారు.

రైతులకు ఉచిత ఎరువులు ఇస్తానని చెప్పిన మాట ఏమైందని ఆయన ప్రశ్నించారు. ధరణి పేరుతో భూమి దోపిడీ జరుగుతుందన్నారు. శాసనసభ సమావేశాలలో  రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై సంక్షేమ పథకాలపై చర్చించడం లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిట్టడానికే సమావేశాలు జరుపుతున్నారని అన్నారు. డాక్టర్‌ ‌బాబాసాహెబ్‌ అం‌బేద్కర్‌ ‌రాసిన రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని రాష్ట్రవ్యాప్తంగా భూముల సెటిల్మెంట్లు చేసుకుంటున్నారని ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబ పాలన నుంచి విముక్తి కలిగించి, గుణాత్మకమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజాస్వామ్యం పాలన బిజెపి అందిస్తదని కిషన్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌లకు స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆయన అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలో గవర్నర్‌ ‌వ్యవస్థ ఒకటని, అలాంటి గవర్నర్‌ ఒక మహిళ అని చూడకుండా అవమానం చేస్తూ మంత్రులు మాట్లాడడం బాధాకరమన్నారు. పేదోడికి రోగం వొస్తే మరణమే శాసనంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్‌ ‌భారత్‌ ‌పథకం కింద ఐదు లక్షల రూపాయలతో వైద్య పొందే అవకాశం కల్పిస్తుందన్నారు.

అలాంటి పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడం లేదన్నారు. ఇప్పటివరకు నిరుపేదలకు ప్రభుత్వం ఇస్తున్న రేషన్‌ ‌కార్డులు ఏపీ ప్రభుత్వం పేరు పైనే ఉన్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేషన్‌ ‌కార్డులు ఇవ్వకపోవడంతో అర్హులైన పేదలు ఆ పథకం ద్వారా రేషన్‌ ‌పొందలేకపోతున్నారన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సమస్యలు తెలంగాణలో నెలకొన్నాయన్నరు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ క్షీణించింది కానీ కల్వకుంట్ల కుటుంబం ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీని తిట్టేందుకు ఆ డబ్బులను పంజాబ్‌, ‌హర్యానా, దిల్లీ, మహారాష్ట్ర, రాష్ట్రాలలో ఖర్చుపెడుతున్నారన్నారు. దిల్లీ లిక్కర్స్ ‌స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కుంటున్న కవిత తప్పు చేయకుంటే ఎందుకు తమ సెల్‌ ‌ఫోన్లను పగలగొట్టారో  చెప్పాలన్నారు. తమపై వొచ్చిన ఆరోపణలను నిరూపించుకోవాల్సింది పోయి, తెలంగాణ సభ్య సమాజానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. తప్పు చేస్తే సొంత కొడుకును సైతం క్షమించని సమాజం తెలంగాణ సమాజం అన్నారు. తెలంగాణలో మేము సైతం ఉన్నామని వారన్నారు. మరి మిగతా వారికి ఈడీ సమన్లు ఎందుకు ఇస్తలేదో అర్థం చేసుకోవాలి. తప్పు ఎవరు చేసినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని వారన్నారు. పత్రికా సమావేశంలో రాష్ట్ర కోశాధికారి శాంతి కుమార్‌, ‌రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పద్మజా రెడ్డి, నాయకులు ఎగ్గని నర్సింలు, ఎన్‌పీ వెంకటేష్‌, ‌శ్రీ వర్ధన్‌ ‌రెడ్డి, శ్రీనివాస్‌ ‌రెడ్డి, సుదర్శన్‌ ‌రెడ్డి, కృష్ణ వర్ధన్‌ ‌రెడ్డి, పాండురంగారెడ్డి, అచ్చు గట్ల అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *