ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 18 : తోటి మనిషికి ఆపద వస్తే మొఖం చాటేసే ప్రస్తుత కలికాలంలో అందుకు భిన్నంగా.. ఆ గ్రామస్తులంతా ఒక్కటై సహాయం అందించారు. ఒక కుటుంబ పెద్ద అనారోగ్యంతో మృతి చెందారు. వారికి గ్రామమంతా అండగా ఉందని భరోసానిస్తూ తోచిన విధంగా సహాయం చేసి చేయూతనందించారు. వివరాల్లోకి వెళ్తే ఆమనగల్లు మున్సిపాలిటీ లోని జంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన కమ్మరి వెంకటయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. గ్రామస్తులంతా మాట్లాడుకుని ఆ కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. తామంతా అండగా ఉన్నామని ఓదార్చారు. మృతుడి భార్య శ్రీదేవికి జంగారెడ్డిపల్లి గ్రామస్తులు, యువకులు మాజీ ప్రజా ప్రతినిధులు కలిసి రూ.30 వేల నగదు, 150 కేజీల బియ్యం బస్తాలు అందజేశారు. ఏ సహాయమైనా చేయడానికి తామంతా ముందు ఉంటామని మానవత్వాన్ని చాటారు. ఓ కుటుంబానికి బాసటగా నిలవడంతో జంగారెడ్డిపల్లి గ్రామస్తులను పలువురు అభినందిస్తున్నారు.



